‘అతడి ఔట్‌ కొంపముంచింది.. లేకుంటే మ్యాచ్ ముగించేవాడిని’ | Tilak Varma Comments-After Match Lost Vs PakistanA Rising Stars Asia Cup | Sakshi
Sakshi News home page

‘అతడి ఔట్‌ కొంపముంచింది.. లేకుంటే మ్యాచ్ ముగించేవాడిని’

Nov 23 2026 7:52 AM | Updated on Nov 23 2026 8:06 AM

Tilak Varma Comments-After Match Lost Vs PakistanA Rising Stars Asia Cup

Photo Credit: BCCI Twitter

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో పాకిస్తాన్ 'ఎ' చేతిలో ఇండియా-ఏ జట్టు 48 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారత 'ఎ' కెప్టెన్ తిలక్ వర్మ సెంచరీ సాధించినప్పటికీ, జట్టును గెలిపించలేకపోయాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం తిలక్ వర్మ మాట్లాడుతూ ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేశాడు. 

‘అభిషేక్ శర్మ ఇచ్చిన ప్రారంభాన్ని మేము సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాం. షాబాజ్ అహ్మద్ (56) ఔట్ కావడం మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇద్దరం కలిసి స్కోరు వేగాన్ని పెంచాలని ప్లాన్ చేస్తున్న సమయంలో షాబాజ్‌ వికెట్ పడటం మాకు ప్రతికూలంగా మారింది. 

మా భాగస్వామ్యం అలాగే కొనసాగి ఉంటే మాత్రం నేను మ్యాచ్‌ను ఫినిష్ చేసేవాడిని. మిడిల్ ఆర్డర్‌లో సరైన భాగస్వామ్యాలు లేకపోవడం జట్టు ఓటమికి ప్రధాన కారణం.  నా దృష్టిలో మ్యాచ్ గెలవడమే అత్యుత్తమంగా భావిస్తాను. ఒకవేళ నేను మ్యాచ్ గెలవకపోతే అది నాకు అత్యుత్తమం కాదు.’ అని చెప్పుకొచ్చాడు.

పాక్ విధించిన 314 పరుగుల లక్ష్య ఛేదనలో 129/6 వద్ద కష్టాల్లో ఉన్న జట్టును తిలక్, షాబాజ్ అహ్మద్‌ కలిసి ఏడో వికెట్‌కు 112 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నారు. ఈ జోడీ బలపడుతున్న తరుణంలో షాబాజ్ వెనుదిరిగాడు. ఆ వెంటనే వికెట్లు పడడంతో ఇండియా 'ఎ' జట్టు 49.1 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్ అయింది.

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ‘ఎ’ 49.2 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది. హసన్‌ నవాజ్‌ (79; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), మాజ్‌ సదాఖత్‌ (59; 6 ఫోర్లు, 1 సిక్స్‌), ఫర్హాన్‌ యూసఫ్‌ (56; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలు సాధించారు. భారత ‘ఎ’ జట్టు బౌలర్లలో విప్రాజ్‌ నిగమ్, సూర్యాంశ్‌ షెడ్గే, ప్రిన్స్‌ యాదవ్, హర్షిత్‌ రాణా తలా రెండు వికెట్లు పడగొట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement