జూడాల సమ్మెతో కుంటుపడిన సేవలు
ఆస్పత్రుల్లో పేద రోగుల హాహాకారాలు
చేతులెత్తేసిన చంద్రబాబు సర్కారు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఘోర వైఫల్యం
సాక్షి, అమరావతి: జూనియర్ డాక్టర్ల(జూడా) సమ్మె నేపథ్యంలో పేద రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బోధనాస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో లేక సేవలు కుంటుపడ్డాయి. ఫలితంగా రోగులు హాహాకారాలతో ఆస్పత్రులు దద్దరిల్లుతున్నాయి. అయినా చంద్రబాబు సర్కారు పట్టించుకోవడం లేదు. పూర్తిగా చేతులెత్తేసింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ఘోరంగా విఫలమైంది. దీంతో రోగుల పరిస్థితి రోజురోజుకూ మరింత దయనీయంగా మారుతోంది. సుదూర ప్రాంతాల నుంచి జీజీహెచ్‌లకు వచ్చిన రోగులు వైద్యుల్లేక పోవడంతో ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. అక్కడా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్యం అందకపోతుండటంతో గత్యంతర లేక అప్పులు చేసి వైద్యం చేయించుకుంటున్నారు.
కళ్లకు గంతలు కట్టుకుని జూడాల నిరసన
రాష్ట్ర వ్యాప్తంగా జూడాల సమ్మె బుధవారం కొనసాగింది. తాము సేవలకు దూరం కావడంతో రోగులు పడుతున్న ఇబ్బందులను చూడలేకపోతున్నామంటూ కళ్లకు గంతలు కట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి తమ సమస్యలు పరిష్కరించి, రోగులకు వైద్యం అందేలా చూడాలని నినాదాలు చేశారు. విజయవాడ జీజీహెచ్‌లో చేస్తున్న జూడాల సమ్మెలో ఏపీ హెల్త్‌కేర్ రీఫారమ్స్ డాక్టర్స్ అసోసియేషన్(హెచ్‌ఆర్‌డీఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వెంకటరమణ పాల్గొన్నారు. జూడాల సమ్మెకు మద్దతు ప్రకటించారు. వీరికి ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
తూతూమంత్రం చర్యలతో సరి..!
స్టైపెండ్ పెంపులో అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 10వ తేదీ నుంచి జూడాలు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. 17వ తేదీ నుంచి అత్యవసర సేవలనూ వారు బహిష్కరించారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో బాబు సర్కార్ ఘోరంగా విఫలమైంది. రాష్ట్రం మొత్తం 8 వేల మంది ఇంటరŠన్స్, పీజీ, సీనియర్ రెసిడెంట్స్ సమ్మెలోకి వెళ్లారు. ఇంత పెద్ద మొత్తంలో వైద్యులు సేవలకు దూరమైతే ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ, సెకండరీ హెల్త్ నుంచి కొందరు వైద్యులను జీజీహెచ్‌లకు డిప్యూట్ చేసి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. దీంతో రోగుల అవసరాలకు సరిపడా జీజీహెచ్‌ల్లో వైద్యులు లేని దుస్థితి నెలకొంది.
ఫలితంగా సాధారణ రోజుల్లో కంటే ప్రస్తుతం వైద్య సేవలు దారుణంగా కుంటుపడ్డాయి. అయినప్పటికీ సర్కారు బుకాయిస్తోంది. వైద్య సేవలెక్కడా ప్రభావితం కాలేదని సన్నాయి నొక్కులునొక్కుతోంది. వైద్య శాఖ లెక్కల ప్రకారమే డీఎంఈ పరిధిలో రోజుకు 2 వేలకు పైగా సర్జరీలు నమోదవ్వాలి. ఇదిలా ఉండగా సమ్మె కారణంగా సర్జరీలు సగం కూడా జరగడం లేదని తెలుస్తోంది. వైద్యుల కొరత నేపథ్యంలో ఉన్న అరకొర వైద్యులే ఓపీకి వచ్చిన తూతూ మంత్రంగా వైద్యం చేసి తరిమేస్తున్నారని రోగులు గగ్గోలు పెడుతున్నారు. తమ సమస్య ఏంటో కూడా వివరంగా వినడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. వార్డుల్లో అడ్మిట్ అయిన వారి పరిస్థితిని వాకబు చేసే నాథుడే కరువయ్యారని లబోదిబోమంటున్నారు.
విశాఖలో జూనియర్ వైద్యుల పోస్టుకార్డు ఉద్యమం
మహారాణిపేట: స్టైపెండ్ 15 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ 9 రోజులుగా ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులు బుధవారం విశాఖలో పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు. సీఎం, డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రులకు పోస్టు కార్డులు పంపారు. అనంతరం బీచ్ రోడ్డులో కాళీమాత ఆలయం నుంచి పార్క్ హోటల్ వరకు ర్యాలీ నిర్వహించారు. సమ్మె కారణంగా కేజీహెచ్‌లో ఓపీ, అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడి రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
3 శాతమే పెంచుతాం
జూడాల స్టైపెండ్‌ను 3 శాతమే పెంచుతామని మరోమారు బుధవారం ప్రభుత్వం ప్రకటించింది. 30 శాతం పెంచాలని జూడాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఈ నేపథ్యంలో ఇంటర్న్‌లకు 2026 సంవత్సరానికి 5 శాతం పెంచి, తర్వాత ఏటా 3 శాతం పెంపు వర్తింపజేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. పీజీ, సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థులకు ఏటా 3 శాతం పెంచాలని నిర్ణయించామంది. వెంటనే జూడాలు సమ్మె విరమించి విధుల్లో చేరాలని సూచించింది.


