
వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్
ఫోర్డె (నార్వె): భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో మెరిసింది. మహిళల 48 కేజీల విభాగంలో బరిలోకి దిగిన మీరా రెండో స్థానంలో నిలిచింది. 2017 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, 2022 టోర్నీలో రజతం నెగ్గిన మీరాబాయి... ఇప్పుడు మూడో పతకం ఖాతాలో వేసుకుంది. నార్వే వేదికగా జరిగిన పోటీల్లో మీరాబాయి 199 కేజీల (స్నాచ్‌లో 84 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్‌లో 115 కేజీలు) బరువెత్తి రజతం కైవసం చేసుకుంది.
ఉత్తర కొరియాకు చెందిన రి సాంగ్ గుమ్ 213 కేజీల (స్నాచ్‌లో 91 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్‌లో 122 కేజీలు) బరువెత్తి ప్రపంచ రికార్డు నెలకొల్పడంతో పాటు పసిడి పతకం గెలుచుకుంది. థాయ్‌లాండ్‌కు చెందిన థాన్‌యాథోన్ సుక్‌చరోన్ 198 కేజీల (స్నాచ్‌లో 88 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్‌లో 110 కేజీలు)తో కాంస్య పతకం నెగ్గింది. స్నాచ్‌లో తొలి ప్రయత్నంలోనే 84 కేజీల బరువెత్తని చాను... ఆ తర్వాత రెండు ప్రయత్నాల్లో 87 కేజీల బరువెత్తడంలో విఫలమైంది.
మరోవైపు క్లీన్ అండ్ జెర్క్‌లో తొలుత 109 కేజీలు బరువెత్తిన మీరాబాయి... రెండో ప్రయత్నంలో 112 కేజీలు, మూడో ప్రయత్నంలో 115 కేజీల బరువెత్తింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో సైతం చాను క్లీన్ అండ్ జెర్క్‌లో 115 కేజీల బరువు ఎత్తే రజత పతకం గెలుచుకుంది. ‘పతకం సాధించడం ఆనందంగా ఉంది. ఈ ప్రదర్శన నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ లక్ష్యంగా సాగుతున్నా. ఈ క్రమంలో పాల్గొనే ప్రతి టోర్నీ దానికి సన్నాహకమే.
త్వరలో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్‌లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయతి్నస్తా. పోటీపడ్డ ప్రతిసారీ కొత్తగా ఏదో ఒకటి నేర్చుకునేందుకు ప్రయత్నిస్తా. దేశానికి మరిన్ని పతకాలు అందించడమే నా ప్రధాన లక్ష్యం’ అని మీరాబాయి చెప్పింది. ఆమె కోచ్ విజయ్ శర్మ మాట్లాడుతూ... ఈ పతకం మీరాబాయి కఠోర సాధనకు ఫలితమని అన్నాడు.
‘ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 200 కేజీల మార్క్ అందుకోవాలని మీరా లక్ష్యంగా పెట్టుకుంది. దానికి ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయింది. రానున్న కాలంలో కామన్వెల్త్, ఆసియా గేమ్స్, ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో ఆమె తీవ్ర సాధన చేస్తోంది. తన బలం, ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేందుకు కష్టపడుతోంది’ అని అన్నాడు.