‘‘పెంపుడు జంతువుల కోసం ఖర్చు చేసే డబ‍్బు కంటే తక్కువ’’ | Dipke slams Maha govts Rs 2L payout to Adivasi students | Sakshi
Sakshi News home page

‘‘పెంపుడు జంతువుల కోసం ఖర్చు చేసే డబ‍్బు కంటే తక్కువ’’

Sep 6 2026 4:13 PM | Updated on Sep 6 2026 4:24 PM

  Dipke slams Maha govts Rs 2L payout to Adivasi students

న్యూఢిల్లీ: ఆశ్రమ పాఠశాలల్లో మృతి చెందిన ఆదివాసీ విద్యార్థుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పరిహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మండిపడ్డారు. ఆ పరహారం కొంతమంది రాజకీయ నాయకులు ఏడాదిలో తమ పెంపుడు జంతువుల కోసం ఖర్చు చేసే డబ‍్బు కంటే కూడా తక్కువగా ఉందని  చెప్పారు. ఎక్స్‌లో దీప్కే స్పందిస్తూ.. 590 మందికి పైగా ఆదివాసీ విద్యార్థుల కుటుంబాలకు కేవలం రూ.2 లక్షల చొప్పున పరిహారం మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు.

“కేవలం 2 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని ఆశ్రమ పాఠశాలల్లో 590 మందికి పైగా ఆదివాసీ విద్యార్థులు మృతి చెందారు. వారి కుటుంబాలకు కేవలం రూ.2 లక్షల చొప్పున పరిహారం మాత్రమే అందింది” అని దీప్కే పేర్కొన్నారు. విద్యార్థులకు భద్రతను ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని, నిర్లక్ష్యం కారణంగానే వారు మృతి చెందారని దీప్కే ఆరోపించారు.

“వారి భద్రత, సంక్షేమాన్ని ప్రభుత్వం నిర్ధారించడంలో విఫలమైంది. నిర్లక్ష్యం, శ్రద్ధ లేకపోవడం, నిర్వహణ లోపం కారణంగా విద్యార్థులు మృతి చెందినప్పుడు వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున అందజేస్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు ఏడాదిలో తమ పెంపుడు జంతువుల కోసం ఖర్చు చేసే మొత్తం కంటే ఇది తక్కువే కావచ్చు. రాష్ట్రం దృష్టిలో ఆదివాసీ విద్యార్థి జీవితం విలువ ఇంతేనా?” అని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వ ఉద్యోగాల్లో షెడ్యూల్డ్‌ ట్రైబ్‌ అభ్యర్థులను నియమించాలని, గిరిజన పిల్లల కోసం నిర్వహిస్తున్న వసతి పాఠశాలల పరిస్థితులను మెరుగుపరచాలని డిమాండ్‌ చేస్తూ గిరిజన విద్యార్థులు నిరసనలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీప్కే ఈ వ్యాఖ్యలు చేశారు.

గడ్చిరోలి జిల్లాలోని ఒక వసతి పాఠశాలలో పాముకాటుకు గురై ముగ్గురు గిరిజన బాలికలు మృతి చెందిన ఘటన తర్వాత పుణె, నాగ్‌పూర్, నాసిక్‌లలో నిరసనలు ప్రారంభమయ్యాయి. గిరిజన వసతి గృహాల్లో ఉంటూ, గిరిజన వసతి పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి రూ.10 కోట్ల బీమా కవరేజీ కల్పించాలని కూడా నిరసనకారులు డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement