చిత్తూరులో మాయాజాలం! | 559 nominations withdrawn in four hours in Chittoor | Sakshi
Sakshi News home page

చిత్తూరులో మాయాజాలం!

Oct 23 2026 5:41 AM | Updated on Oct 23 2026 5:41 AM

559 nominations withdrawn in four hours in Chittoor

నాలుగు గంటల్లో 559 నామినేషన్లు ఉపసంహరణ?   

తప్పుడు సంతకాలతో టీడీపీ నేతలు, ఆర్వోల నిర్వాకం 

ఆపై 47 మంది టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవమంటూ డిక్లరేషన్లు 

కలెక్టర్‌ నివేదిక కోరడంతో ఆర్వోల గుండెల్లో రైళ్లు

సాక్షి, చిత్తూరు: చిత్తూరులోని 60 డివిజన్లకుగాను 47 డివిజన్లలో టీడీపీ కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారంటూ రిటర్నింగ్‌ అధికారులు (ఆర్‌వో) డిక్లరేషన్లు ఇవ్వడం కలకలం రేపింది. గెలుపొందిన కార్పొరేటర్‌ అభ్యర్థుల జాబితాను నోటీసు బోర్డులో ఉంచడంతో పాటు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సైతం పంపించేశారు. వాస్తవానికి చిత్తూరు కార్పొరేషన్‌లోని 60 డివిజన్లలో కార్పొరేటర్‌ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు అందరూ మూడు రోజుల నుంచి తమిళనాడులోని ఏలగిరి, తదితర ప్రాంతాల్లో విడిదిలో ఉన్నారు. ఆ విషయాన్ని వీడియోల ద్వారా జిల్లా కలెక్టర్, మునిసిపల్‌ కమిషనర్, ఇతర అధికారులందరికీ స్పష్టంగా తెలియచేశారు. దీంతో నగరంలోని 15 ఉపసంహరణ కేంద్రాలను చిత్తూరు కార్పొరేషన్‌ కార్యాలయానికి తరలించారు. 

మొత్తం సీసీ ఫుటేజీల పర్యవేక్షణలో ఇక్కడే ఉపసంహరణ ప్రక్రియ జరిగేలా కలెక్టర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడికి ఏ ఒక్క వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కానీ రానేలేదు. ఆ ప్రాంతాన్ని టీడీపీ గూండాలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కార్పొరేషన్‌ కార్యాలయానికి వెళ్లే మూడు దారులనూ చుట్టు ముట్టారు. అయితే బరిలో ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల బీ–ఫారాలను మేయర్‌ అభ్యర్థి చంద్రశేఖర్‌.. కార్పొరేటర్‌ అభ్యర్థులు గడ్డం రమణ, పులికంటి గోపి.. కమిషనర్‌కు ఇవ్వడానికి కార్పొరేషన్‌ కార్యాలయం లోపలకు అడుగుపెట్టగా.. వందలాది మంది టీడీపీ గూండాలు వీరిపై దాడికి పాల్పడ్డారు. బీ–ఫారాలను లాక్కొని చింపి, గాల్లోకి విసిరేశారు. 

ఈ మొత్తం ప్రక్రియను వీడియోలో చిత్రీకరిస్తున్న సమాచార–పౌరసంబంధాల శాఖ ఉద్యోగి జగన్‌పై దాడిచేసి, కెమెరాను ధ్వంసం చేశారు. అయితే వైఎస్సార్‌సీపీ నేతలు మరోమారు బీ–ఫారాలను కలెక్టర్‌కు అందజేశారు. కాగా,  వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణకు అస్సలు రానేలేదు. అలాంటప్పుడు 606 నామినేషన్లలో ఏకంగా 559 నామినేషన్లను ఉపసంహరించుకోవడం ఎలా సాధ్యమైందన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల మధ్య.. అంటే నాలుగు గంటల వ్యవధిలో 559 నామినేషన్లు ఉపసంహరించుకోవడం అసాధారణమైన విషయం. ఈ విషయమై ప్రస్తుతం చిత్తూరు కలెక్టర్‌.. ఆర్‌వోల నుంచి సంజాయిషీ కోరడంతో వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తప్పుడు సంతకాలు పెట్టి, 559 నామినేషన్లు ఉపసంహరించారని  సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement