కలిసికట్టుగా పోరాడుతాం! | Rahul Gandhi India Alliance Vote Chori Protest | Sakshi
Sakshi News home page

కలిసికట్టుగా పోరాడుతాం!

Oct 14 2026 4:03 AM | Updated on Oct 14 2026 4:03 AM

Rahul Gandhi India Alliance Vote Chori Protest

సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడుతున్న రాహుల్‌ గాంధీ. చిత్రంలో ఖర్గే, సంజయ్‌ రౌత్, డి.రాజా, ఇతర మిత్రపక్షాల నేతలు

ప్రజాస్వామ్య పునరుద్ధరణే లక్ష్యం

ఓట్ల చోరులను న్యాయస్థానం ముందు నిలబెడతాం

ప్రతిపక్ష ‘ఇండియా’కూటమి ప్రతిజ్ఞ

కూటమి నేతలకు రాహుల్‌ తేనీటి విందు

భవిష్యత్తు కార్యాచరణపై చర్చ

జంతర్‌మంతర్‌పై ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తామన్న రాహుల్‌ గాంధీ 

న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఐక్యంగా పోరాడతామని, ఓట్ల చోరీకి బాధ్యులైన వారిని న్యాయస్థానం ముందు నిలబెడతామని ప్రతిపక్ష ‘ఇండియా’కూటమి నాయకులు ప్రతిజ్ఞ చేశారు. నిరంకుశ పాలనపై రాజకీయ ప్రతిఘటన కొనసాగుతుందని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. ఆయన మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో విపక్ష కూటమి నాయకులు, పౌర సమాజ సభ్యులకు తేనీటి విందు ఇచ్చారు. ఓట్ల చోరీకి, ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టబోయే నిరసనకు సంబంధించిన వ్యూహంపై ఈ సందర్భంగా చర్చించారు.

జంతర్‌మంతర్‌ నిరసనలను నిషేధించడంపైనా చర్చ జరిగింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఆర్జేడీ నేతలు తేజస్వీ యాదవ్, మనోజ్‌ ఝా, జేఎంఎం నేత మహువా మాఝీ, సమాజ్‌వాదీ పార్టీ నాయకులు హరేంద్ర మాలిక్, ఆనంద్‌ భదౌరియా, మొహిబుల్లా నదీ్వ, ఎన్సీపీ(ఎస్పీ) నాయకురాలు సుప్రియా సూలే, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఆలిండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ చీఫ్‌ నేహా బోరా, సీపీఐ–ఎంఎల్‌ అగ్రనేత దీపాంకర్‌ భట్టాచార్య, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సాగరిక ఘోష్‌ , మహువా మొయిత్రాతోపాటు పౌర సమాజం సభ్యులు ప్రశాంత్‌ భూషణ్, యోగేంద్ర యాదవ్‌ తదితరులు ఈ తేనీటి విందులో పాల్గొన్నారు.

భవిష్యత్తు కార్యాచరణపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు. జంతర్‌మంతర్‌ను డీనోటిఫై చేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చట్టపరంగా సవాలు చేయబోతున్నామని రాహుల్‌ గాంధీ ప్రకటించారు. గంటన్నర పాటు జరిగిన విందు సమావేశం అనంతరం కూటమి నాయకులు ఉమ్మడిగా మీడియా సమావేశంలో మాట్లాడారు.

వారి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది  
రాజకీయ, ప్రజా ప్రతిఘటన కొనసాగుతుందని, చివరికి విజయం సాధిస్తుందని రాహుల్‌ గాంధీ తేలి్చచెప్పారు. తమ ఉద్యమం వెనుక ‘భారతదేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ’అనే ఏకైక లక్ష్యం ఉందన్నారు. దేశంలో నేడు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారని, ఎన్నికల వ్యవస్థ ధ్వంసం చేశారని, రాజ్యాంగాన్ని చించి పారేశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించడానికి తాము కలిసికట్టుగా పోరాడుతున్నామని వెల్లడించారు.

ప్రజాస్వామ్య భావాలను వ్యక్తీకరించడానికి జంతర్‌ మంతర్‌ ఒక ప్రధాన వేదికగా ఉండేదన్నారు. అయితే, దానిని అందుకోసం ఉపయోగించకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని ఆక్షేపించారు. ఈ నిర్ణయాన్ని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. దేశంలో విధ్వంసానికి కారకులైన నరేంద్ర మోదీ, అమిత్‌ షా, జ్ఞానేశ్‌ కుమార్‌తోపాటు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి, దాని నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని ఉద్ఘాటించారు.

ఈ పోరాటం తమ కోసం కాదన్నారు. భారత ప్రజల కోసం, వారి భవిష్యత్తు కోసం పోరాటం సాగుతోందన్నారు. ఓట్ల చోరీ వెనుక ఉన్నవారిలో ‘ప్రస్తుతం డెహ్రాడూన్‌లో తలదాచుకుంటున్న ఒక మహిళ’కూడా ఉన్నారని రాహుల్‌ ప్రస్తావించారు. అయితే, ఆమె పేరును వెల్లడించలేదు. న్యాయ వ్యవస్థ పట్ల తమకు అత్యంత గౌరవం ఉందన్నారు. అందుకే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆశ్రయించామని స్పష్టంచేశారు.

ఎలాంటి త్యాగానికైనా సిద్ధం: తేజíస్వీ యాదవ్‌
జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాను కోరుతూ చేపట్టాల్సిన కార్యాచరణను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై, అలాగే ప్రస్తుత పరిస్థితులపై చర్చించినట్లు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తామంతా ఏకమయ్యామని, ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ప్రకటించారు. దేశ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, సీఈసీ రాజీనామాను డిమాండ్‌ చేస్తున్నారని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా వెల్లడించారు. 

సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ మాట్లాడుతూ... ప్రభుత్వం మొదట ఓట్ల దొంగతనానికి పాల్పడింది, ఇప్పుడు జంతర్‌ మంతర్‌ను కూడా లాగేసుకునే పనిలో ఉందని ధ్వజమెత్తారు. రాజ్యాంగం ప్రమాదంలో ఉందని సుప్రియా సూలే ఆందోళన వ్యక్తంచేశారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా ఐక్య పోరాటం కొనసాగుతుందన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య నిర్మాణంలో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదని నేహా బోరా స్పష్టంచేశారు. ఆ పార్టీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం విషయంలో రాజీ పడిందని ఆరోపించారు. నిరసన తెలపడం రాజ్యాంగ హక్కు అని వివరించారు. ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న ఈ ఉద్యమంలో ప్రతిపక్షం, పౌర సమాజం కలిసికట్టుగా ముందుకు సాగుతున్నాయని ప్రశాంత్‌ భూషణ్‌ స్పష్టం చేశారు.  

జ్ఞానేశ్‌ కుమార్‌ ఒక మాఫియా: సంజయ్‌ రౌత్‌  
సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ మొత్తం ఎన్నికల వ్యవస్థనే నేరమయం చేశారని, ఆయన ఒక మాఫియా అని రౌత్‌ ఆరోపించారు.శివసేన(ఉద్ధవ్‌) నాయకుడు సంజయ్‌ రౌత్‌ మండిపడ్డారు. ప్రజాస్వామ్యం, ఓటు హక్కు పరిరక్షణ కోసం రాహుల్‌ గాంధీ నాయకత్వంలో తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. మాఫియా శక్తులను ఎలా ఎదుర్కోవాలో, వారితో ఎలా వ్యవహరించాలో తెలుసన్నారు.

ఇదీ చదవండి: ఇక ముక్కోణ హోరాహోరీయేనా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement