పీవోనా.. జనసేన కార్యకర్తనా? | Presiding Officer Over Action To AP Municipal Elections | Sakshi
Sakshi News home page

పీవోనా.. జనసేన కార్యకర్తనా?

Nov 2 2026 8:07 AM | Updated on Nov 2 2026 8:57 AM

Presiding Officer Over Action To AP Municipal Elections

జనసేన కార్యకర్తలను బయటకు పంపించాలని పోలీసులను కోరుతున్న వైఎస్సార్‌సీపీ నేత వాసుపల్లి గణేష్‌ కుమార్‌

విశాఖపట్నం: ఎన్నికల విధుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ప్రిసైడింగ్‌ అధికారిణి.. జనసేన కార్యకర్తలా వ్యవహరించారన్న ఆరోపణలు జీవీఎంసీ 37వ వార్డులో తీవ్ర కలకలం రేపాయి. ఇందిరా మున్సిపల్‌ క్రికెట్‌ స్టేడియంలోని 36/5 పోలింగ్‌ కేంద్రంలో పీఓగా విధులు నిర్వహిస్తున్న అధికారిణి ఓటర్లకు స్లిప్పులు అందిస్తూ.. జనసేనకు ఓటు వేయాలని సూచించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతటితో ఆగకుండా పోలింగ్‌ సరళిని పరిశీలించేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ వార్డు అధ్యక్షురాలు అలుపన లక్ష్మీభవానిని లోపలికి అనుమతించకుండా అడ్డుకోవడం వివాదానికి దారితీసింది. ఎన్నికల విధుల్లో అధికారుల తీరుపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. 

మేయర్‌ అభ్యర్థికీ అడ్డంకులు 
ఎన్నికల సరళిని పరిశీలించేందుకు వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి వరుదు కల్యాణి, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్, పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్, 37వ వార్డు అభ్యర్థి అలుపన లక్ష్మీభవాని పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఇతర నాయకులు బయటే ఉండగా.. మేయర్, వార్డు అభ్యర్థులు మాత్రమే లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ప్రిసైడింగ్‌ అధికారిణి వారిని అడ్డుకున్నారు. మేయర్‌ అభ్యర్థికి లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉందని చెప్పినా పట్టించుకోలేదు. దీంతో వరుదు కల్యాణి ఎన్నికల అధికారికి ఫోన్‌ చేసి విషయం వివరించడంతో చివరకు ఆమెను లోపలికి అనుమతించారు. 

జనసేన నేతల మూకుమ్మడి వాగ్వాదం 
మేయర్‌ అభ్యర్థి పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లడాన్ని గమనించిన జనసేన నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా అక్కడికి చేరుకుని వాగ్వాదానికి దిగారు. మేయర్‌ అభ్యర్థికి లోపలికి వెళ్లే అవకాశం ఉందని వివరించినా వినిపించుకోకుండా సుమారు గంట పాటు వివాదం కొనసాగించారు. ఈ క్రమంలో పోలీసులు సైతం జనసేన నాయకుల పట్ల ఒకలా, వైఎస్సార్‌సీపీ నాయకుల పట్ల మరోలా వ్యవహరించారు. జనసేన నాయకులను అక్కడే ఉండనిచ్చి.. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను మాత్రమే బయటకు పంపించేందుకు ప్రయత్నించారు.

పోలీసుల తీరుపై ఆగ్రహం 
వైఎస్సార్‌సీపీ నాయకులను మాత్రమే బయటకు పంపడంపై మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ పోలీసులను నిలదీశారు. జనసేన నాయకులను ఎందుకు పంపించడం లేదని ప్రశ్నించారు. దీంతో పోలీసులు, జనసేన నాయకులు కలిసి వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. ఎన్నికల కేంద్రం వద్ద అధికారుల తీరు, పోలీసుల వ్యవహారశైలి చూస్తుంటే కూటమి నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల విధుల్లో నిష్పక్షపాతంగా ఉండాల్సిన అధికారులు, పోలీసులు ఇలా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement