వైఎస్సార్ కడప జిల్లా నందలూరు హైవేపై తుపాకీతో కాల్పులు జరుపుతున్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బాలసుబ్రమణ్యం
నామినేషన్లు వేయనివ్వకుండా అడుగడుగునా అడ్డుకున్న పచ్చమూక
సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా టీడీపీ గూండాలకు సహకరించిన పోలీసులు.. ఎక్కడికక్కడ నేతల గృహ నిర్బంధాలు.. బెదిరింపులు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లను యథేచ్ఛగా అడ్డుకున్న అధికారపక్షం
నామినేషన్లకు అడ్డంకులు.. పత్రాల చించివేత
మహిళలపైనా దాడులు.. చీరలు లాగివేత.. గాజులు పగులగొట్టి దాష్టీకం
పలుచోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పేరుతో దొంగ నామినేషన్లు
సర్కారు నిర్వాకంతో ఊరూరా రగులుతున్న రావణ కాష్టం
నెత్తురు మరిగిన తోడేళ్లులా తెలుగు తమ్ముళ్లు.. నిర్లజ్జగా, నిస్సిగ్గుగా పచ్చచొక్కాల దాష్టీకాలకు సహకరిస్తున్న పోలీసులు.. మహిళలపై దుశ్శాసనుల్లా ఎగబడుతున్న టీడీపీ గంజాయి బ్యాచ్ గూండాలు.. నాటి కౌరవుల సభను తలదన్నేలా వైఎస్సార్‌సీపీ మహిళా అభ్యర్థులను కించపరుస్తూనే ఉన్నారు.. చీర చెంగు లాగుతూ చెలరేగిపోతున్నారు.. మానవీయతను మరచిన మృగాళ్లులా పేట్రేగుతున్నారు.. ప్రజాస్వామ్యాన్ని ‘మంట’గలుపుతున్నారు. నేటి భారతావని భవిష్యత్‌ను ‘చించే’స్తున్నారు.. ‘స్థానిక’ సమరాంగణాన గూండాల్లా ఆంధ్రప్రదేశ్‌కు అపఖ్యాతిని అంటగడుతున్నారు...!
‘పచ్చ’ పోలీసులపై సుప్రీంలో పిటిషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ దాష్టీకాలకు, దుర్మార్గాలకు బహిరంగంగా, అడ్డగోలుగా సహకరిస్తున్న దాదాపు 70 మంది పోలీసు అధికారులపై దేశ సర్వోన్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టులో వైఎస్సార్‌సీపీ పిటిషన్ వేయనుంది. స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ.. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయకుండా అడుగడుగునా టీడీపీ రౌడీ మూకలు అడ్డుపడుతున్న విషయం తెలిసిందే. ఈ దారుణాలను వైఎస్సార్‌సీపీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది.
రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలనలో మునుపెన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యంపై దారుణ మారణకాండ కొనసాగుతోంది. స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా పక్కా పథకం ప్రకారం ఏడు దశల్లో ముప్పేట దాడి జరుగుతోంది. దశల వారీగా ఏమార్చి.. ప్రజాస్వామ్యాన్ని హతమారుస్తున్న పాపంలో అధికారపక్షం, పోలీస్, ఎస్‌ఈసీ భాగస్వాములు కావడం దిగ్భ్రాంతి పరుస్తోంది. సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించినా.. రాష్ట్రంలోని ప్రభుత్వం, పోలీస్, ఎస్‌ఈసీలకు చీమకుట్టినట్టు కూడా లేదు. సుప్రీంకోర్టు కర్రు కాల్చి వాత పెట్టినా రాష్ట్రంలో వారి తీరు మారలేదు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దశలో జరిగిన అకృత్యాలపై సాక్షాత్తు సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించి ఆదేశాలు ఇచ్చినా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల రెండవ రోజు కూడా పచ్చ మూకల దౌర్జన్యకాండ ఆగలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో స్థానిక ఎన్నికల్లో ప్రజాగ్రహం చవిచూడక తప్పదని భయపడుతున్న చంద్రబాబు అండ్ కో ఏకంగా ప్రజాస్వామ్యంపైనే దండయాత్రకు దిగింది. ఎలాగైనా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండకూడదని భావించిన వెన్నుపోటు పార్టీ.. కిరాయి రౌడీలను, పచ్చ గూండాలను, గంజాయి బ్యాచ్‌లను రంగంలోకి దించింది. అందుకు అత్యంత స్వామిభక్తి ప్రదర్శిస్తూ పనిచేసే పోలీసులను అడ్డగోలుగా వాడుకుంటోంది. ఫలితంగా ఊరూరా రావణ కాష్టం రగులుతోంది.
ప్రైవేట్ వ్యక్తి గన్ పేల్చితే.. పోలీస్ వైఫల్యం కాదా?
ఎన్నికల ముందు నుంచే బైండోవర్ల పేరుతో వైఎస్సార్‌సీపీ శ్రేణులను తీవ్ర వేధింపులకు గురిచేసిన పోలీసులకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఉన్న గన్‌ను స్వాధీనం (సీజ్) చేసుకోవాలని తెలియదా? అని ప్రజలు నిలదీస్తున్నారు. వైఎస్సార్ కడప జిల్లా నందలూరు నామినేషన్ల కేంద్రం వద్ద టీడీపీకి చెందిన డాక్టర్ బాలసుబ్రమణ్యం తన రివాల్వర్‌తో మూడు రౌండ్లు గాలిలో కాల్పులు జరపడం పోలీసుల వైఫల్యం కాదా అని ప్రశ్నిస్తున్నారు. తిరుపతిలో ఎలైట్ ఆసుపత్రి ఎండీగా ఉన్న బాలసుబ్రమణ్యం తన తల్లి నామినేషన్ కోసం కడప జిల్లాలోని సొంతూరు నందలూరుకు గురువారం వచ్చాడు. అక్కడ నామినేషన్ దశలో ఉద్రిక్తత నెలకొనడంతో ఆయన రివాల్వర్‌తో కాల్పలు జరిపారు. దీనికి పోలీసులు ఏం సమాధానం చెబుతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల రెండవ రోజు గురువారం కూడా దారుణ దురంతాలు కొనసాగాయి.
కడప జిల్లాలో దొంగ నామినేషన్లు
వైఎస్సార్ కడప జిల్లాలో దొంగ నామినేషన్ల పర్వం బట్టబయలైంది. చక్రాయపేట మండలంలో గురువారం నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి మొత్తం 11 నామినేషన్లు దాఖలు కాగా, అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా అసలైన వైఎస్సార్‌సీపీ నేతది కాదు. పెండ్లిమర్రి మండలంలోనూ మూడు దొంగ నామినేషన్లు వేశారు. చింతకొమ్మదిన్నె మండలంలో వైఎస్సార్‌సీపీ నిజమైన అభ్యర్థులు నామినేషన్లు వేయకపోయినా, కూటమి నేతలే ప్రతిపక్షం పేరును వాడుకుని ఏకంగా ఏడు నకిలీ నామినేషన్లు వేశారు. ఎర్రగుంట్ల మండలంలో వైఎస్సార్‌సీపీ తరఫున కూటమి నాయకులే స్వయంగా డమ్మీలుగా రంగంలోకి దిగారు. వలసపల్లె స్థానానికి పాతకోటకు చెందిన టీడీపీ వర్గీయుడు రఘునాథ్ రెడ్డి, ఆర్టీపీపీ కృష్ణానగర్ స్థానానికి గుంతకల్లుకు చెందిన నాగప్ప వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా ముసుగు వేసుకుని నామినేషన్లు వేశారు. పొట్లదుర్తి గ్రామానికి చెందిన మాధవి (మాతమ్మ)తో పాటు నరసింహులు అనే వ్యక్తి ప్రతిపక్ష అభ్యర్థులుగా పత్రాలు సమర్పించారు.
కొండాపురం మండలంలో మొనగోటి గంగమ్మ, కృష్ణారెడ్డి కుమారుడు ఎ.సిద్ధార్థ రెడ్డి, పెద్దన్న కుమారుడు వై.ప్రసాద్, పెద్దయ్య భార్య వై.సావిత్రిల చేత బలవంతంగా వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్లు దాఖలు చేయించి రికార్డులను తారుమారు చేశారు. మొత్తం 9 ఎంపీటీసీ స్థానాలు ఉన్న కలసపాడు మండలంలో అసలైన వైఎస్సార్‌సీపీ నేతలు ఎవ్వరూ నామినేషన్ వేయకుండా కట్టడి చేశారు. ఆ తర్వాత కోర్టు భయంతో టీడీపీ నేతలే వైఎస్సార్‌సీపీ పేరుతో 4 దొంగ నామినేషన్లు వేశారు. వైఎస్ కుటుంబ స్వగ్రామమైన బలపనూరు ఎంపీటీసీ స్థానానికి టీడీపీ నాయకుడే వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ముసుగు వేసుకుని దొంగ నామినేషన్ దాఖలు చేయడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. 
