ఆగని ఆగడాలు.. కనీవినీ ఎరు‘గని’ దోపిడీ | Mining Mafia running rampant under Chandrababu Govt Rule | Sakshi
Sakshi News home page

ఆగని ఆగడాలు.. కనీవినీ ఎరు‘గని’ దోపిడీ

Oct 4 2026 5:33 AM | Updated on Oct 4 2026 5:33 AM

Mining Mafia running rampant under Chandrababu Govt Rule

కాకినాడ జిల్లా వాలు తిమ్మాపురం గ్రామంలో అక్రమంగా గ్రావెల్‌ తవ్వకాలు

బాబు పాలనలో చెలరేగుతున్న మైనింగ్‌ మాఫియా  

రాష్ట్రంలో కొండలను గుల్ల చేస్తున్న అక్రమార్కులు  

విలువైన ఖనిజాలనూ కబళిస్తున్న అసురగణం   

తెల్లరాయి, బెరైటీస్‌ మైకా, క్వార్ట్జ్, గ్రానైట్‌ కాదేదీ దోపిడీకి అనర్హం 

యథేచ్ఛగా గ్రావెల్, మట్టి, ఇసుక తవ్వకాలు  

రాజధాని ప్రాంతంలో అడ్డూఅదుపూ లేకుండా దందా  

ఇష్టారీతిన తూట్లు.. నదీమ తల్లులకు గర్భశోకం

ప్రభుత్వ పెద్దలే సూత్రధారులు  

అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల కనుసన్నల్లోనే అరాచకపర్వం  

చంద్రబాబు పాలనలో రాష్ట్రవ్యాప్తంగా మైనింగ్‌ మాఫియా చెలరేగిపోతోంది. ఇష్టారీతిన మట్టి, గ్రావెల్, ఇసుక, సహజ వనరుల దోపిడీకి తెగబడుతోంది. కొండలనూ కబళిస్తోంది. గుల్లచేసి సొమ్ము చేసుకుంటోంది. విలువైన ఖనిజాలను కబళిస్తోంది. ప్రభుత్వ పెద్దలే సూత్రధారులుగా సాగుతున్న ఈ అరాచకపర్వం ఎమ్మెల్యేలు, ఎంపీల కనుసన్నల్లోనే సాగుతోంది. ఈ దందాకు సర్కారు పెద్దల అండదండలు పుష్కలంగా లభిస్తున్నాయి. ఫలితంగా కొండలు కుదేలవుతున్నాయి. నదీగర్భాలకు తూట్లు పడుతున్నాయి. తాజాగా చీరాల నియోజకవర్గంలో సాగుతున్న ఇసుక దందాపై మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అక్రమ మైనింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయినా అధికార పార్టీ నేతల ఆగడాలు ఆగలేదు. అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి.

సాక్షి, నెట్‌వర్క్‌: రాష్ట్ర రాజధాని ప్రాంతంలోనే టీడీపీ నేతలు మైనింగ్‌కు తెగబడుతున్నారు. ప్రకా­శం బ్యారేజ్‌ ఎగువ, దిగువ ప్రాంతాల్లో కృష్ణానదిలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. డ్రెడ్జింగ్‌ పడవలతో నదీగర్భానికి తూట్లు పొడుస్తు­న్నారు. రాత్రీపగలూ తేడాలేకుండా తవ్వకాలు చేస్తున్నారు. సేకరించిన ఇసుకను పలుచోట్ల డంపు­చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. రాజధాని నిర్మా­ణా­ల పేరుతోనూ ఇసుక దోపిడీకి తెగబడుతున్నారు. తాడికొండ నియోజకవర్గంలో  గ్రావెల్‌ అక్రమంగా తరలిపోతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. రాజధాని నిర్మాణాల పేరిట టీడీపీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఈ దందా సాగుతుండడంతో చేష్టలుడిగి చూస్తున్నారు. తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో అక్రమార్కులు కొండలను గుల్ల చేసి గ్రావెల్, కంకర యథేచ్ఛగా దోచుకుంటున్నా­రు. పట్టా భూముల్లోనూ గ్రావెల్‌ తవ్వకాలు యథే­చ్ఛగా సాగిస్తున్నారు. 

