సిరా చెరిగిపోయింది.. ప్రజాస్వామ్యం కరిగిపోయింది | Rampant bogus voting in municipal polls | Sakshi
Sakshi News home page

సిరా చెరిగిపోయింది.. ప్రజాస్వామ్యం కరిగిపోయింది

Nov 2 2026 5:26 AM | Updated on Nov 2 2026 5:26 AM

Rampant bogus voting in municipal polls

పులివెందులలో ఆదివారం దొంగ ఓటు వేసి దర్జాగా మీడియా ముందు ఇలా పోజులిచ్చాడు.

‘మున్సిపోల్స్‌’లో యథేచ్ఛగా దొంగ ఓట్లు 

గెలుపు కోసం టీడీపీ కూటమి నేతల కుతంత్రాలు

పెందుర్తిలో దొంగ ఓటు వేసిన జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌ 

నర్సీపట్నంలో రౌడీషీటర్లతో యథేచ్ఛగా రిగ్గింగ్‌ 

జీవీఎంసీ పరిధిలో దొంగ ఓటుకు రూ.1,000 

రాయలసీమ జిల్లాల్లో దొంగ ఓట్లు వేసేందుకు తమిళనాడు నుంచి మూకల రాక 

ఒక్కొక్కరికి రూ.1,500 నుంచి రూ.2 వేలు చెల్లించిన టీడీపీ నేతలు 

పోలింగ్‌ బూత్‌ సమీపంలోనే ఇంక్‌ రిమూవర్లు ఏర్పాటు 

ఓటు వేసి బయటకు రాగానే వేలిపై సిరా ముద్ర చెరిపేసి మళ్లీ క్యూలైన్‌లో టీడీపీ కార్యకర్తలు 

టీడీపీ దొంగ ఓటర్లకు సహకరించిన ఖాకీలు 

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలు అక్రమాలకు, అరాచకాలకు వేదికగా మారాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ టీడీపీ కూటమి నేతలు ఎక్కడికక్కడ పెద్దఎత్తున దొంగ ఓట్లకు తెగబడ్డారు. అధికార బలంతో పాటు పోలీసుల సహకారంతో పలు కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రిగ్గింగ్‌కు పాల్పడటం, పొరుగు ప్రాంతాల నుంచి రౌడీలు, వలస కూలీలను రప్పించి మరీ దొంగ ఓట్లు వేయించడంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఇంక్‌ రిమూవర్ల వాడకం, ఏకంగా జనసేన ఎమ్మెల్యేనే దొంగ ఓటు వేయడం వంటి ఘటనలు తీవ్ర కలకలం రేపాయి.

సాక్షి, అమరావతి: దొంగ ఓట్లతో దొడ్డిదారిన మున్సిపల్‌ ఎన్నికల్లో లబ్ధి పొందాలని టీడీపీ కూటమి కుతంత్రాలకు పాల్పడింది. ప్రజాస్వామ్యాన్ని చెరబడుతూ టీడీపీ నేతలు నగరపాలక సంస్థలు, మున్సిపాల్టీల్లో పెద్దఎత్తున రిగ్గింగ్‌ చేయించారు. గ్రామీణ ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వలస కూలీల మాదిరిగా మూకలను తీసుకొచ్చి మరీ దొంగ ఓట్లు వేయించారు. మా ఓటు దొంగలించారంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు రోడ్లెక్కి ఆందోళనలకు దిగిన ఘటనలు చోటుచేసుకున్నాయి.స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు అనుచరులు నర్సీపట్నంలో దొంగ ఓట్లు వేసేందుకు ఏకంగా రౌడీషీటర్లను రంగంలోకి దింపారు. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్న వార్డుల్లో వారంతా హల్‌చల్‌ చేస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా దగ్గరుండి దొంగ ఓట్లు వేయించారు.  

దొంగ ఓటు వేసిన జనసేన ఎమ్మెల్యే జనసేన పార్టీకి చెందిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌ స్వయంగా దొంగ ఓటు వేయడం కలకలం రేపింది. ఎమ్మెల్యే పంచకర్లకు జీవీఏంసీ పరిధిలోని 117 వార్డులో ఓటు ఉండగా, 115 వార్డులో ఓటు వేశారు. 117 వార్డులో టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తుండగా.. 115వ వార్డులో జనసేన తరఫున బరిలోకి దిగిన తన అనుచరుడికి మద్దతు పలికేందుకు వెళ్లి దొంగ ఓటు వేశారు. ఓటరు జాబితాలో ఆయన పేరు లేకున్నప్పటికీ ఎమ్మెల్యేకు బ్యాలెట్‌ పత్రం ఇచ్చి రిటర్నింగ్‌ అధికారి దగ్గరుండి మరీ ఓటు వేయించడం వివాదాస్పదంగా మారింది.

వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో ఓటు వేసిన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు రామగంగిరెడ్డి .. అయితే ఇతడికి ఓటు వేంపల్లె మండలంలో  ఉంది. 

పోలింగ్‌ కేంద్రాల వద్దే ఇంక్‌ రిమూవర్లు 
రాయలసీమ, కోసాంధ్ర జిల్లాల్లోని పలు మున్సిపాల్టీల్లో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన టీడీపీ మూకలకు పోలీసులు వంతపాడారు. వారిని అడ్డుకునేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను తరిమికొట్టారు. కొన్నిచోట్ల పోలింగ్‌ బూత్‌లకు పక్కనే టీడీపీ నేతలు ఇంక్‌ రిమూవర్లు అందుబాటులో ఉంచారు. దొంగ ఓటర్లు ఓటువేసి బయటకు రాగానే రిమూవర్‌తో ఇంక్‌ మార్క్‌ను చెరిపేసి మళ్లీ అదే బూత్‌లోకి చొరబడి పదేపదే దొంగ ఓట్లు వేయించారు. విజయనగరం కార్పొరేషన్‌తో పాటు ఉత్తరాంధ్రలోని పలు మున్సపాల్టీల్లో పోలీసులను అడ్డు పెట్టుకుని తమను ఓటు వేయనివ్వలేదని.. తమ ఓట్లను వేరే వ్యక్తులు వేసేశారని మహిళా ఓటర్లు పలుచోట్ల ఆందోళనలకు దిగారు.

ఎన్నికల అక్రమాలకు ఉదాహరణలివిగో..
» జీవీఎంసీ 26వ డివిజన్‌లో జనసేన కార్పొరేటర్‌ అభ్యర్థి తన అనుచరులతో కలిసి బ్యాలెట్‌ పేపర్‌ కాపీలతో దొంగ ఓట్లు వేసేందుకు యత్నించి అడ్డంగా దొరికి పోయాడు. 
»  జీవీఎంసీ పరిధిలోని కృష్ణ కాలేజీ పోలింగ్‌ బూత్‌లలో దొంగ ఓట్లు వేస్తున్న టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు అడ్డుకోగా, ఇరువర్గాలమధ్య తోపులాట జరిగింది.  
»  ఇదే కార్పొరేషన్‌ పరిధిలోని 92 డివిజన్‌లో రిగ్గింగ్‌కు యత్నిస్తున్న జనసేన కార్యకర్తలను అడ్డుకునేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు యత్నించగా, వారిని పోలీసులు తరిమేశారు. 
» తిరుపతి కార్పొరేషన్‌ పరిధిలోని 15వ డివిజన్‌ కేశవరెడ్డి స్కూల్‌ పోలింగ్‌ బూత్‌ పక్కనే ఇంక్‌ రిమూవర్‌ అందుబాటులో ఉంచారు. ఓటు వేసివచ్చిన టీడీపీ కార్యకర్తలు వేలిపై ఇంక్‌ మార్క్‌ను తొలగించి మళ్లీ క్యూలైన్‌లో నిలబడి పదేపదే ఓట్లు వేసేందుకు వెళ్లడం కనిపించింది. దొంగ ఓట్లు వేసిన వారే తిరిగి పదేపదే బూత్‌లోకి చొరబడుతున్నా అక్కడే ఉన్న పోలీసులు కానీ, బూత్‌లోని అధికారులు కానీ పట్టించుకోకపోగా వార్ని దగ్గరుండి మరీ లోపలకు పంపి దొంగ ఓట్లను ప్రోత్సహించారు.  
» తిరుపతి కార్పొరేషన్‌ పరిధిలోని 49వ డివిజన్‌ సుందరయ్య నగర్‌ బూత్‌లో దొంగఓట్లు వేసేందుకు వచ్చిన ఓటర్లను సీపీఎం కార్యకర్తలు అడ్డుకున్నారు.  
»  ఇదే కార్పొరేషన్‌లోని 60వ డివిజన్‌లో జనసేన రెబల్‌ అభ్యర్థి ఆదం సుధాకరరెడ్డి దొంగ ఓట్లు వేస్తుండగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు అడ్డుకున్నారు. 
» అనంతపురం కార్పొరేషన్‌ పరిధిలోని 30, 40, 47 డివిజన్లలో దొంగ ఓట్లు వేస్తున్న టీడీపీ కార్యకర్తలను గుర్తించి వైఎస్సార్‌సీపీ నేతలు అడ్డుకోగా, పోలీసులు పట్టించుకోలేదు.  


»  ఇదే కార్పొరేషన్‌ పరిధిలోని 37వ డివిజన్‌లో కూటమి నేతలు దర్జాగా బూత్‌లలోకి చొరబడి దొంగ ఓట్లు వేసుకున్నారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగినా పట్టించుకోలేదు.   
»  శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపాల్టీలో దొంగ ఓటు వేసేందుకు వెళ్లిన వ్యక్తిని వైఎస్సార్‌సీపీ శ్రేణులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 
» గుంటూరు 46వ డివిజన్‌లో టీడీపీ కార్యకర్తలు యథేచ్చగా దొంగ ఓట్లు వేస్తున్నారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఫిర్యాదు చేసినా ఎన్నికల అధికారులు, పోలీసులు పట్టించుకోలేదు. పోలింగ్‌ బూత్‌ బయటే సిరా మార్క్‌ను తొలగించి దొంగ ఓట్లు వేశారు.  
» గుంటూరు 57వ డివిజన్‌ పరిధిలోని లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌ పోలింగ్‌ బూత్‌లో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలను అడ్డుకోవడంతో పోలింగ్‌ విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులపై దాడికి తెగబడి విచక్షణారహితంగా కొట్టారు. 
» నెల్లూరులో మంత్రి నారాయణ దొంగ ఓట్లు వేసేందుకు భారీ స్కెచ్‌ వేశారు. 14, 16, 17 డివిజన్లలో పోలింగ్‌ స్టేషన్‌ వద్దకు బస్సుల్లో నారాయణ కళాశాల విద్యార్థినులను పెద్దఎత్తున తరలించారు. వీరిలో చాలా మందికి ఓటు హక్కు కూడా లేదు. అయినా వీరితో ఆయా డివిజన్లలో దొంగ ఓట్లు వేయించారు. దొంగ ఓట్లు ఎందుకు వేస్తున్నారు, ఎవరు వేయమన్నారని విద్యార్థినులను మీడియా అడగ్గా.. సమాధానం చెప్పలేక మొహం చాటేశారు. 
»  కర్నూలు 13వ డివిజన్‌ 2వ బూత్‌లో ఓటు వేసేందుకు వచ్చిన మహిళను రిటర్నింగ్‌ అధి­కారి తిప్పి పంపారు. మీ ఓటు ఇప్పటికే ఎవరో వేసేశారని చెప్పడంతో ఆమె గగ్గోలు పెట్టింది. తనకు ఓటు వేసే అవకాశం కల్పించాలని వేడుకున్నా రిటర్నింగ్‌ అధికారి పట్టించుకోలేదు. కర్నూలు నగరంలో దాదాపు 30 వార్డుల్లో పచ్చ పార్టీ రౌడీలు దొంగ ఓట్లు వేసుకున్నారు.  
»  వినుకొండలో టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అనుచరులు 36వ పోలింగ్‌ కేంద్రాన్ని ఆక్రమించి దొంగ ఓట్లకు తెగబడ్డారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఫిర్యాదు చేసినా ఎన్నికల అధికారులతో పాటు పోలీసులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించారు. 
»  పులివెందులలో తమ ఓట్లు టీడీపీ నేతలు వేసేస్తున్నారంటూ అనేకమంది ఓటర్లు పోలింగ్‌ బూత్‌ ఎదుటే ఆందోళనకు దిగారు. డీఎస్పీ మురళీనాయక్‌ స్పందిస్తూ ‘మీకు ఓట్లు లేవు. ఇక్కడ నుంచి వెళ్లి పోండి’ అంటూ బలవంతంగా పంపించేశారు. 
» పులివెందులలో దొంగ ఓట్లు వేసేందుకు వేముల, జమ్మలమడుగు నుంచి పెద్దఎత్తున మహిళా వలస కూలీలను తరలించారు. ఒక్కొ­క్కరికి రూ.1,500 చొప్పున కూలీ చెల్లించారు.  
» కడప కార్పొరేషన్‌ పరిధిలో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారికి పెద్దఎత్తున ఓటరు స్లిప్‌లు పంపిణీ చేస్తుండగా.. మేయర్‌ అభ్యర్థి బండి దీప్తి అడ్డుకున్నారు. 
» చిత్తూరులోని 44 డివిజన్‌ రాంనగర్‌ కాలనీ పోలింగ్‌ కేంద్రంలో పెద్దఎత్తున దొంగ ఓట్లు పడ్డాయి. దొంగ ఓటర్లను వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి హరీషారెడ్డి నిలదీశారు. వీరిలో చాలామంది తమిళనాడు నుంచి వచ్చినట్టు గుర్తించారు. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన యువతులను వైఎస్సార్‌సీపీ నేతలు నిలదీయగా, తమను తమిళనాడు నుంచి తీసుకొచ్చారని బదులిచ్చారు. 
»  తిరుపతి కార్పొరేషన్‌ పరిధిలోని 49వ డివిజన్‌ పోలింగ్‌ బూత్‌లో దొంగ ఓట్లు వేసేందుకు ఇతర జిల్లాల నుంచి పెద్దఎత్తున వచ్చిన వారిని వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు గుర్తించి అడ్డుకున్నారు.  
» ఇదే కార్పొరేషన్‌లోని 48, 49 డివిజన్లలో టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేసేందుకు యత్నించగా సీపీఎం నేతలు అడ్డుకున్నారు. 
» విజయవాడ చిట్టినగర్‌ మహాలక్ష్మి ఆలయం పోలింగ్‌ బూత్‌లో తన ఓటు ఎవరో వేశారంటూ మజ్జి ఈశ్వరరావు అనే ఓటరు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. 
» డోన్‌లో దొంగ ఓట్లు వేసేందుకు ఇతర గ్రామాల నుంచి పెద్దఎత్తున జనాన్ని తీసుకొచ్చారు. వారితో టీడీపీ కార్యకర్తలు దగ్గరుండి దొంగ ఓట్లు వేయించారు. ఓటుహక్కు కలిగిన వారిని బలవంతంగా బయటకు పంపించేశారు.  
»  రేపల్లె మున్సిపాల్టీలోని 33వ వార్డు పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేసేందుకు చేతిపై ఉన్న సిరా మార్కును చెరిపేసుకోవడం కనిపించింది. 
» పలమనేరు రంగాపురం పోలింగ్‌ స్టేషన్‌లో టీడీపీ ఎమ్మెల్యే అమర్నాథ్‌రెడ్డి అనుచరులు గూండాలను రంగంలోకి దించి యథేచ్ఛగా దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నించగా వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. 
» పుత్తూరు మున్సిపాల్టీలో 33వ వార్డు బూత్‌లో దొంగ ఓట్లు వేసేందుకు వెళ్తున్న వారిని అడ్డుకునేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. 
» కదిరి 18వ వార్డుకు చెందిన టీడీపీ నాయకులు దొంగ ఓట్లు వేస్తున్నారని వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు, పార్టీ నేతలు అడ్డుకునేందుకు యత్నించగా దొంగ ఓట్లు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా వైఎస్సార్‌సీపీ నేతలను రూరల్‌ సీఐ నాగేంద్ర అక్రమంగా అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement