ప్రభుత్వ ఆస్పత్రుల రోగుల డేటా ప్రైవేట్ సంస్థకు అప్పగింత!
వేలాది మంది రోగుల వ్యక్తిగత, వైద్య సమాచార భద్రతపై నిపుణుల ఆందోళన
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అత్యంత భద్రతతో కూడిన ఎన్‌ఐసీ ద్వారా రోగుల రికార్డులు నిర్వహణ
ఆ వ్యవస్థను పక్కనపెట్టి ప్రైవేట్ సంస్థకు డేటా అప్పగించడంపై విమర్శలు
ఇప్పటికే డిజిటల్ హెల్త్ సేవల పేరిట సంజీవని అమలు
ముసుగులో రూ.415 కోట్ల స్కామ్
ఆ టెండర్‌లో లేని డీఎంఈ, డీఎస్‌హెచ్ ఆస్పత్రుల రికార్డుల నిర్వహణను మరో రూ.200 కోట్లకు కట్టబెడుతూ ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసి ప్రతి గ్రామంలోనూ విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేసి ప్రజలందరికీ వారి ఇంటి వద్దే అత్యుత్తమ నాణ్యమైన వైద్య సేవలు అందించారు. వైద్యులే ప్రజల వద్దకు వెళ్లి వారిని పరీక్షించి అన్ని రకాల మందులను ఉచితంగా అందించేవారు. అలాంటి వైద్య ఆరోగ్య రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం నేడు భ్రష్టుపట్టించింది. కమీషన్ల కోసం.. డిజిటల్ హెల్త్ సేవలు అందిస్తామంటూ సంజీవని పేరుతో ఇప్పటికే రూ.415 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ ప్రభుత్వ పెద్దలు ఇది చాలదన్నట్టు మరో రూ.200 కోట్ల స్కామ్‌కు తెరలేపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్‌సీలు), విలేజ్ క్లినిక్‌లలో సంజీవని సేవల అమలు కోసం ప్రభుత్వం పిలిచిన రూ.415 కోట్ల టెండర్ పరిధిలో లేని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్‌హెచ్) ఆస్పత్రుల రోగుల రికార్డుల నిర్వహణను సైతం ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వేలాది మంది రోగుల వ్యక్తిగత, వైద్య సమాచారాన్ని ప్రైవేట్ సంస్థకు అప్పగించడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో డీఎంఈ, డీఎస్‌హెచ్ ఆస్పత్రుల్లో రోగుల రికార్డుల నిర్వహణను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) రూపొందించిన డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా నిర్వహించారు. అత్యంత భద్రతతో కూడిన ఈ వ్యవస్థను పక్కనపెట్టి ప్రైవేట్ సంస్థకు రోగుల డేటాను అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ, విలేజ్ క్లినిక్‌ల కోసం ఉద్దేశించిన రూ.415 కోట్ల సంజీవని టెండర్‌లో డీఎంఈ, డీఎస్‌హెచ్ ఆస్పత్రుల రికార్డుల నిర్వహణ అంశం లేకపోయినా.. ఆ పనిని ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించడం ద్వారా మరో రూ.200 కోట్ల స్కామ్‌కు తెరలేచిందనే చర్చ వైద్య శాఖ వర్గాల్లో సాగుతోంది. కర్ణాటకలో ఘోరంగా విఫలమైన డిజిటల్ నెర్వ్ సెంటర్(డీఐఎన్‌సీ–డింక్)కు సంజీవని పేరు పెట్టి ఓ ప్రైవేట్ సంస్థకు చంద్రబాబు ప్రభుత్వం ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచిపెడుతోందంటూ ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.
సీఎం ఆదేశాలతో వైద్య శాఖ ఉత్తర్వులు
అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో సంజీవని అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఈ ఏడాది ఆగస్టు నెలలో వైద్య శాఖ సమీక్షలో ఆదేశించారు. దీంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డీఎస్‌హెచ్, డీఎంఈ ఆస్పత్రుల్లో రోగుల రికార్డుల నిర్వహణను ఆ సంస్థకే అప్పగించాలని ఇటీవల వైద్య శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎన్‌ఐసీ స్వయంగా రూపొందించిన నెక్టŠస్ జెన్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా డీఎస్‌హెచ్, డీఎంఈ ఆస్పత్రుల్లో రోగుల రికార్డుల నిర్వహణను అమలులోకి తెచ్చారు. దేశంలోని అనేక రాష్ట్రాలు ఇవే ప్లాట్‌ఫామ్స్ ద్వారా రోగుల సమాచారాన్ని భద్రంగా ఉండేలా చూస్తున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్స్‌లో నమోదయ్యే రోగుల వివరాలన్నీ ఎన్‌ఐసీ ఆధ్వర్యంలోని నేషనల్ డేటా సెంటర్‌లో అత్యంత పటిష్టమైన ఫైర్‌వాల్స్, నిఘా నీడన భద్రపరచబడతాయి. ప్రైవేట్ క్లౌడ్ సర్వర్ మాదిరిగా డేటా లీకేజీ, వాణిజ్యపరమైన దుర్వినియోగం జరిగే అవకాశం ఉండదు. ఇంత పటిష్టమైన వ్యవస్థను పక్కన పెట్టి అడ్డదారుల్లో ప్రైవేట్ సంస్థ చేతుల్లో డీఎస్‌హెచ్, డీఎంఈ ఆస్పత్రుల రికార్డులను, డేటాను చంద్రబాబు ప్రభుత్వం పెడుతోంది.
టెండర్ నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి
ప్రాథమిక వైద్య రంగం కోసం రూపొందించిన టెండరును, అంతకంటే ఎన్నో రెట్లు పెద్దవైన బోధనాసుపత్రులు, జిల్లా కేంద్ర ఆసుపత్రులకు వర్తింపజేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేల సంఖ్యలో పడకలుండే పెద్ద ఆసుపత్రులలో రోగుల సమాచార నిర్వహణ చాలా పెద్ద బాధ్యత. దీనికి కొత్తగా బహిరంగ టెండరు పిలవకుండా, గుట్టుచప్పుడు కాకుండా ఓ సంస్థకు అప్పగించడం ఆ సంస్థకు భారీ లబ్ధి చేకూర్చడం కిందకే వస్తుందని అధికారిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అతి తక్కువ ఖర్చుతో, ఎంతో భద్రతతో కూడిన ప్రభుత్వ వ్యవస్థను రద్దు చేసి, ప్రైవేటు సంస్థకు పెద్ద ఆసుపత్రులను సైతం ధారాదత్తం చేయడం ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనమని విమర్శకులంటున్నారు. ఈ అడ్డగోలు నిర్ణయంతో ఖజానాలో రూ. వందల కోట్లు లూటీ అవ్వడంతో పాటు, ప్రజల సున్నితమైన సమాచారానికి ముప్పు వాటిల్లుంతుందని వైద్య రంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


