కైరో: ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో 12వ పతకం చేరింది. శుక్రవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ షూటర్ ఇషా సింగ్ కాంస్య పతకాన్ని సాధించింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో ఇషా సింగ్ 30 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని అందుకుంది.
ఫైనల్లో పోటీపడ్డ భారత్‌కే చెందిన స్టార్ షూటర్ మనూ భాకర్ 23 పాయింట్లతో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. అంతకుముందు 85 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో ఇషా సింగ్ 587 పాయింట్లతో ఐదో స్థానంలో, మనూ భాకర్ 586 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. ఏడో రోజు పోటీలు ముగిశాక భారత్ 3 స్వర్ణాలు, 5 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి 12 పతకాలతో మూడో స్థానంలో ఉంది.


