ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న వలంటీర్లు
వేతనాలు పెంచుతామని ఎన్నికల ముందు బాబు హామీ ఇచ్చారు
రూ.5 వేలకు మరో రూ.5 వేలు కలిపి ఇస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు
వారు అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదు
వలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి
గత 26 నెలలకు నిరుద్యోగ భృతి చెల్లించాలి
గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్స్ అసోసియేషన్ డిమాండ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2.66 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్ల కుటుంబాలను చంద్రబాబు ప్రభుత్వం నమ్మించి నిలువునా మోసం చేసిందని గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దుయ్యబట్టింది. మంగళవారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన వలంటీర్ల సదస్సులో సంఘం అధ్యక్షుడు కుమార్ నాయక్, కార్యదర్శి డోలా స్వప్న మాట్లాడుతూ.. చంద్రబాబు కూటమి ప్రభుత్వం వలంటీర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి అధికారం చేపట్టిన రోజు నుంచి 26 నెలలుగా వలంటీర్లను విధులకు దూరంగా ఉంచినందున, ఈ కాలానికి యువతకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికలకు ముందు వలంటీర్లు అడగకుండానే వేతనాలు రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. సీఎం అయ్యాక ఆ హామీ నెరవేర్చకపోవడం మోసమే అవుతుందని దుయ్యబట్టారు. వలంటీర్లు తన తమ్ముళ్లు, అక్క చెల్లెళ్లు లాంటి వారని, వారి ఉద్యోగాలు తీయబోమని, వారికి ఇచ్చే వేతనం రూ.5 వేలకు ఇంకో రూ.5 వేలు కలిపి ఇచ్చే మనస్తత్వం తనది అంటూ ఎన్నికల సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటలు చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదని అన్నారు. వలంటీర్లను తక్షణమే విధుల్లోకి తీసుకొని ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా వినియోగించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పనిచేసిన 2.66 లక్షల మంది వలంటీర్లు ఆందోళన చేస్తారని, అసెంబ్లీని కూడా ముట్టడిస్తారని హెచ్చరించారు.