పేట్రేగిన పచ్చ రౌడీ మూకలు
వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని గృహ నిర్బంధం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆయన ఇంటి చుట్టూ ముళ్ల కంచె ఏర్పాటు చేసి భారీగా పోలీసులను మోహరించారు. అనంతరం వైఎస్ అవినాష్‌రెడ్డిని కడపలో అదుపులోకి తీసుకుని పులివెందుల పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చారు. లింగాల మండలంలోని తొమ్మిది జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వాలని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కోరినా పోలీసులు పట్టించుకోలేదు. కడప నగరంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డితోపాటు పలువురిని అదుపులోకి తీసుకుని బద్వేల్‌కు తరలించారు. జిల్లా వ్యాప్తంగా పలువురు నేతలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వైఎస్సార్ జిల్లాలో తమ పార్టీకి చెందిన జెడ్పీటీసీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారని, తగిన భద్రత కల్పించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్పీ, కలెక్టర్, ఎన్నికల కమిషన్‌ను కోరారు.
అన్నమయ్య జిల్లాలో కొనసాగిన అరాచకం
అన్నమయ్య జిల్లా పీలేరులో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు రహదారులపైనే అడ్డుకున్నారు. నేతలను గృహ నిర్బంధం చేశారు. కలకడ–కదిరాయచెరువు ప్రాంతంలో చిరంజీవి, శంకరమ్మ, రాధిక అనే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేసి నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేశారు. రాయచోటి నియోజకవర్గంలోని లక్కిరెడ్డిపల్లెలో నామినేషన్లు వేయడానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ నాయకులు ఢిల్లీ విశ్వనాథరెడ్డి, లక్ష్మీరెడ్డి, మహేంద్రబాబులపై దాడి చేశారు. వారి కారును ధ్వంసం చేసి కర్రలతో కొట్టడంతో మహేంద్రబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. తంబళ్లపల్లె, పెద్దమండ్యం, పెద్దతిప్పసముద్రంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై రాళ్లదాడి చేశారు. చౌడేపల్లి మండలం బోయకొండలో వైఎస్సార్‌సీపీ నేత జయచంద్ర భవనాన్ని కూల్చివేసే రూ.50 లక్షలు నష్టం కలిగించారు.
పెద్దకొండామర్రికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు గణేష్, నారాయణరెడ్డి, సాదిక్ లపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చౌడేపల్లె వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు నాగభూషణంరెడ్డి ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడిచేసి ధ్వంసం చేశారు. పుంగనూరులోనూ నామినేషన్లకు టీడీపీ శ్రేణులు అడ్డుపడ్డారు. యనమసామనపల్లిలో వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీనివాసులరెడ్డిపై పచ్చ రౌడీలు దాడికి దిగారు. నందలూరు ఎంపీపీ సీటు విషయంలో టీడీపీకి చెందిన మేడా విజయశేఖర్‌రెడ్డి, పార్టీ ఇన్‌చార్జి జగన్మోహన్‌రాజు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు.
ఉమ్మడి అనంతలో అదే దౌర్జన్యం
ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పరిటాల సునీత డైరెక్షన్‌లో టీడీపీ రౌడీ మూకలు వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడికి దిగాయి. పలువురి అభ్యర్థుల నామినేషన్లను లాక్కుని చింపేశారు. సాక్షి టీవీ రిపోర్టర్ మురళీపై దాడికి తెగబడ్డారు. కనగానపల్లికి వస్తోన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ఇనుపరాడ్లతో దాడులు చేశారు. చెన్నేకొత్తపల్లిలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ రాజు, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు ఎందుకు అనుమతించారంటూ వీరంగం వేశారు. తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరులో వైఎస్సార్‌సీపీ నాయకుడు శేషానందరెడ్డిపై టీడీపీ మూకలు దాడి చేసి గాయపరిచాయి. పెద్దవడుగూరులో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇచ్చిన జాబితాలో లేని ఆరు ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే నామినేషన్లు వేయడానికి అనుమతి ఇస్తామని సీఐ నరేంద్రరెడ్డి స్పష్టం చేశారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తిమ్మంపల్లిలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ శైలజానాథ్, ఎమ్మెల్సీ మంగమ్మలను అనంతపురంలో హౌస్ అరెస్టు చేశారు. గుంతకల్లులో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అ«భ్యర్థుల చేతుల్లోంచి నామినేషన్లను టీడీపీ మూకలు లాక్కుని చించివేశాయి. చింతలాంపల్లి మాజీ సర్పంచ్ బొజ్జనపై దాడి చేసి గాయపరిచాయి. వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి బురఖా ధరించి, పోలీసులు, టీడీపీ అల్లరిమూకల కళ్లు గప్పి ఎంపీడీఓ కార్యాలయంలోని ఎన్నికల అధికారుల ఎదుట ప్రత్యక్షమై పార్టీకి చెందిన 13 మంది ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లను అందజేస్తుండగా.. టీడీపీ శ్రేణులు వాటిని లాక్కొని చించివేశారు. బత్తలపల్లిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపైన కూటమి నేతలు రాళ్లు, కట్టెలు, బీరు సీసాలతో దాడులు చేసి భయోత్పాతం సృష్టించారు. వారికి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ అండగా నిలిచి.. రౌడీయిజానికి ఆజ్యం పోశారు. 
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థినిపై అసభ్యకరంగా చేతులు వేసి.. ఈడ్చేస్తున్న టీడీపీ గూండాలు
ఉమ్మడి గుంటూరు జిల్లాలో పోలీసుల రౌడీయిజం
పల్నాడు జిల్లా పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. నరసరావుపేట పెట్లూరివారిపాలెం మాజీ ఎంపీపీ మోరబోయిన శ్రీనివాసరావు ఇంటిపై అర్ధరాత్రి పోలీసులు దాడికి ప్రయత్నించారు. వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని గృహ నిర్బంధం చేసి స్థానికంగా అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో అక్రమాలపై ఎన్నికల కమిషనర్‌కు మాజీ మంత్రి విడుదల రజిని ఫిర్యాదు చేశారు. నిజాంపట్నంలో వైఎస్సార్ సీపీ నాయకుడు చిప్పల సాయిబాబాకు చెందిన ఇంట్లో ఫర్నిచర్, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. రేపల్లెలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు యేమినని రాంబాబు, కొక్కిలిగడ్డ రవి నామినేషన్లు లాక్కున్నారు. ఈపూరులో దాడులకు తెగబడ్డారు. ఇనుమెళ్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తరఫున వస్తున్న ప్రతిపాదకుడు రామినీడి అనిల్, చెవుల పెద్ద అంకారావులపై టీడీపీ అల్లరి మూకలు విచక్షణారహితంగా దాడి చేశాయి. చింతలతండా గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు రమావత్ శాంతిగబ్బర్‌సింగ్ దంపతులపై దాడికి పాల్పడ్డారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెచ్చిపోయిన గూండాలు
ఉమ్మడి చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పచ్చ మూక చించివేసి, అభ్యర్థులను అడ్డుకుంది. ఎస్‌ఆర్‌పురంలో పోలీసులు లాఠీచార్జి చేశారు. సీఎం చంద్రబాబు నియోజకవర్గ పరిధిలోని రామకుప్పం మండలంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ నామినేషన్లను పచ్చ గుండాలు అడ్డుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ పాకాల ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను టీడీపీ నాయకుడు చెన్నకేశవరెడ్డి బహిరంగంగా చించివేశారు. చంద్రగిరిలో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డి తదితరులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అభ్యర్థులతో నామినేషన్ కేంద్రాలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో గురువారం ఆరు మండలాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో 12 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గాయపడగా, ఎర్రావారిపాలెం ఎస్సైపైనా టీడీపీ గూండాలు దాడి చేశారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. 
చంద్రగిరిలో గురువారం ఎమ్మెల్యే నాని తమ అనుచరులకు వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పి, చంద్రగిరి–4 సెగ్మెంట్ నుంచి ఉగ్రాణం గురవా రెడ్డి, చంద్రగిరి–1 నుంచి సీతలు వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీటీసీలు నామినేషన్ వేసినట్లు పత్రాలను సమర్పించారు. శ్రీకాళహస్తి వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు, ఎంపీపీ అభ్యర్థి చెవిరెడ్డి మధుసూదన్‌రెడ్డిపై దాడి చేసి నామినేషన్ పత్రాలను చించివేశారు. ఓబులవారిపల్లె మండలంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి కె మౌనిక నామినేషన్ వేసేందుకు బయలుదేరగా, మార్గం మధ్యలో జనసేన పార్టీ నాయకులు ఆమె చేతులు పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆమెను నామినేషన్ వేసేందుకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో సీనియర్ నాయకులు ముద్దాబాబుల్‌రెడ్డి, రామిరెడ్డి ధ్వజారెడ్డి, సాయికిషోర్‌రెడ్డి, ముస్తాక్‌లను గురువారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శ్రీరంగరాజపురంలో వైఎస్సార్‌సీపీ వెంకటాపురం, తయ్యూరు ఎంపీటీసీ అభ్యర్థులు జయమ్మ, శిరీషా గురవారెడ్డి నామినేషన్లు దాఖలు చేసేందుకు రాగా.. పోలీసుల సమక్షంలోనే టీడీపీ నాయకుడు నిరంజన్‌రెడ్డి, జీవన్‌బాబు, రామిరెడ్డి కలిసి నామినేషన్లు చించివేశారు. జయమ్మ చీరను సైతం లాగేశారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో బాలగంగానపల్లి పంచాయతీకి చెందిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు మోహన, వింజం పంచాయతీకి చెందిన నాగరత్నమ్మల వద్ద నుంచి టీడీపీ రౌడీ మూకలు నామినేషన్ పత్రాలను లాక్కున్నాయి. వారి చీర లాగి దాడి చేశాయి.


