స్థానిక ఎన్నికలపై మంతనాలు
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ గురువారం సమావేశమయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఉదయం ఈ భేటీ జరిగింది. కాన్వాయ్, భద్రతా సిబ్బంది లేకుండా పవన్ సీఎం ఇంటికి వచ్చారు. సుమారు అరగంట పాటు సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం తాత్కాలికంగా నిలిపివేయడంపై ప్రధానంగా చర్చ జరిగింది. తదుపరి ఎలా ముందుకెళ్లాలో చర్చించినట్టు తెలిసింది. రెబల్ అభ్యర్థుల వ్యవహారంపై కూడా భేటీలో చర్చ జరిగినట్టు సమాచారం.
సీట్ల సర్దుబాటు పూర్తయినా క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల్లోనూ టికెట్ దక్కని నేతలు రెబల్స్‌గా బరిలో నిలిచారు. ఒక పార్టీకి కేటాయించిన స్థానంలో మిత్రపక్షాల నేతలే పోటీకి దిగుతుండటంతో కూటమి ఓట్లు చీలుతాయన్న ఆందోళన నెలకొంది. రెబల్స్‌ను బుజ్జగించి, పోటీ నుంచి తప్పుకునేలా చేయాలని నేతలు నిర్ణయించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే చంద్రబాబు టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి రెబల్స్ పోటీ నుంచి తప్పుకోవాలని కోరారు.
ఎస్‌ఈసీ నిర్ణయాన్ని గౌరవిస్తాం : కూటమి ఉమ్మడి ప్రకటన
అంతకు ముందు ఎన్నికల సంఘం నిర్ణయంపై చంద్రబాబు, పవన్, మాధవ్ బుధవారం అర్థరాత్రి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఎస్‌ఈసీ నిర్ణయాన్ని గౌరవిస్తామని అందులో పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలను మొదటి రోజు నుంచే అడ్డుకునేందుకు వైఎస్సార్‌సీపీ ప్రయత్నిస్తోందని, కోర్టుల్లో పదుల సంఖ్యలో పిటిషన్లు వేసి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తోందని విమర్శించారు.


