న్యూఢిల్లీ: నిద్రలో మన శరీరంలో చోటుచేసుకునే మార్పులు భవిష్యత్తులో ఎదురయ్యే అనారోగ్య సమస్యల ముప్పును గుర్తించడంలో కీలక పాత్ర పోషించవచ్చని ఓ అధ్యయనం వెల్లడించింది. గుండె వైఫల్యం నుంచి డిమెన్షియా, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధుల వరకు పలు ఆరోగ్య సమస్యలతో సంబంధం ఉన్న సంకేతాలను నిద్ర రికార్డుల ద్వారా గుర్తించే అవకాశాలున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. నేచర్ మెడిసిన్ వైద్య పత్రికలో ప్రచురితమైన ఈ అధ్యయనం.. నిద్ర సమాచారాన్ని కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో విశ్లేషించడం ద్వారా సాధారణ నిద్ర సమస్యలను గుర్తించడానికే కాకుండా, భవిష్యత్తు ఆరోగ్య ముప్పులపై అవగాహన పొందవచ్చని సూచించింది.
5.85 లక్షల గంటల నిద్ర రికార్డుల విశ్లేషణ
‘ఎ మల్టీమోడల్ స్లీప్ ఫౌండేషన్ మోడల్ ఫర్ డిసీజ్ ప్రిడిక్షన్’ పేరుతో ఈ పరిశోధన సాగింది. ఇందులో భాగంగా పరిశోధకులు ‘స్లీప్‌ఎఫ్‌ఎం’ అనే ఏఐ నమూనాను అభివృద్ధి చేశారు. సుమారు 65 వేల మంది నుంచి సేకరించిన 5.85 లక్షల గంటలకు పైగా నిద్ర రికార్డులతో దీనికి శిక్షణ ఇచ్చారు. ఈ నమూనా ద్వారా భవిష్యత్తులో 130 రకాల ఆరోగ్య సమస్యల ముప్పుతో సంబంధం ఉన్న నమూనాలను గుర్తించారు. వీటిలో డిమెన్షియా, గుండె వైఫల్యం, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు ఉన్నాయి. నిద్ర సమయంలో నమోదయ్యే వివిధ శారీరక సంకేతాలను కలిపి విశ్లేషించడం ఈ సాంకేతికత ప్రత్యేకత.
శ్వాసలో మార్పులు.. గుండె కొట్టుకునే వేగంపై నిఘా
నిద్రలో శ్వాసకు మధ్య విరామాలు ఏర్పడటం, రక్తంలోని ఆక్సిజన్ స్థాయుల్లో హెచ్చుతగ్గులు, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి మార్పులు కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతాలు కావచ్చని ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ కన్సల్టెంట్ డాక్టర్ చిరాగ్ డీ తెలిపారు. ముఖ్యంగా అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వంటి సమస్యలను గుర్తించడంలో ఇవి ఉపయోగపడవచ్చన్నారు.
రక్తపోటుపైనా నిద్ర ప్రభావం
స్లీప్ అప్నియా శరీరంలో ఒత్తిడికి సంబంధించిన ప్రతిస్పందనలను ప్రేరేపించి రక్తపోటును పెంచవచ్చు. అదేవిధంగా, గుండె వేగంలో మార్పులు నాడీ వ్యవస్థ పనితీరులో చోటుచేసుకునే మార్పులను సూచించవచ్చని వైద్యులు పేర్కొన్నారు. అయితే, నిద్రలో ఇలాంటి మార్పులు కనిపించినంత మాత్రాన ఒక నిర్దిష్ట వ్యాధి అభివృద్ధి చెందుతోందని నిర్ధారించలేమని స్పష్టం చేశారు. ఈ సంకేతాలను వ్యక్తి ఆరోగ్య పరిస్థితి, లక్షణాలు, ఇతర వైద్య వివరాలతో కలిపి పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు.
మరిన్ని అధ్యయనాలు అవసరం
నిద్రకు సంబంధించిన గణాంకాల్లో కనిపించే సంబంధాలను గుర్తించడం, ఒక వ్యక్తికి భవిష్యత్తులో ఏ వ్యాధి వస్తుందో కచ్చితంగా అంచనా వేయడం ఒకటి కాదని కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ మజీద్ పాషా వివరించారు. పని వేళలు, సామాజిక-ఆర్థిక పరిస్థితులు, జీవనశైలి, సాంస్కృతిక అలవాట్లను బట్టి నిద్ర విధానాలు మారుతుంటాయని పేర్కొన్నారు. అందువల్ల భారతీయుల నిద్ర ప్రయోగశాలల నుంచి సేకరించిన సమాచారంతో ఈ నమూనాను స్వతంత్రంగా పరీక్షించడం ముఖ్యమన్నారు. వివిధ జనాభా సమూహాలు, వైద్య పరిస్థితుల్లో దీని పనితీరును నిర్ధారించిన తర్వాతే విస్తృతంగా ఉపయోగించడంపై స్పష్టత వస్తుందని తెలిపారు.
డిమెన్షియా ముప్పును నిద్రతో గుర్తించగలమా?
తరచూ మేల్కొనడం, స్లీప్ సైకిల్స్‌లో మార్పులు, మెదడు తరంగాల కార్యకలాపాల్లో తేడాలు వంటి అంశాలు అల్జీమర్స్ వంటి నాడీ క్షీణత వ్యాధులతో సంబంధం కలిగి ఉన్నాయా అనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయని న్యూరాలజీ నిపుణుడు డాక్టర్ బీకే మధుసూదన్ తెలిపారు. జ్ఞాపకశక్తి, మెదడు పనితీరులో నిద్రకు ఉన్న పాత్రను అర్థం చేసుకునేందుకు గాఢ నిద్ర (స్లో-వేవ్ స్లీప్), ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ (ఆర్‌ఈఎం) నిద్ర, నిద్ర సమయంలో మెదడు కార్యకలాపాలను పరిశీలిస్తున్నట్లు వివరించారు. అయితే, నిద్రలో మార్పులు కనిపించాయనే కారణంతోనే డిమెన్షియా ముప్పును నిర్ధారించలేమని స్పష్టం చేశారు.
వైద్యుల నిర్ణయాలకు ప్రత్యామ్నాయం కాదు
నిద్ర రికార్డుల్లో మెదడు కార్యకలాపాలు, గుండె వేగం, శ్వాస, ఆక్సిజన్ స్థాయులు సహా పలు శారీరక సంకేతాలు నమోదవుతాయని సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ జీఆర్‌కే శర్మ తెలిపారు. సంప్రదాయ పద్ధతుల్లో గుర్తించలేని కొన్ని నమూనాలను ఏఐ విశ్లేషణ ద్వారా గుర్తించే అవకాశం ఉందన్నారు. అయితే, ఫలితాలను వ్యక్తి వైద్య చరిత్ర, లక్షణాలు, ఇతర ప్రమాద కారకాలతో కలిపి పరిశీలించాలని సూచించారు. తదుపరి పరీక్షలు, చికిత్సకు సంబంధించిన నిర్ణయాలను వైద్యుల పరిశీలన ఆధారంగానే తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఈ సాంకేతికత ద్వారా మరింత వైద్య పరీక్షలు అవసరమైన వ్యక్తులను ముందుగానే గుర్తించి, నివారణ వైద్య సేవలకు తోడ్పడే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.
ఇదీ కూడా చదవండి: లూలా విజయంతో భారత్‌కు ఒరిగేదేంటి?


