నాలుగేళ్ల తర్వాత బీజేపీ కార్యకర్త అస్థిపంజరం వెలికితీత | Skeleton of BJP worker exhumed from grave after 4 years | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల తర్వాత బీజేపీ కార్యకర్త అస్థిపంజరం వెలికితీత

Sep 14 2026 5:34 PM | Updated on Sep 14 2026 5:34 PM

 Skeleton of BJP worker exhumed from grave after 4 years

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో 2021 అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసలో మరణించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ కార్యకర్త ఆస్తిక్ చంద్ర దాస్ అస్థిపంజరాన్ని నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు సమాధి నుంచి వెలికితీశారు. ఉత్తర 24 పరగణాల జిల్లా సందేశ్‌ఖాలీలో జరిగిన ఈ ప్రక్రియను కోర్టు ఆదేశాల మేరకు నిర్వహించారు. అస్థిపంజరాన్ని పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.

సందేశ్‌ఖాలీలోని ఝాంఝనియా గ్రామానికి చెందిన ఆస్తిక్ చంద్ర దాస్ ఎన్నికల అనంతరం జరిగిన హింసలో మరణించారు. ఆయన మరణానికి అసలు కారణం ఏమిటో నిర్ధారించేందుకు తాజాగా సమాధి నుంచి అస్థిపంజరాన్ని బయటకు తీశారు. పోలీసు అధికారి వివరాల ప్రకారం, మేజిస్ట్రేట్, మృతుడి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది. 

మొత్తం వ్యవహారాన్ని వీడియోగా కూడా రికార్డు చేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజున తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన సమయంలో ఆస్తిక్ చంద్ర దాస్‌పై దాడి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. 

మృతుడి కుమారుడు సుబ్రత దాస్ మాట్లాడుతూ.. దాడి తర్వాత తన తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా అడ్డుకున్నారని, దీంతో ఆయన ఇంట్లోనే మరణించారని ఆరోపించారు. ఈ ఘటన తర్వాత ఇంటి బయట పోలీసులు మోహరించారని, పోస్టుమార్టం నిర్వహించకుండానే మృతదేహాన్ని ఖననం చేయాల్సి వచ్చిందని కుటుంబం పేర్కొంది.

ప్రభుత్వం మారడంతో చర్యలు 
రాష్ట్రంలో ప్రభుత్వం మారాక కుటుంబం కోర్టును ఆశ్రయించడంతో అస్థిపంజరాన్ని వెలికితీసే ఆదేశాలు వచ్చాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య ఈ ఘటనను 2021 ఎన్నికల అనంతరం పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడులకు ఉదాహరణగా పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, దోషులకు శిక్ష పడుతుందని అన్నారు.

అవసరమైతే సీబీఐ దర్యాప్తు చేపట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ప్రస్తుతం పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షల నివేదికలపై ఈ కేసులో తదుపరి చర్యలు ఆధారపడనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement