పూర్తి వివరాలను మా ముందుంచండి
రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు
తదుపరి విచారణ నేటికి వాయిదా
డీఎస్‌పీ మురళీనాయక్ అధికార పార్టీకి తొత్తుగా మారారు
ఆయన ఉండగా ఎన్నికలు స్వేచ్ఛగా జరగవు
తక్షణం ఆయనను ఎన్నికల విధుల నుంచి తప్పించాలి
హైకోర్టులో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పిటిషన్
ఎస్‌ఈసీకి వినతి పత్రం ఇచ్చినా స్పందించలేదని వివరణ
సాక్షి, అమరావతి: పులివెందులలో అసలు ఏం జరుగుతోంది? అక్కడ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నెలకొన్న పరిస్థితులు ఏమిటి? అన్న అంశాలపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (ఎస్‌ఈసీ) హైకోర్టు గురువారం ఆదేశించింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న వైఎస్సార్ జిల్లా, పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ)ను ఆదేశించాలని కోరుతూ కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఆలపాటి గిరిధర్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది వీఆర్‌రెడ్డి కొవ్వూరి వాదనల్లో ముఖ్యాంశాలు..
» డీఎస్‌పీ మురళీ నాయక్ పూర్తిగా అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు.
» దాడుల్లో గాయపడిన ప్రతిపక్ష పార్టీ నేతలపై కేసులు నమోదు చేసి, దాడులకు పాల్పడిన అధికార పార్టీ నేతలను వదిలేస్తున్నారు.
» 2025 ఆగస్టు 12 న జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సమయంలోనూ మురళీ నాయక్ అధికార తెలుగు దేశం పార్టీకి అనుకూలంగా పక్షపాత ధోరణితో వ్యవహరించారు. నాయక్ మద్దతుతో దాదాపు 300 నుంచి 400 మంది అధికార పార్టీ మద్దతుదారులు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకున్నారు. ఇప్పుడూ ఇలాంటి అకృత్యాలకే పాల్పడుతున్నారు.
» డీఎస్‌పీ మురళీ నాయక్ సృష్టిస్తున్న సమస్యలకు సంబంధించిన ఆధారాలు, పత్రాలన్నింటినీ జతచేసి, అతన్ని బదిలీ చేయాలని కోరుతూ ఈ నెల 19వ తేదీన ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశాము. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉన్నప్పటికీ, సంబంధిత ఫిర్యాదుపై ఎస్‌ఈసీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
‘వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా అరాచకం
అక్టోబర్ 17 న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వెళుతుండగా పోలీసులు వారిని నామినేషన్ కేంద్రానికి 90 నుంచి 100 మీటర్ల దూరంలో అడ్డుకున్నారు. అభ్యర్థులు, కార్యకర్తలు శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా పోలీసులు లాఠీచార్జ్ చేసి, పిస్టళ్లతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు గాయపడ్డారు.
ఈ సంఘటనపై పులివెందుల అప్‌గ్రేడెడ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ప్రకారం... డీఎస్పీ 8 రౌండ్లు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ 10 రౌండ్లు, తొండూరు ఎస్సై 8 రౌండ్లు, ఇతర సిబ్బంది కాల్పులు జరిపినట్లు నమోదైంది. అంతేకాకుండా స్టన్ షెల్స్, స్మోక్ షెల్స్, గ్యాస్ గన్స్, హ్యాండ్ గ్రెనేడ్లను ఉపయోగించినట్లు అందులో నమోదైంది. ఈ కేసులో 62 మంది పేర్లు, మరో 500 మంది అజ్ఞాత వ్యక్తులను నిందితులుగా చేర్చారు. ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేయడానికే ఇంత మంది అజ్ఞాత వ్యక్తులను నిందితులుగా చేర్చారు’అని న్యాయవాది వీఆర్‌రెడ్డి కొవ్వూరి హైకోర్టుకు వివరించారు.


