నాన్న దిద్దిన చాంపియన్‌ | Pistol shooter Samrat Rana aiming for medals | Sakshi
Sakshi News home page

నాన్న దిద్దిన చాంపియన్‌

Nov 13 2025 4:12 AM | Updated on Nov 13 2025 4:12 AM

Pistol shooter Samrat Rana aiming for medals

పతకాలపై గురిపెడుతున్న పిస్టల్‌ షూటర్‌ సామ్రాట్‌ రాణా

ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు, రజతం సొంతం

తండ్రి పాఠాలు... తనయుడి పతకాలు

షూటర్‌ అంటే రోటీన్‌ అథ్లెట్‌ కాదు. సొంతంగా నేర్చుకోలేడు. సహచరులతో కలసి ఆడితే వచ్చేది కాదు. బూట్లు లేకపోయినా స్ప్రింటర్‌గా మారొచ్చు. బ్యాట్‌ లేకపోయినా చెక్కతో క్రికెటర్‌ కావొచ్చు. అసలేమీ లేకపోయినా కండబలంతో రెజ్లర్‌గా పట్టు పట్టొచ్చు. గుండెబలంతో కొలనులో చాంపియన్‌ స్విమ్మర్‌గా ఎదగొచ్చు. 

కానీ... ఓ పిస్టల్, తుపాకీ, గన్‌ లేకుండా ఎవరైనా షూటర్‌ అవుతారా? ముమ్మాటికి కాడు. గన్‌ కావాలి. ఓ స్థాయి షూటింగ్‌ రేంజ్‌ కాకపోయినా సాధారణ ఆకాడమీ, ఓ కోచ్‌ అవసరం. కానీ కోచ్, అకాడమీ లేకుండా నాన్న ఇచ్చిన పిస్టల్, నాన్న నేర్పిన పాఠాలతోనే సామ్రాట్‌ రాణా చరిత్రకెక్కే చాంపియన్‌ అయ్యాడు. –సాక్షి క్రీడా విభాగం

మన సామ్రాట్‌ రాణా మామూలోడు కాదు. చేనులో మొలిచిన చాంపియన్‌. తన తండ్రి అశోక్‌ కుమార్‌ రాణాకు షూటింగ్‌ అంటే ఉన్న పిచ్చి, వ్యామోహం వల్లే తనయుడు ప్రపంచ చాంపియన్‌ అయ్యాడు. 35 ఏళ్ల క్రితం అశోక్‌ ఆటగా మొదలుపెట్టిన షూటింగ్‌... ఆ ఆటలో అతన్ని మొనగాణ్ని చేయలేకపోయింది. 1990 దశకంలో హరియాణాలోని కర్నాల్‌ ప్రాంతంలో అశోక్‌ వాళ్లది మోతుబరి కుటుంబమే! కానీ తనకు ఇష్టమైన షూటింగ్‌పై ఎదగొచ్చు, రాణించొచ్చు అని అంతంత మాత్రమే తెలుసు. అందుకే గురిపెట్టగలిగాడు. 

కానీ పతకం పట్టుకొచ్చే షూటర్‌ కాలేకపోయాడు. అయితేనేం తను సొంతంగా నేర్చుకున్న షూటింగ్‌ తనయుడు సామ్రాట్‌ రాణాకు కోచ్‌గా అయ్యేందుకు బాగా ఉపయోగపడింది. ఎంతలా ఉపయోగపడిందంటే ఓ షూటింగ్‌ రేంజ్‌ కానీ వ్యవసాయ క్షేత్రంలో... ఆధునిక వసతుల్లేకపోయినా... తనయుడిని ప్రపంచ చాంపియన్‌ షూటర్‌గా మలిచేంతలా తండ్రి అశోక్‌  ప్రావీణ్యం సామ్రాట్‌ను పంట చేనులో ప్రపంచ చాంపియన్‌గా తయారు చేసింది. 

ఈజిప్ట్‌ రాజధాని కైరోలో జరుగుతున్న ప్రపంచ చాంపియన్‌ షిప్‌లో సామ్రాట్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత ఈవెంట్‌లో స్వర్ణం... వరుణ్‌ తోమర్, శ్రవణ్‌ కుమార్‌లతో కలిసి టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణం... ఇషా సింగ్‌తో కలిసి మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో రజతం సాధించి భారత్‌ షూటింగ్‌ భవిష్యత్‌ తారగా మెరిశాడు. 

ఇంట నేర్పించి... రచ్చ గెలిపించి... 
తండ్రి ఇంటి నుంచే రచ్చ గెలిచే చాంపియన్‌గా సామ్రాట్‌ను తీర్చిదిద్దిన వైనం అద్భుతం. పలక బలపం పట్టి అక్షరాలు దిద్దించినట్లే ఓ తుపాకీ ఇచ్చి గురి నేరి్పంచాడు నాన్న. అందుకే అతని షూటింగ్‌ ప్రయాణంలో అతనికెప్పుడూ రాళ్లు రప్పలు, ఎత్తుపల్లాలు అన్నవే లేకుండా హైవే రోడ్డుపై హై ఎండ్‌ కారుతో సాగినట్లుగా సాఫీగా సాగిపోయింది. కైరోకు తీసుకెళ్లి సరికొత్త చరిత్రను లిఖించేలా చేసింది. 

సామ్రాట్‌ నాన్న అశోక్‌ రాణా తనకున్న వ్యవసాయ క్షేత్రంలో 2017లో ఓ షూటింగ్‌ రేంజ్‌ను ఏర్పాటు చేశాడు. అప్పుడతని కుమారుడి వయసు పన్నేండేళ్లే. అలా చిన్న వయసులో తండ్రి సిద్ధం చేసిన షూటింగ్‌ బరిలో లక్ష్యంపై గురిపెట్టిన తనయుడు తర్వాత్తర్వాత జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పతకాలపై పెడుతున్నాడు. 

దీనిపై అశోక్‌ ఏమన్నాడంటే ‘మొదట్లో నేను 10 మీటర్ల దూరంతో ఒక చెక్క పెట్టెతో కాగితపు లక్ష్యాన్ని పెట్టేవాణ్ని. 12 ఏళ్ల తనయుడికి ఎయిర్‌ పిస్టల్‌ ఇచ్చి గురిచూసి కాల్చమని చెప్పేవాణ్ని. తూటా లక్ష్యాన్ని చేరిందా లేదా అని తెలుసుకునేందుకు కెమెరాను కూడా అమర్చాను. అలా షూటింగ్‌లో నా కుమారుడికి ఓనమాలు నేర్పించాను’ అని తన తొలినాళ్ల శిక్షణ గురించి వివరించారు. 

పోటీల కోసం అకాడమీకి... 
అశోక్‌ తన తనయుడికి నేరి్పంచిన షూటింగ్‌ గురి పెట్టేందుకు ఉపకరించాయి. ప్రతిభగల షూటర్‌కు ఉండాల్సిన లక్షణాల్ని అబ్బేలా చేశాయి. ఈవెంట్లు, పతకాల విభాగాలు కూడా తెలుసుకోవాలి. పోటీలకు దీటుగా సానబెట్టాలి. అందుకే తను తెలుసుకోలేకపోయినా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీలు, షూటింగ్‌ క్రీడాంశాలు కూడా ఔపోసన పట్టేందుకు స్థానికంగా ఉండే షూటింగ్‌ అకాడమీలో సామ్రాట్‌ను చేర్పించాడు.

అక్కడ కోచ్‌ల శిక్షణలో రాటుదేలిన సామ్రాట్‌ ఇంటికొస్తే చేనులో ప్రాక్టీసు చేసేవాడు. పోటీల వివరాలు, విధి విధానాలు, అర్హతలు తెలుసుకున్న సామ్రాట్‌ ఇక వెనుదిరిగే అవసరమే లేకుండా ముందడుగు వేశాడు. రెండు, మూడేళ్లకే పోటీల్లో పాల్గొనే షూటర్‌గా ఎదిగాడు. 17 ఏళ్ల వయసులో జాతీయ స్థాయిలో పోటీపడ్డాడు. అలా క్రమం తప్పకుండా పోటీల్లో గురిపెట్టిన అతని పిస్టల్‌ ఇప్పుడు ప్రపంచ వేదికలపై పతకాలపై గురిపెడుతోంది.  

క్షేత్రం నుంచి చరిత్రకెక్కాడు 
అలా ఓ క్షేత్రంలో (ఫలాన రేంజ్, అకాడమీ కాకుండా) మొదలైన సామ్రాట్‌ షూటింగ్‌ ప్రస్థానం కైరోలో చరిత్రకెక్కేలా చేసింది. ప్రపంచ చాంపియన్‌ షిప్‌లో 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో స్వర్ణం నెగ్గిన తొలి భారతీయుడిగా ఘనతకెక్కించింది. ప్రపంచ మేటి షూటర్లనే మట్టికరిపించే చైనా షూటర్‌ హు కైని అదికూడా ఫైనల్లో కంగుతినిపించడం గొప్ప విశేషం. 

హు కై ఖాతాలో నాలుగు ప్రపంచకప్‌ టైటిళ్లు, ఆసియా చాంపియన్‌ షిప్‌ స్వర్ణాలు ఉన్నాయి. అలాంటి చాంపియన్‌ షూటర్‌ చివరకు భారత సామ్రాట్‌కు తలవంచాడు. అశోక్‌ తన చేనులో తీర్చిదిద్దిన చాంపియన్‌తో ఇప్పుడు షూటింగ్‌లో శిక్షణ పద్ధతులు సైతం కొత్త పుంతలు తొక్కుతాయేమో వేచి చూడాలి. 

ఎందుకంటే తనయుడు ఓనమాల దశలో అశోక్‌ అవలంభించిన పద్ధతులన్నీ కూడా భిన్నమైనవి. ఓ ప్రముఖ షూటింగ్‌ రేంజ్‌ నుంచో... లేదంటే ఓ అకాడమీ నుంచో కాపీ కొట్టినవి కావు. కొత్త ఆలోచించి, కొత్తగా గురి కుదిరేందుకు చేసిన అతని ప్రయత్నాలు ఇప్పుడు పతకాల రూపంలో సాఫల్యమయ్యాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement