సస్పెన్స్‌కు తెర దించిన మాజీ ఐఏఎస్‌ దివ్య | Former IAS Divya Mittal Ends Political Speculation | Sakshi
Sakshi News home page

పొలిటికల్‌ ఎంట్రీ.. సస్పెన్స్‌కు తెర దించిన మాజీ ఐఏఎస్‌ దివ్య

Oct 16 2026 7:23 AM | Updated on Oct 16 2026 8:45 AM

Former IAS Divya Mittal Ends Political Speculation

ఐఏఎస్‌ ఉద్యోగానికి రాజీనామా.. రాజకీయాల్లోకి వస్తున్నారన్న ప్రచారం.. కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీల నుంచి ఆహ్వానాలంటూ చర్చ.. రాహుల్‌ గాంధీతో రహస్య భేటీ జరిగిందంటూ మరో ప్రచారం! మాజీ ఐఏఎస్‌ అధికారి దివ్యా మిట్టల్‌ రాజకీయ అడుగులపై గత కొన్ని రోజులుగా ఉత్తరప్రదేశ్‌లో ఆసక్తికర చర్చ నడిచింది. ఆమె ఏ పార్టీలో చేరతారన్న ఉత్కంఠకు తాజాగా తెరపడింది. ప్రధాన పార్టీల అంచనాలకు భిన్నంగా తన రాజకీయ ప్రస్థానంపై ఆమె కీలక ప్రకటన చేశారు.

13 ఏళ్ల సివిల్‌ సర్వీసు కెరీర్‌కు స్వస్తి చెప్పిన దివ్యా మిట్టల్‌(42).. గురువారం తన రాజకీయ పార్టీని ప్రకటించారు. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. రాజకీయాల్లోకి వస్తానని గతంలోనే ప్రకటించిన ఆమె.. ఏదో ఒక పార్టీతో కలిసి పనిచేయడం కంటే ప్రజలతో నేరుగా మమేకమై రాజకీయాలు చేయాలన్న తన ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు సిద్ధమయ్యారు.

సొంత పార్టీతో రాజకీయాల్లోకి..
తన పార్టీకి ‘జన్‌ నీతి భారత్‌ పార్టీ’ అని పేరు పెట్టినట్లు దివ్యా మిట్టల్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రజలే విధానాల రూపకల్పనలో కీలకంగా ఉండాలని, ఎన్నికల సమయంలోనే కాకుండా ఐదేళ్ల పాలనలోనూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉండాలని ఆమె పేర్కొన్నారు. కులం, మతం వంటి గుర్తింపుల కంటే ప్రజల అవసరాలకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. ప్రతి ప్రభుత్వ పనికి ప్రజలకు జవాబు చెప్పాల్సిందేనని పేర్కొంటూ మూడు ప్రధాన సూత్రాలను వివరించారు.

రాహుల్‌తో భేటీ ఉత్తదే
దివ్యా మిట్టల్‌ రాజకీయ ప్రవేశంపై చర్చ జరుగుతున్న సమయంలో బీజేపీ నేత ప్రశాంత్‌ ఉమ్రావ్‌ చేసిన సోషల్‌ మీడియా పోస్టు మరింత ఆసక్తి రేకెత్తించింది. కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీతో దివ్యా మిట్టల్‌ రహస్యంగా సమావేశమయ్యారంటూ ఆయన ఆరోపించారు. దీంతో ఆమె కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న ప్రచారం మొదలైంది. అయితే, ఈ ఆరోపణలను దివ్యా మిట్టల్‌ ఖండించారు. సెప్టెంబర్‌ 29న విడుదల చేసిన వీడియోలో తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని, ప్రజలతో కలిసి పనిచేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

అఖిలేశ్‌ వ్యాఖ్యలతోనూ చర్చ..
దివ్యా మిట్టల్‌ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. ఆమె ఎస్పీలో చేరితే స్వాగతిస్తామనే సంకేతంగా ఆయన వ్యాఖ్యలను పలువురు విశ్లేషించారు. మరోవైపు కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారం కూడా సాగింది. అయితే, ఈ ఊహాగానాల మధ్య దివ్యా మిట్టల్‌ సొంత పార్టీ ప్రకటన చేయడంతో ఆమె రాజకీయ ప్రయాణంపై స్పష్టత వచ్చింది.

వ్యవస్థలోని లోపాలే రాజకీయాలకు కారణమా?
ప్రభుత్వ వ్యవస్థలో పనిచేసినప్పుడు ఎదురైన అనుభవాలే రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయానికి కారణమని దివ్యా మిట్టల్‌ గతంలో వివరించారు. మంజూరైనప్పటికీ నిర్మాణం కాని పాఠశాలలు, లబ్ధిదారులకు అందని భూములు, అధ్వాన్న రహదారులు, పేపర్‌ లీకేజీలతో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు. ప్రభుత్వ నిర్ణయాలు కాగితాలకే పరిమితం కాకుండా ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే తన రాజకీయ లక్ష్యమని చెప్పారు.

ఐఐటీ.. ఐఐఎం నుంచి ఐఏఎస్‌ వరకు
హరియాణాలోని రేవారీకి చెందిన దివ్యా మిట్టల్‌.. ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగళూరులో చదువుకున్నారు. అనంతరం లండన్‌లో పనిచేసి, 2013లో యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో 68వ ర్యాంకు సాధించారు. ఉత్తరప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన ఆమె సంత్‌ కబీర్‌ నగర్‌, మిర్జాపూర్‌, డియోరియా జిల్లాలకు జిల్లా మేజిస్ట్రేట్‌గా సేవలందించారు. మిర్జాపూర్‌లోని మారుమూల గ్రామాలకు కుళాయి ద్వారా తాగునీరు అందించే కార్యక్రమంతో గుర్తింపు పొందారు. ఆగస్టు 30న ఐఏఎస్‌ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణకు నిర్ణయం తీసుకున్న ఆమె.. తాజాగా సొంత పార్టీతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2027 యూపీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు.

ఇదీ చదవండి: ఈసీపై ప్రశాంత్‌ కిషోర్‌ సంచలన ఆరోపణలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement