సాక్షి, విజయవాడ: ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ లీగల్ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి మాజీ ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. న్యాయస్థానం బెయిల్ ఇచ్చినా అడ్డగించి మళ్ళీ వైఎస్సార్‌సీపీ నేతలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కోర్టు ఆవరణలోనే అరెస్ట్ చేయాలని చూశారు. మెగా డీఎస్సీ బాగోతం బయటపడుతుందని భయపడి ఇలా చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు.
డీఎస్సీ స్కామ్‌పై నిరసన తెలిపే కార్యక్రమంలో పాల్గొన్నందుకు పోలీసులు పెద్ద సంఖ్యలో కేసులు పెట్టారు. సోమవారం ర్యాలీలో పాల్గొన్న విజయవాడకు చెందిన నాగరాజు, సురేంద్ర, సుందర్‌పాల్‌పై అక్రమ కేసులు బనాయించిన పోలీసులు, పలు నాటకీయ పరిణామాల మధ్య అదే రోజు అర్ధరాత్రి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై పలు పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిప్పారు. అర్ధరాత్రి దాటాక మాచవరం స్టేషన్‌కు తీసుకువచ్చారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా.. సుందరపాల్, గుంటూరు ఎస్సీ సెల్ అధ్యక్షులు సురేంద్రకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే, పాత ధర్నా కేసుల నేపధ్యంలో విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్రకు రిమాండ్ విధించింది. ఇదే సమయంలో వారిపై పోలీసులు నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ, 307 సెక్షన్లు వర్తించవని కోర్టు స్పష్టం చేసింది. పోలీసులు పెట్టిన సెక్షన్లు చెల్లవని తెలిపింది. రవిచంద్ర రిమాండ్ నేపథ్యంలోనూ సెక్షన్లనూ కోర్టు మార్చింది.
అనంతరం, పొన్నవోలు సుధాకర్ మాట్లాడుతూ..‘డీఎస్సీలో మోసం జరిగిందని వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే అడ్డుకున్నారు. వినతిపత్రం ఇవ్వాలనుకున్న వాళ్ల తలలు పగలకొట్టారు. మావాళ్ల మీదే దాడి చేసి మళ్లీ వారి మీదే అక్రమ కేసులు పెట్టారు. 307, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ పెట్టారు. ఈ సెక్షన్లు ఈ కేసుకు పనికి రావు, వర్తించవని కోర్ట్ చెప్పింది. సుందర్ పాల్, సురేంద్రకు కోర్ట్ బెయిల్ ఇచ్చింది. రవిచంద్రపై గతంలో ఉన్న ధర్నా కేసుల నేపథ్యంలో 14 రోజులు రిమాండ్ వేసింది. ప్రతీ కార్యకర్తకు అండగా ఉండాలని వైఎస్ జగన్ చెప్పారు. రిమాండ్ చెల్లదని, బెయిల్ కోర్ట్ ఇస్తే బెయిల్ వచ్చిన వ్యక్తులను అడ్డుకుంటున్నారు. బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా కోర్ట్ ఆవరణలోనే మళ్ళీ అరెస్ట్ చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా చట్టపరంగా ఎదుర్కొంటాం. చట్టానికి విరుద్దంగా ప్రవర్తిస్తున్న పోలీసులను న్యాయస్థానాల ముందు నిలబడతాం’ అని కామెంట్స్ చేశారు.
మరింత ఉద్యమిస్తాం: రవిచంద్ర
వైఎస్సార్‌సీపీ విద్యార్ధి విభాగం నేత రవిచంద్ర మాట్లాడుతూ..‘నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఏపీలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. వైఎస్ జగన్ పిలుపు మేరకు మరింత ఉద్యమిస్తాం. ఎన్ని రిమాండ్‌లు వేసినా, ఉక్కుపాదం మోపినా భయపడే ప్రస్తకే లేదు. ప్రజల ముందు మీ మెడలు వంచుతాం అని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: ఏపీకి అతి భారీ వర్ష సూచన..


