2025 పీఎన్7 గా నామకరణం
న్యూఢిల్లీ: భూమికి చంద్రుడు మాత్రమే శాశ్వత సహజ ఉపగ్రహం. అయితే దీనికి తోడుగా కొన్నాళ్లపాటు భూమిని చుట్టేస్తూ తాత్కాలిక చందమామ ఒకటి కొత్తగా వచ్చి చేరింది. దీనికి 2025 పీఎన్7 అని నామకరణం చేశారు. వాస్తవానికి ఇది సహజ ఉపగ్రహం కాదు. చిన్నపాటి గ్రహశకలం మాత్రమే. తన కక్షలో వెళ్తూ సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తోంది. అయితే గత 60 ఏళ్లుగా ఇది భూమికి సమీపంగా ఉంటూ సూర్యుడి చుట్టూతా తిరుగుతోంది. అయితే భూమి నుంచి చూసినప్పుడు ఇది మన భూమి చుట్టూతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అందుకే దీనిని ఖ్వాసీ మూన్‌గా పిలుస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హవాయిలోని పనోరమిక్ సర్వే టెలిస్కోప్,ర్యాపిడ్ రెస్పాన్స్ సిస్టమ్ సాయంతో దీని జాడను కనిపెట్టారు. భూమి చుట్టూ పరిభ్రమిస్తు్తన్న ‘అర్జున’ గ్రహశకలాల కూటమిలో ఇది కొత్తగా వచ్చి చేరిందని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. కేవలం 20 మీటర్ల వెడల్పున్న దీనిని ఈ ఏడాది ఆగస్ట్‌లో కనిపెట్టారు.
ఎనిమిది అంకె ఆకృతిలో లేదా గుర్రపు డెక్క ఆకృతిలో ఇది సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది. సూర్యుడు, భూమి గురుత్వాకర్షణ శక్తుల కారణంగా దీని పథం ఇలా విభిన్న ఆకృతిలో ఉంది. సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో ఇది ఒక దశలో భూమికి కేవలం 2,99,000 కిలోమీటర్ల దూరంలో సంచరిస్తుంది. మరో దశలో గరిష్టంగా 1.7 కోట్ల కిలోమీటర్ల దూరంలో కనిపిస్తుంది. సగటున ఇది 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గురుత్వాకర్షణ బలాలకు లోనై ఇది భూమిపై పడిపోయే అవకాశం లేదని తెలుస్తోంది. కొన్ని దశాబ్దాల తర్వాత భూమి నుంచి దూరంగా వెళ్లిపోనుంది.


