సాధారణ ఫుడ్‌ డెలివరీ కాస్తా..ఫ్లైట్‌లో ఇంటికి వెళ్లేలా..! | A routine food delivery took an unexpected turn Post Goes Viral | Sakshi
Sakshi News home page

సాధారణ ఫుడ్‌ డెలివరీ కాస్తా..ఫ్లైట్‌లో ఇంటికి వెళ్లేలా..!

Sep 17 2026 1:42 PM | Updated on Sep 17 2026 2:47 PM

A routine food delivery took an unexpected turn Post Goes Viral

ఓ ఫుడ్‌ డెలివరి బాయ్‌, కస్టమర్‌ మధ్య జరిగి భావోద్వేగ కథ. ఎప్పటిలానే డెలివరి చేసిన ఫుడ్‌ ఆర్డర్‌ ఆరోజు ఊహించని మలుపు తిరిగి కృతజ్ఞతతో కళ్లు చెమ్మగిల్లే కథగా మారింది. కొన్ని సాయాలు ఎంత పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయో..పొందే వరకు లేదా అందే వరకు తెలియదేమో. కానీ ఆ హృద్యమైన కథ విన్నాక..ఆ ఫుడ్‌ డెలివరీ బాయ్‌ని నిస్సందేహంగా అదృష్టవంతుడు అని చెప్పొచ్చు.

అసలేం జరిగిందంటే..అంకిత్‌ పాండే అనే వ్యక్తి ఈ కథను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆయన చాలాసార్లు ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టుకున్నారు. ఆరోజు కూడా ఎప్పటిలానే ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టుకుంటే వచ్చిన డెలివరీ బాయ్‌ కూడా అపరిచితుడేం కాదు. చాలాసార్లు అతడు పాండే ఇంటికి వచ్చిన డెలివరీ బాయే. అయితే ఆరోజు ఎందుకో అతడు చాలా తేడాగా ఉన్నట్లు గమనించాడు. డెలివరీ బాయ్‌​ కూడా చాలా సంకోచంగా కొంచెం నీళ్లు కావాలని అడిగాడు. 

దాంతో పాండే అతడిని లోనికి ఆహ్వానించాడు. మంచి నీళ్లు ఇచ్చి అతడి ముఖం తేరిపార చూసి..ఏమైందని నెమ్మదిగా అడిగాడు. అతడి కళ్లు ఎర్రబడి ఏడ్చినట్టు ఉండటంతో ఏదో తేడా కొడుతుందని..అతడితో మాటలు కలిపాడు పాండే. దాంతో ఆ డెలివరీబాయ్‌ తన పరిస్థితిని పూసగుచ్చినట్లు వివరించాడు. తన తల్లి ఉదయం మెట్లపై నుంచి పడిపోయిందని, ఆమె పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉందని, ప్రస్తుతం ఆమె ఐసీయూలో ఉందంటూ బోరుమన్నాడు. వీలైనంత త్వరితగతిన వెళ్దామంటే తన ఊరికిపోయే రైలు రాత్రి 11 గంటలకంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈలోగా ఏ వార్త వింటానో అని ప్రతి క్షణం ఓ నరకంలా టెన్షగా ఉందంటూ గద్గద స్వరంతో మాట్లాడాడు. 

దాంతో చలిపోయిన పాండే తక్షణమే అతడు ఫ్లైట్‌లో వెళ్లేలా ఏర్పాట్లు చేశాడు. రూ. 4000ల టికెట్‌తో విమానంలో వెళ్లేలా బుక్‌ చేశాడు. తాను ఇంతవరకు విమానం ఎక్కలేదని చెప్పడంతో..పాండే తనలోని ఆందోళన అర్థం చేసుకుని, సాయంగా ఒక స్నేహితడుని కూడా ఏర్పాటు చేశాడు. దాంతో ఆ డెలివరీ బాయ్‌ తన స్వస్థలానికి సకాలంలో వెళ్లి..తన తల్లి బాగోగులు చూసుకొన్నాడు. ఆ మరుసటి రోజే తన తల్లికి ప్రమాదం తప్పిందని, కొద్ది రోజుల్లోనే ఇంటికి తిరిగి వస్తుందని ఆనందంగా పాండేకి చెప్పాడు. 

అలాగే ఆ డెలివరీ బాయ్‌ విమాన టికెట్‌కి అయిన రూ. 4 వేలు తిరిగి ఇచ్చేశాడని, కానీ వాటిని తన తల్లి ఆరోగ్య ఖర్చులకు ఉపయోగించుకోమని వద్దని వారించినట్లు పోస్ట్‌లో చెప్పుకొచ్చారు పాండే. చివరగా.. ఒక చిన్న సహాయం ఎంత పెద ప్రభావాన్ని చూపి, ఒక వ్యక్తికి ఎంత పెద్ద భరోసాని ఇస్తుంది అనడానికీ ఈ ఘటనే ఉదాహరణ అంటూ తన పోస్ట్‌ని ముగించారు. 

నెటిజన్లు పాండే ఉదారతకు ఫిదా అవుతూ ప్రశంసలు కురిపించడంతో ఈ పోస్ట్‌  నెట్టింట అమితంగా వైరల్‌ అయ్యింది. నిజంగా ఈ కథ..లక్షలు వెచ్చించి భారీ సహాయాలు చేయకపోయినా..కనీసం మన చుట్టూ ఉండే వాళ్ల ముఖాల్లోని దిగులు, కష్టంగా గడుస్తున్న రోజుని అర్థం చేసుకుని తగిన సాయం అందించగలిగితే చాలు అనేందుకు ఈ సంఘటనే నిలువెత్తు నిదర్శనం. 

 

ఇదీ చదవండి: రాజకీయ ఫ్యాషన్‌కి కేరాఫ్‌గా మోదీ..! చివరికి అది కాస్తా..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement