ఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి న్యాయస్థానంలో ఊరట లభించింది. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై 2018లో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దాఖలైన క్రిమినల్ పరువు నష్టం కేసులో ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు రాహుల్ గాంధీని నిర్దోషిగా ప్రకటించింది. రాహుల్ చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించే స్వభావం కలిగి లేవని కోర్టు పేర్కొంది. కాగా, తీర్పు వెలువడే సమయంలో రాహుల్ గాంధీ స్వయంగా కోర్టుకు హాజరయ్యారు.
2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఈ వివాదం తలెత్తింది. అప్పట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షాపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆరోపిస్తూ స్థానిక బీజేపీ నేత విజయ్ మిశ్రా పరువు నష్టం ఫిర్యాదు చేశారు. 2018 ఆగస్టు 4న ఆయన ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. బెంగళూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ అమిత్ షాను హత్య కేసులో నిందితుడిగా పేర్కొన్నారని ఫిర్యాదుదారు ఆరోపించారు. ఈ వ్యాఖ్యల వల్ల అమిత్ షా ప్రతిష్ఠకు భంగం కలిగిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 499, 500 కింద క్రిమినల్ పరువు నష్టం కేసు నమోదైంది.
సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు ప్రస్తావన
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసుకు సంబంధించినవిగా వార్తా నివేదికలు పేర్కొన్నాయి. ఈ కేసులో అమిత్ షాను 2014లో ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టు అభియోగాల నుంచి విముక్తి చేసింది. అయితే, 2018లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయని ఫిర్యాదుదారు వాదించారు. మరోవైపు, తన వ్యాఖ్యలను సందర్భం నుంచి వేరు చేసి చూపించారని రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండించారు. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలు, సాక్ష్యాల ఆధారంగా కోర్టులో విచారణ కొనసాగింది.
#BREAKING: Sultanpur Court ACQUITS Lok Sabha LoP Rahul Gandhi in a 2018 criminal defamation case over alleged remarks against then BJP president Amit Shah. https://t.co/IgmjFKMcUQ
— Live Law (@LiveLawIndia) October 26, 2026
ఐదేళ్లకు పైగా కొనసాగిన న్యాయపోరాటం
ఈ కేసులో విచారణకు హాజరు కావాలని కోర్టు 2023లో రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. అనంతరం ఆయన కోర్టుకు హాజరై బెయిల్ పొందారు. కేసు విచారణలో భాగంగా ఫిర్యాదుదారు రాహుల్ గాంధీ ప్రసంగానికి సంబంధించిన వాయిస్ రికార్డుతో ఆయన స్వర నమూనాను పోల్చాలని కోరారు. అయితే, ట్రయల్ కోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. దీనిపై దాఖలైన విచారణ పిటిషన్‌ను సెషన్స్ కోర్టు కూడా కొట్టివేసింది. అనంతరం అలహాబాద్ హైకోర్టులోనూ ఈ నిర్ణయాలను సవాలు చేయగా, అక్కడ కూడా ఫిర్యాదుదారుకు అనుకూలంగా తీర్పు రాలేదు. ఇరుపక్షాల వాదనలు పూర్తయిన తర్వాత కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తొలుత అక్టోబర్ 13న తీర్పు వెలువరించాలని నిర్ణయించినప్పటికీ, అనంతరం అక్టోబర్ 26కు వాయిదా వేసింది.
కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ..
తీర్పు వెలువడనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ సోమవారం ఉదయం లక్నోకు చేరుకుని అక్కడి నుంచి సుల్తాన్‌పూర్‌కు వెళ్లారు. ఆయన రాక నేపథ్యంలో కోర్టు పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ శుభమ్ వర్మ తీర్పు వెలువరించారు. తాజా తీర్పుతో 2018లో నమోదైన ఈ క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీపై విచారణ ముగిసింది. అమిత్ షాపై వ్యాఖ్యలకు సంబంధించిన ఈ కేసులో రాహుల్ గాంధీ నిర్దోషిగా విడుదల కావడం న్యాయపరమైన ఊరట లభించింది.
ఇదీ చదవండి: రాహుల్ గాంధీకి త్రుటిలో తప్పిన ప్రమాదం


