అడుగడుగునా దాడులు.. అడ్డంకులు.. అవమానాలు
పులివెందులలో మహిళా ఓటర్లపై దాడులు.. తలలు పగలగొట్టిన టీడీపీ గూండాలు
వైఎస్సార్‌సీపీ ఏజెంట్ సునంద చేయి విరగడంతో ఆస్పత్రికి తరలింపు
ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఆటవిక పాలనలో ఉన్నామా అంటూ మహిళల ఆవేదన
మరోవైపు దొంగ ఓట్ల కోసం బయటి ప్రాంతాల మహిళలను తీసుకొచ్చిన కూటమి
కూటమి నేతల అఘాయిత్యాలకు మూల్యం చెల్లించక తప్పదంటూ కన్నీరు
సాక్షి, అమరావతి: పురపాలక ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై దాడులు, దౌర్జన్యాలకు టీడీపీ తెగబడింది. దుస్తులు చించి దౌర్జన్యానికి పాల్పడింది. అడుగడుగునా మహిళా అభ్యర్థుల ఓటు హక్కుకూ విఘాతం కలిగించింది. పోలింగ్ బూత్ లోపల, బయటా మహిళలకు రక్షణ లేకుండా చేసింది. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఆటవిక పాలనలో ఉన్నామా అంటూ, కూటమి నేతల అఘాయిత్యాలకు మహిళలు కన్నీరు పెట్టుకున్నారు.
ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన మహిళా ఓటర్లను అడ్డుకోవడం, మహిళా అభ్యర్థులపై దాడులు చేయడం, దుర్భాషలాడటం, పోలింగ్ కేంద్రాల వద్ద భయభ్రాంతులకు గురిచేయడం వంటి ఘటనలు కలకలం రేపాయి. మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే కొన్ని చోట్ల అడ్డంకులు సృష్టించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాల్సిన చోట మహిళలకు కనీస గౌరవం, భద్రత లేకుండా పోయిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళా ఓటర్లకు అడుగడుగునా అడ్డంకులు
పులివెందులలోని సరస్వతి విద్యామందిరం పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేసేందుకు వచ్చిన మహిళలపై రాళ్లు రువ్వుతూ, కర్రలతో దాడి చేశారు. ఇస్లాంపురం 11, 12 వార్డుల్లో మహిళల నుంచి ఓటర్ స్లిప్పులు తీసుకుని పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లనివ్వలేదు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ శ్రేణులు మహిళా ఓటర్లను అడ్డుకున్నారు. 38వ వార్డు రాజారెడ్డి కాలనీలో మహిళా ఓటర్ల తలలు పగలగొట్టారు. 31వ వార్డు వైఎస్సార్‌సీపీ ఏజెంట్ సునందపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. ఏజెంట్ పత్రాలు తీసుకెళ్లేందుకు వెళ్తుండగా ఆమెపై దాడి చేయడంతో చేయి విరిగింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
గుంటూరు 57వ డివిజన్ ఐదో బూత్‌లో టీడీపీ కార్యకర్తలు మూకుమ్మడిగా ప్రవేశించి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. అడ్డుకునేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శ్రీదేవిపై దాడి చేశారు. ఏజెంట్‌పై దాడి చేసి బ్యాలెట్ బాక్సును ధ్వంసం చేశారు. తిరుపతి 22వ డివిజన్‌లో ఓటర్లను పోలింగ్ కేంద్రానికి వెళ్లకుండా అడ్డుకున్నారని మాజీ మేయర్ డాక్టర్ శిరీష ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలోని పాత కడప, నబికోట ప్రాంతాల్లో మహిళా ఓటర్లను వెనక్కి పంపేశారు. కడప మహిళా డిగ్రీ కళాశాల పోలింగ్ కేంద్రం వద్ద మేయర్ అభ్యర్థి దీప్తిని పోలీసులు అడ్డుకున్నారు. పలాసలో 11వ వార్డు అభ్యర్థి మీసాల శోభిత భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని భయభ్రాంతులకు గురిచేశారు. పులివెందులలో మహిళా ఓటర్ల స్లిప్పులు లాక్కున్నారు.
దొంగ ఓట్లకు బయటి ప్రాంతాల మహిళలు
మరోవైపు పలు మున్సిపాలిటీల్లో బయటి ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించేందుకు కూటమి పార్టీ నేతలు ప్రయత్నించారు. గుంటూరు 42వ డివిజన్‌లో మహిళా కూలీలను ఆటోల్లో పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకొచ్చారు. గుర్తింపు కార్డులు లేకపోవడంతో అధికారులు వారిని వెనక్కి పంపించారు. తిరుపతి 49వ వార్డులో మంగళం ప్రాంతానికి చెందిన ఓ మహిళ వేరే ప్రాంతంలో ఓటు వేసేందుకు ప్రయత్నించగా వైఎస్సార్‌సీపీ నేతలు గుర్తించి అభ్యంతరం తెలపడంతో బయటకు పంపించారు.
చిత్తూరు రాంనగర్ కాలనీలోని 44వ వార్డు పోలింగ్ కేంద్రంలోనూ దొంగ ఓటు వేసేందుకు వచ్చిన యువతిని వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని హరీషారెడ్డి అడ్డుకున్నారు. అనంతపురం 40వ డివిజన్‌లోని గుడ్ చిల్డ్రన్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద అనుమానాస్పదంగా క్యూలో నిల్చున్న మహిళలను వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి అడ్డుకున్నారు. నెల్లూరులో పత్తివారి హైస్కూల్ సమీపంలో మంత్రి నారాయణకు చెందిన వ్యాన్‌లో దొంగ ఓట్లు వేసేందుకు తీసుకువచ్చిన మహిళలను వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులు అడ్డుకున్నారు.
నగిరిగుట్ట పోలింగ్ కేంద్రం వద్దకు బయటి ప్రాంతాల మహిళలను కూటమి నేతలు కార్లలో తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నించారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని 8వ వార్డులో తన ఓటును ముందుగానే మరొకరు వేసేశారని ఆయేషా అనే మహిళ వాపోయారు. బొబ్బిలిలో ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన కట్ట భారతి 21, 22, 23 వార్డుల్లో వెతికినా తన ఓటు వివరాలు దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు 25వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి సైకిల్ గుర్తు ముద్రించిన స్లిప్పులను ఓటర్లకు పంపిణీ చేస్తున్నారని మాజీ జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ విమర్శించారు.
అరెస్టులతో మహిళా అభ్యర్ధులకు బెదిరింపులు
కర్నూలు 67వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శ్రీకాంత్ సోదరుడు, ఎన్నికల ఏజెంట్‌ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ వర్గీయులు నిలదీశారు. దీనికి నిరసనగా ఓ మహిళ పోలీసు వాహనం బానెట్‌పైకి ఎక్కి ఆందోళనకు దిగారు. మాచర్లలో 32వ వార్డు అభ్యర్థి షేక్ ఆషా భర్త మస్తాన్‌ను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ఆచూకీ కూడా కుటుంబ సభ్యులకు తెలియజేయలేదు. చిలకలూరిపేటలో 28వ వార్డు అభ్యర్థి చిన్నం లలిత కుమారుడు వెంకటేష్‌ను అర్ధరాత్రి అరెస్టు చేశారు. 27వ వార్డు అభ్యర్థి శ్రీలక్ష్మి కుటుంబ సభ్యులను పోలీసులు బెదిరించారు. సత్తెనపల్లిలో 12వ వార్డు అభ్యర్థి గోవిందమ్మ భర్తను పోలీసులు తీసుకెళ్లారు.
అడుగడుగునా అరాచకాలు
» విశాఖలో వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణి ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతుండగా కూటమి నేతలు అడ్డుకున్నారు. మీడియాతో మాట్లాడేందుకు వీల్లేదంటూ దౌర్జన్యానికి దిగారు.
» చిలకలూరిపేట 27వ వార్డు అభ్యర్థి అన్నపురెడ్డి శ్రీలక్ష్మిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతించకుండా అడ్డుకోవడంతో ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.
» మాచర్లలో ఆరో వార్డు అభ్యర్థి అంజలి, 36వ వార్డు అభ్యర్థికి మద్దతుగా ఉన్న రామతులసి తమ ఓటు హక్కును వినియోగించుకోనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
» పులివెందులలో వైఎస్సార్‌సీపీ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మ కారుపై టీడీపీ వర్గీయులు దాడి చేయడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలింగ్ కేంద్రంలోకి ఆమెతోపాటు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను కూడా అనుమతించలేదు.

ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తే.. ‘పై నుంచి ఆదేశాలు ఉన్నాయి’ అంటూ అధికారులు, పోలీసులు సమాధానం చెప్పడం విశేషం. ఉలిమేళ్ల గ్రామంలో మహిళలను ఓటు వేయనివ్వకుండా అడ్డుకుంటున్నారని, ఓటర్ స్లిప్పులు తీసుకున్నప్పటికీ పోలింగ్ కేంద్రాల్లోకి పంపడం లేదని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు
పల్నాడు జిల్లా వినుకొండలో 8వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన పోలూరు అర్చనమూర్తి, ఆమె భర్త నరసింహమూర్తిపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. అభ్యర్థిని అసభ్య పదజాలంతో దూషించి రోడ్డు మీద పడేసి కొట్టారు. అర్చన మూర్తిని ఇలా నెట్టివేశారు.


