రౌడీ దళం దాడులతో డీఎస్సీ స్కామ్‌పై పోరు ఆగదు
సీఎం చంద్రబాబు, లోకేశ్‌పై వైఎస్ జగన్ మండిపాటు
డీఎస్సీ కుంభకోణంపై వైఎస్సార్‌సీపీ శాంతియుత ర్యాలీ నిర్వహిస్తే టీడీపీ గూండాలతో దాడి చేయిస్తారా?
ఈ దాడిని పార్టీ పరంగా సీరియస్‌గా తీసుకుంటున్నాం
పోరాటం ఆపేదే లేదు.. దాడులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం
డీఎస్సీ స్కామ్‌లో చంద్రబాబు, లోకేశ్ అడ్డంగా దొరికారు
సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు
స్కామ్‌లను బయట పెడుతుంటే దాడులు చేయిస్తున్నారు
శాప్ కార్యాలయం వద్ద ర్యాలీతో డీఎస్సీ స్కామ్‌పై మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ.. దీన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు, లోకేశ్‌లు గూండాలను దింపారు
రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్ కన్నా ఘోరంగా తయారు చేశారు
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 నియామక వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ చేస్తున్న పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. అది యువగళం టీమ్ కాదని, రౌడీ దళమని మండిపడ్డారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన శాంతియుత ర్యాలీపై టీడీపీ గూండాలు దాడులకు పాల్పడిన ఘటనపై తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన పార్టీ నేతలతో సమావేశమయ్యారు.
శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగితే, దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా.. తమ పార్టీ నేతలపైనే కేసులు నమోదు చేస్తున్న తీరును నేతలు వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఘటనను పార్టీ సీరియస్‌గా తీసుకుంటుందని, దాడులపై గవర్నర్‌ను కలిసి పూర్తి వివరాలు తెలియజేయాలని సమావేశంలో నిర్ణయించారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. డీఎస్సీ స్కాంలో చంద్రబాబు, లోకేశ్‌లు అడ్డంగా దొరికిపోయారన్నారు. సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తుంటే ఎందుకు తట్టుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. స్కామ్‌లను బయట పెడుతుంటే దాడులకు దిగుతున్నారన్నారు. సోమవారం వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ర్యాలీతో డీఎస్సీ స్కామ్‌పై మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగిందని, ఆ చర్చను పక్కదారి పట్టించేందుకు దాడులు చేయించారని చెప్పారు. అసలు విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు భయపెట్టే రాజకీయాలకు తెరతీశారన్నారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
రౌడీ దళాన్ని దించి దాడులు
‘అది యువగళం టీం కాదు.. రౌడీ దళం. చంద్రబాబు అవినీతి, స్కామ్‌లు, అరాచకాలను ప్రశ్నించే ప్రతి చోటా ఈ రౌడీ దళాన్ని దించుతున్నారు. వారితో దాడులు చేయించి, భయపెట్టి, బెదిరించి.. ప్రశ్నించే గొంతులను మూయించాలని చూస్తున్నారు. శాంతియుతంగా జరుగుతున్న కార్యక్రమంలో అలజడి సృష్టించారు. పోలీసుల వద్ద ఉన్న లాఠీలు లాక్కొని, రాళ్లతో దాడులు చేశారు. ఇలాంటి ఘటనలకు కొంత మంది పోలీసులు కూడా కొమ్ముకాస్తున్నారు.
గాయాలపాలైనా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు చాలా సంయమనం పాటించారు. కానీ దాడులు చేసిన రౌడీ దళంపై కేసులు పెట్టకుండా, మా వాళ్లపైనే కేసులు పెడుతున్నారు. మా వాళ్లపై దాడులు చేసిన వారిని స్వేచ్ఛగా వదిలేసి, బాధితులపైనే కేసులు పెట్టడం ఏ రకమైన న్యాయం? దాడులు చేయడం, ఆ తర్వాత బాధితులపైనే కేసులు పెట్టడం, మళ్లీ అదే ఘటనను వక్రీకరించి ప్రచారం చేయడం ఒక పద్ధతిగా మారిపోయింది. గతంలో వైఎస్సార్‌సీపీ మీద చేసిన అనేక దాడుల్లో ఈ రౌడీదళం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్ కన్నా ఘోరంగా తయారు చేశారు.
డీఎస్సీ అభ్యర్థులకు అండగా వైఎస్సార్‌సీపీ
మీ బెదిరింపులకు భయపడి డీఎస్సీ స్కామ్‌పై పోరాటం ఆగదు. మీ దుర్మార్గాలకు భయపడి వెనకడుగు వేసేదే లేదు. ప్రజల తరఫున పోరాటాల విషయంలో తగ్గేదే లేదు. నిజాయితీపరులైన డీఎస్సీ అభ్యర్థులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది. డీఎస్సీ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించి, వాస్తవాలను ప్రజల ముందుంచే వరకు మేం నిలదీస్తూనే ఉంటాం. అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
కుప్పం నుంచే దాడులకు కుట్ర చేశారా?
నిన్నటి దాడులకు కుప్పంలోనే చంద్రబాబు కుట్ర పన్నారని మాకు అనుమానం ఉంది. కుప్పం బహిరంగ సభలో చంద్రబాబు చేసిన బెదిరింపులే ఇందుకు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి రౌడీ దళాలను ప్రోత్సహిస్తూ.. అవినీతి, స్కామ్‌లపై ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైకి వీళ్లను పంపుతున్నారు. గతంలో వైఎస్సార్‌సీపీపై జరిగిన అనేక దాడుల్లోనూ ఇదే తరహా వ్యక్తులు కనిపించారు.
కళ్లముందు సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నా వాటిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు ఒత్తిళ్లతో పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదు. నిన్నటి దాడుల వ్యవహారంపై గవర్నర్‌ను కలుస్తాం. మా వాళ్లు ఇచ్చిన ఫిర్యాదులపై కచి్చతంగా చర్యలు తీసుకోవాలి. దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలి. రౌడీ దళాన్ని రంగంలోకి దించిన చంద్రబాబు, లోకేశ్‌ల పాత్రపై కూడా విచారణ జరపాలి. పోలీసుల వ్యవహారశైలి పైనా గవర్నర్‌కు పూర్తి వివరాలు, ఆధారాలు అందిస్తాం.