పల్నాడు జిల్లా  అమరావతి మండలంలో టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ అను­చరుల ఆధ్వర్యంలోనే యథేచ్ఛగా ఇసుక దోపిడీ సాగుతోంది. రీచ్‌లలో పాగా వేసి రాత్రీ­పగలూ ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో మంత్రి అనగాని సత్య­ప్రసాద్‌ అనుచరుల దందా సాగుతోంది. పంట భూ­ములను కబళించి యథేచ్ఛగా మట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. చీరాల నియోజవర్గంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలంలో మైనింగ్‌ యథేచ్ఛగా సాగుతోంది. గ్రావెల్, మట్టి అక్రమంగా తరలిపో­తోంది. క్వారీ­ల్లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగు­తున్నాయి. ఒక్కొక్క క్వారీ నుంచి రోజుకు రూ.30 లక్షలకుపైగా మట్టి, గ్రావెల్‌ దోపిడీ జరుగుతోంది. ఈ ఒక్క నియోజవకర్గంలోనే రోజుకు రూ.పది కోట్ల మేర అక్రమ సొమ్మును టీడీపీ నేతలు జేబుల్లో వేసుకుంటున్నారని సమాచారం. ఈ దందా అంతా టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ కన్నుసన్నల్లోనే సాగుతోంది.  

 పల్నాడు జిల్లా బీరవల్లిపాయ చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు.... 

పెన్నాకు తూట్లు 
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెన్నా నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగుతు­న్నాయి. నదుల్లో ఇసుక తవ్వకాలు చేపడట్టకూడదని నిషేధం ఉన్నా..భారీ యంత్రాలతో నదీగర్భాన్ని కుళ్లబొడుస్తున్నారు. దీంతో సోమశిల ప్రాజెక్ట్‌ మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. ప్రాజెక్టు సున్నిత ప్రాంతంలోనూ నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు సాగించడం ఆందోళన కలిగిస్తోంది. వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సతీమణి షాడో ఎమ్మెల్యేగా మారి దందా సాగిస్తున్నట్టు సమాచారం. ఆత్మకూరు నియోజక­వర్గంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కీలక అనుచరుడే ఇసుక దందా సాగిస్తున్నారు. ఒక్క పీకేపాడులోనే నెలకు రూ.వంద కోట్ల ఇసుక దోపి­డీకి తెగబడినట్టు సమాచారం. నెల్లూరు పెన్నా­బ్యారేజీ, సంగం బ్యారేజీ వద్ద కూడా డీసిల్టింగ్‌ పేరుతో యథేచ్ఛగా యంత్రాలతో తవ్వేస్తున్నారు.   

⇒ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇసుక, గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.  మార్కా­పురం జిల్లాలో పేదలు, జర్నలిస్టులకు కేటాయించిన స్థలాల్లోనూ అక్రమ తవ్వకాలకు బరితెగించడం గమనార్హం. దర్శి మండలంలో ఎర్రమట్టి అక్రమ రవాణాతో నెలకు రూ.రెండు కోట్ల వర­కూ అక్రమంగా ఆర్జిస్తున్నట్టు తెలుస్తోంది. కందు­కూరు నియోజకవర్గంలోని పాలేరు, ఉప్పుటేరు, మున్నేరు తదితర నదులను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు.  

గోదావరి ఘోష 
తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ నేతల తవ్వకాలతో గోదారమ్మ నదీగర్భానికి భారీగా తూట్లు పడుతు­న్నాయి. ఇసుక రాత్రీపగలూ తేడా లేకుండా భారీగా తరలిపోతోంది. ప్రతి ఇసుక లారీకీ రాజమహేంద్ర­వరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరికి రూ.2 వేలు చొప్పున చెల్లించాల్సిందేనని ర్యాంపుల నిర్వాహకులు బహిరంగంగానే ఇక్కడ చెబుతుండడం గమనార్హం. కాతేరులోనూ టీడీపీ ఎమ్మెల్యే కన్నసన్నల్లోనే దందా సాగుతోంది. 

⇒ కాకినాడ జిల్లా పెద్దాపురం మైనింగ్‌ మాఫియాకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. రెండు నియోజకవర్గా­లకు సరిహద్దుగా ఉన్న రామేశంమెట్టను గ్రావెల్‌ కోసం అక్రమార్కులు తవ్వేస్తున్నారు. తుని మండలం లోవ కొత్తూరులో  పోలవరం ఎడమ ప్రధాన కాలువ తవ్వకంలో ఏర్పడిన మట్టి గుట్టలను అక్రమంగా తరలించుకుపోతున్నారు. 
 
⇒ ఏలూరు జిల్లాలో మట్టి అక్రమ రవాణా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో యథేచ్ఛగా సాగుతోంది. ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో తమ్మిలేరులో అక్ర­మ రవాణా నిలిచిపోవడంతో మెట్ట ప్రాంతంలో మట్టి దందాకు తెరలేపారు. పోలవరం నియో­జకవర్గంలో జనసేన నేతలు మట్టిని పొక్లె­యిన్లతో అడ్డగోలుగా కొల్లగొడుతున్నారు.  

నెల్లూరు వేంకటేశ్వరపురం వద్ద పెన్నా నదిలో బ్రిడ్జికి సమీపంలోనే ఇసుకను అక్రమంగా తోడేస్తున్న దృశ్యం  

ఉత్తరాంధ్రలో గ్రానైట్, తెల్లరాయి, నల్ల ఇసుక దందా 
శ్రీకాకుళం జిల్లాలో గ్రానైట్, గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. టెక్కలిలో నీలి గ్రానైట్‌కు డిమాండ్‌ బాగుండడంతో టీడీపీ నేతలు యథేచ్ఛగా కొల్లగొట్టేస్తున్నారు. జిల్లాకు చెందిన ఓ కీలక నేత సోదరుడు ఆయన కుమారుడు అండతో అక్రమ గ్రానైట్‌ తవ్వకాలు, తరలింపు సాగుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరం పంచాయతీలో రాత్రి వేళ నల్ల ఇసుకను అక్రమార్కులు కొల్లగొట్టేస్తున్నారు. పెందుర్తి నియోజకవర్గంలోనూ గ్రావెల్‌ను అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. పెందుర్తి మండలం దువ్వపాలెంలో తెల్లరాయి మెటల్‌ కొండను పూర్తిగా తొలిచేశారు. దీంతో రాళ్లు కూలిపోతున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతన్నారు. టీడీపీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌ అనుచరగణం రోజూ రూ.లక్షల విలువైన మట్టి దోచేస్తున్నారు. ఎస్‌ఆర్‌పురంలోని తెల్లరాయిమెటల్‌ని జనసేన నాయకులు అక్రమంగా తరలించేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలోనూ ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. పలు మండలాల్లో అక్రమ గ్రావెల్‌ క్వారీయింగ్‌ చేస్తున్నారు. యలమంచిలి నియోజక వర్గంలోని అచ్యుతాపురం అందలాపల్లి కొండపై నిబంధనలకు విరుద్ధంగా క్వారీయింగ్‌ జరుగుతోంది. అలూరి సీతారామరాజు మన్యం జిల్లాలోనూ పపలు గెడ్డలలో ఇసుక అక్రమ తవ్వకాలు భారీగా జరుగుతున్నాయి.  

అమరావతి పరిధిలో యథేచ్ఛగా కృష్ణా నదిలో ఇసుక డ్రెడ్జింగ్‌ సాగుతోందిలా... 

రాయలసీమలో టీడీపీ నేతల జేబుల్లోకి  ఖనిజ సంపద  
రాయలసీమలో టీడీపీ నేతలు అడ్డగోలుగా రెచ్చిపో­తున్నారు. కొండలను కొల్లగొట్టేస్తున్నారు. విలువైన ఖనిజ సంపదను రాష్ట్రాలు దాటించి సొమ్ము చేసు­కుంటున్నారు. అనంతపురం జిల్లాలో యథేచ్ఛగా అక్రమ క్వారీలను నిర్వహిస్తున్నారు. కడప జిల్లాలో బెరైటీస్‌ నిక్షేపాల ద్వారా రూ.వందల కోట్ల రూపా­యలు దోచుకుంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి  ఇసుక, మట్టి, గ్రావెల్‌ పెద్ద ఎత్తున కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు తరలిపోతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇసుక, మట్టి, గ్రానైట్‌తోపాటు కంకర క్వారీయింగ్‌ అక్రమంగా సాగుతోంది. తిరుపతి జిల్లాలోని  వెంకటగిరి నియోజకవర్గంలో మైకా, క్వార్‌ట్టŠజ్‌ తదితర విలువైన ఖనిజాల దోపిడీ సాగుతోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement