జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయాలంటే అభ్యర్థి యుద్ధమే చేయాల్సి వస్తోంది. తొలుత పచ్చమూకల బారి నుంచి పత్రాలను భద్రంగా తీసుకెళ్లాలి.. ఆపై ఖాకీల నాలుగంచెల భద్రత దాటాలి.. ఎలాగోలా యుద్ధం చేసి అక్కడికెళితే.. ‘నామినేషన్‌ వేస్తే తిరిగి వెళ్లలేవ’ంటూ..పచ్చ నేత | - | Sakshi
Sakshi News home page

జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయాలంటే అభ్యర్థి యుద్ధమే చేయాల్సి వస్తోంది. తొలుత పచ్చమూకల బారి నుంచి పత్రాలను భద్రంగా తీసుకెళ్లాలి.. ఆపై ఖాకీల నాలుగంచెల భద్రత దాటాలి.. ఎలాగోలా యుద్ధం చేసి అక్కడికెళితే.. ‘నామినేషన్‌ వేస్తే తిరిగి వెళ్లలేవ’ంటూ..పచ్చ నేత

Oct 23 2026 2:27 AM | Updated on Oct 23 2026 2:27 AM

నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు....

మా అభ్యర్థులకు భద్రత కల్పించండి

● పరిషత్‌ పోరులో వరుసగా రెండోరోజూ టీడీపీ నేతల దౌర్జన్యం ● నామినేషన్‌ వేస్తే బయటికి వెళ్లలేరంటూ పుత్తా బెదిరింపులు ● ప్రజాప్రతినిధులు, ప్రధాన నేతలందర్నీ నిర్బంధించిన పోలీసులు ● సుప్రీంకోర్టు ఆదేశించినా కలెక్టర్‌, ఎస్పీల్లో మార్పు శూన్యం

సాక్షి ప్రతినిధి, కడప: ఎంపీటీసీ, జెడ్పీటీసీల నామినేషన్ల పర్వంలో ఖాకీల తీరు మారలేదు. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నాయకులను కట్టడి చేయడానికే శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ప్రజాప్రతినిధులతోపాటు నామినేషన్లు దాఖలు చేస్తారని భావించిన నేతలందర్నీ అక్రమంగా నిర్భందిస్తున్నారు. బలవంతపు అరెస్టులకు పాల్పడుతున్నారు. ఇటీవల మున్సిపాలిటీ నామినేషన్ల ప్రక్రియతో అభాసుపాలైనా జిల్లా యంత్రాంగం తీరు మార్చుకోకపోవడంతో ప్రజాస్వామ్య వాదుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కొనసాగుతున్న అక్రమ అరెస్టులు...

జిల్లా వ్యాప్తంగా అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం కడపలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో ఉన్న ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, కమలాపురం, కడప ఇన్‌ఛార్జిలు నరేన్‌ రామాంజులరెడ్డి, మాజీ మంత్రి ఎస్‌బీ అంజద్‌ బాషా, మాజీ జెడ్పీ చైర్మన్‌ సురేష్‌బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డితో పాటు పలువురు కీలక నేతలు జెడ్పీటీసీ అభ్యర్థులతో సమావేశమయ్యారు. ఈవిషయాన్ని తెలుసుకున్న పోలీసులు భారీ బలగాలతో కార్యాలయాన్ని చుట్టుముట్టాయి. ఏఎస్పీ ప్రకాష్‌బాబు, డీఎస్పీ భవానీ దగ్గరుండి ప్రధాన నేతల అరెస్టుకు పురిగొల్పారు. కార్యకర్తలు తీవ్ర ప్రతిఘటన చేసినా వందలాది మంది పోలీసులు ఒక్కసారిగా కార్యాలయంలోకి చొచ్చుకురావడంతో నిలువరించలేకపోయారు. బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వాహనంలో ఎక్కించారు. కడపలో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని నేరుగా పులివెందులకు తీసుకెళ్లి, అక్కడ స్థానిక పార్టీ కార్యాలయం వద్ద నిర్భంధించారు. తక్కిన నేతలందర్నీ అట్లూ రు పోలీసుస్టేషన్‌లో నిర్భందించారు. జిల్లా వ్యాప్తంగా నామినేషన్‌ దాఖలు చేస్తారని భావించిన నేతలందర్నీ పోలీసులు అక్రమంగా నిర్భందించారు.

మహిళ పట్ల దమనకాండ...

నామినేషన్లు దాఖలు చేయడానికి ఎవరొచ్చినా సరే, అడ్డుకొని తగిన రీతిలో బుద్ధి చెప్పడమే తెలుగుదేశం నేతల దుర్నీతి అయ్యింది. మహిళలను కనీస గౌరవం లేకపోగా దమనకాండ ప్రదర్శించారు. వేలాది మంది మహిళలు ర్యాలీగా తరలివస్తే, వేములలో టీడీపీ శ్రేణులతో కలిసి పోలీసులు అడ్డుకున్నారు. జిల్లావ్యాప్తంగా మహిళల నామినేషన్‌ పత్రాలు చించేశారు. మానవత్వం మర్చిపోయి చాపాడులో నామినేషన్‌ వేసేందుకు వచ్చిన నిండు గర్భిణీ ప్రశాంతిపై తెలుగుతమ్ముళ్లు దాడి చేసి నామినేషన్‌ పత్రాలు లాక్కున్నారు. ఇక కడపలోని నామినేషన్‌ కేంద్రానికి చేరుకొన్న మహిళ జెడ్పీటీసీలు అభ్యర్థులపై విచక్షణ మరిచి రాళ్లదాడులకు తెగబడ్డారు. తెలుగుతమ్ముళ్లు కర్రలు,కత్తులు పట్టుకొని ప్రత్యక్షదాడులకు తెగబడ్డారు.

మున్సిపల్‌ పోరులో వైఎస్సార్‌ కడప జిల్లాలో 9 పట్టణాల్లో నామినేషన్లు ప్రక్రియను సుప్రీంకోర్టు ఎండగట్టింది. ఏకపక్షంగా వ్యవహారించిన వ్యవస్థల తీరుపై మండిపడింది. జిల్లా రాజకీయ చరిత్రలోనే ఇదో మాయని మచ్చ. అలాంటి పరిస్థితి మళ్లి జెడ్పీటీసీ నామినేషన్లు సందర్భంగా తెరపైకి వస్తోంది. సుప్రీంకోర్టు తప్పుబట్టినా కలెక్టర్‌, ఎస్పీల్లో మార్పు రాలేదు. పైగా ఏకపక్ష చర్యలను కొనసాగిస్తున్నారు. మమ అన్పించేందుకు నిర్ణయాలుండడం మినహా అభ్యర్థులకు భద్రత కల్పించి నామినేషన్‌ హక్కును కొనసాగించాలనే ఆలోచన మిన్నకుండిపోయిందని ప్రజాస్వామ్యవాదులు వాపోతున్నారు. కలెక్టర్‌ సుదీర్ఘ అనుభవం అక్రమ మార్గాలకు వత్తాసుగా నిలుస్తోందని పలువురు మండిపడుతున్నారు. ఎస్పీబంగళా, కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న జెడ్పీ ప్రాంగణంలో కొనసాగుతున్న దౌర్జన్యాలు, దొమ్మిలు వారి కనపడలేదు, వినపడలేదని పలువురు వాపోతున్నారు. చివరి రోజైనా నామినేషన్లు వేయించేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా వైఎస్సార్‌సీపీ నేతలు కోరుతున్నారు.

కడపకార్పొరేషన్‌: జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు భద్రత కల్పించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌ రెడ్డి కోరారు. గురువారం ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌ షెల్కేతోపాటు, ఎస్‌ఈసీకి ఆయన ఫిర్యాదు చేశారు. తమ పార్టీ ప్రకటించిన అంబటి సుగుణ, రాజంరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, అనగాని లక్ష్మి ప్రసన్న, కనపర్తి దివ్య, బాలాయపల్లి ఓబులేసు, మేరవ ఓబయ్య, బత్తల వెంకట శివమ్మ, దేవిరెడ్డి శ్రీవాణి, కొప్పల శివశంకర రెడ్డి, కొవ్వూరు ప్రమీల, నాగెళ్ల సత్యప్రభావతమ్మ, పెద్దమల్లు సావిత్రి, బొందలకుంట గంగాధర్‌, మార్తల ధనలక్ష్మి, తిమ్మప్పగారి వెంకట శివారెడ్డి, నారపురెడ్డి మోహన్‌రెడ్డి, అరవ విజయభాస్కర్‌రెడ్డి, పత్తికాపులు సునీత, పాత జోగయ్య, మలిరెడ్డి మమత, బూర నాగలక్ష్మి, దాసరి ప్రభావతమ్మ, చిట్టిబోయిన పిచ్చమ్మ, సుదా అనురాధ, అట్టూర్‌ సుబ్బరాయుడు, మర్రి సుబ్బన్న, కల్లూరి రఘునాథరెడ్డి, దాసరి మహేష్‌ తదితరులకు నామినేషన్‌ వేయడానికి భద్రత కల్పించాలని అందులో పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడం పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, వారికి ఎలాంటి అడ్డంకులు కల్పించకుండా నామినేషన్లు వేసేలా చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఎస్పీ, ఎస్‌ఈసీతోపాటు డీఐజీ, కలెక్టర్లకు కూడా ఆయన ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement