Photo Credit: BCCI Twitter
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో పాకిస్తాన్-ఎతో జరిగిన మ్యాచ్‌లో భారత-ఎ జట్టు 48 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. కెప్టెన్ తిలక్ వర్మ వరుసగా రెండో సెంచరీతో అదరగొట్టినప్పటికీ, మిగతా బ్యాటర్ల నుంచి సహకారం కరువవ్వడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. అయితే మిగతావాళ్లు విఫలమైనప్పటికీ, కెప్టెన్‌గా తిలక్ వర్మ బాధ్యతాయుతంగా ఆడడంపై ప్రశంసల వర్షం కురిసింది.
కానీ భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ మాత్రం తిలక్ వర్మను తప్పుబట్టాడు. పాక్‌తో మ్యాచ్‌లో ఓటమికి తిలక్ వర్మ స్లో బ్యాటింగే ప్రధాన కారణమని తూర్పారబట్టాడు. సోనీ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్ బంగర్ మాట్లాడుతూ.. ‘‘తిలక్ వర్మ తన ఇన్నింగ్స్ ఆరంభంలో చాలా స్లోగా ఆడాడు.
రెండు పరుగులు చేసేందుకు 25 బంతులు తీసుకున్న తిలక్ 21 పరుగులు చేయడానికి 50 బంతులు మింగాడు. తిలక్ వర్మ జిడ్డు ఆట వల్ల మిగతా బ్యాటర్లపై ఒత్తిడి పడింది. వేగంగా ఆడే క్రమంలో మిగతా బ్యాటర్లు వికెట్లను చేజార్చుకున్నారు. ఒక రకంగా మ్యాచ్‌లో భారత్ ఓటమికి తిలక్ వర్మనే కారణమని నా అభిప్రాయం.’’ అని చెప్పుకొచ్చాడు.
అయితే సంజయ్ బంగర్ చేసిన వ్యాఖ్యలపై అభిమానులు, క్రీడా పండితుల నుంచి విమర్శలు వచ్చాయి. తిలక్ వర్మ కెప్టెన్‌గా బాధ్యతాయుతంగా ఆడాడని, అతడు ఆడకపోయుంటే భారత్‌కు ఘోర పరాజయం ఎదురయ్యేదని పేర్కొన్నారు. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు స్లోగా ఆడడంలో తప్పులేదన్నారు.
అయినా తిలక్ వర్మ బ్యాటింగ్‌లో తర్వాత వేగం పెరిగిందని, షాబాజ్ అహ్మద్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నమోదు చేయడం సంజయ్ బంగర్ కంటికి కనిపించడం లేదా అని దుయ్యబట్టారు. తిలక్ వర్మ బాధ్యతగా ఆడాడని, అతడిని నిందించే హక్కు సంజయ్ బంగర్‌కు లేదని, ముందు అతడి కళ్లకు ఉన్న పొరను తొలగించుకొని చూస్తే విషయం స్పష్టమవుతుందని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో సంజయ్ బంగర్ ఓటమికి సాకుగా తిలక్ వర్మను చూపించి తప్పు చేశాడని మరికొందరు వాపోయారు.
ఇదీ చదవండి: ‘అతడి ఔట్ కొంపముంచింది.. లేకుంటే మ్యాచ్ ముగించేవాడిని’


