కోల్‌కతా: కొన్ని సార్లు మనం ఏదో గొప్పగా చేయాలనుకున్న పనే మనకు ఇబ్బందులు తెచ్చిపడుతుంది. తాజాగా బెంగాల్ సీఎం సువేందు అధికారి పరిస్థితి అలానే ఉంది. బెంగాల్ టూరిజంను ప్రపంచస్థాయిలో డెవలఫ్ చేద్దామనుకొని అన్ని హంగులతో ఒక నిమిషం నిడివి గల వీడియోని రూపొందించారు. అయితే అదే ఇప్పుడు ట్రోలింగ్‌కు గురవుతుంది. అసలు ఈ టూరిజం వీడియోల బెంగాల్ ఎక్కడుందంటూ నెటిజన్స్ ఆయనను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
ఇటీవల వెస్ట్ బెంగాల్ సీఎం సువేందు అధికారి రాష్ట్రంలోని పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 500 కోట్ల నిధులను ప్రకటించారు. అంతేకాకుండా నిన్న (శుక్రవారం) బెంగాల్ సాంస్కృతిక వారసత్వాన్ని భారతదేశం భిన్నంగా భావించే చోటు' అనే క్యాచ్‌లైన్‌తో ఒక లోగోనుఎంతో ఆర్భాటంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా సువేందు మాట్లాడుతూ" మనం మన రాష్ట్రంలో పర్యాటక మౌలిక సదుపాయాలను నాశనం చేశాం. పర్యాటకులు మన రాష్ట్రంలోని డార్జిలింగ్, కాలింపాంగ్ మీదుగా సిక్కింకు వెళతారు. దీనిని మార్చడానికి మేము నిశ్చయించుకున్నాము," అని అన్నారు.
అయితే ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో ఇప్పుడు ఆయనకు తలనొప్పిగా మారింది. బెంగాల్ టూరిజం వీడియోలో.. ఈఫిల్ టవర్, రష్యాలోని సెయింట్ బాసిల్ కేథడ్రల్, పిరమిడ్లు, రియోలోని క్రైస్ట్ ది రిడీమర్ ఉన్నాయి. బెంగాల్‌కు చెందిన ప్రసిద్ధ హౌరా వంతెన మాత్రమే అలా వచ్చి వెళ్లిపోతుంది. దీంతో ఇది చూసిన నెటిజన్స్ ఇక్కడ అసలు బెంగాల్ ఎక్కడ ఉంది అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అసలు ఇందులో బెంగాల్‌కు సంబంధించిన ప్రదేశాలు ఎక్కడున్నాయని ప్రశ్నిస్తున్నారు.
పొలిటికల్ సెటైర్స్
అయితే ఈ టూరిజం వీడియోపై స్వంత పార్టీలోనే తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. బీజేపీ సీనియర్ నేత త్రిపుర, మేఘాలయ మాజీ గవర్నర్ తథాగత రాయ్ దీనిపై తీవ్ర విమర్శలు చేశారు. ఇది "మూర్ఖపు" "అనుభవం లేని వీడియో" అని అభివర్ణించారు. వెంటనే దానిని తొలగించాలని డిమాండ్ చేశారు. "పశ్చిమ బెంగాల్‌పై తీసిన వీడియోలో మాస్కో, ఈజిప్ట్, రియో డి జనీరో దృశ్యాలు ఎందుకు ఉండాలి?" అని ప్రశ్నించారు. దీనిని రూపొందించిన వ్యక్తిని మత్స్యశాఖకు లేదా అలాంటి మరేదైనా విభాగానికి బదిలీ చేయాలని నేను సూచిస్తున్నాను అని వ్యంగ్యంగా మాట్లాడారు. టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయన్ "ఈ వీడియోకు 'చెత్త' అనే పదం కూడా చాలా తక్కువైనది అని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
West Bengal tourism video for the new era 🔥 pic.twitter.com/djVMEihL6n
— AniAdhikary (@aniadhikaryy) September 4, 2026


