breaking news
Rapid Response Team
-
కోవిడ్ వైరస్‌పై ‘ర్యాపిడ్ రెస్పాన్స్’
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వైరస్‌పై సర్కారు యుద్ధం ప్రకటించింది. అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేయాలని శుక్రవారం నిర్ణయించింది. రాష్ట్రస్థాయి రెస్పాన్స్ టీమ్స్‌తో పాటు ప్రతి జిల్లాలోనూ ఈ టీంలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా కోవిడ్ పాజిటివ్ కేసుల కాంటాక్టులను గుర్తించడం కోసం 15 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటైంది. అలాగే ప్రతి జిల్లాలోనూ 15 మంది చొప్పున ఈ టీంలు పనిచేస్తాయి. ఒకవేళ ఏదైనా పాజిటివ్ కేసు నమోదైతే ఆ కేసుకు సంబంధించి గుర్తించాల్సిన బాధ్యత వారిదే. పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతంలో 3 కి.మీ. మేరకు మ్యాపింగ్ చేస్తారు. అక్కడంతా యాక్టివ్ నిఘా ఏర్పాటు చేస్తారు. అంటే పారిశుద్ధ్యంతో పాటు క్లోజ్డ్ కాంటాక్టులను గుర్తించడం, ప్రజల్లో అవగాహన కల్పించడం, ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకొని పనిచేస్తారు. గుంపుల్లో ఏమాత్రం తిరగొద్దు: జనసమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో కోవిడ్ వ్యాపించే అవకాశాలు ఎక్కువుండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం తాజాగా ఆదేశాలు జారీచేసింది. సభలు, సమావే శాలు జరగకుండా నిరోధించాలని అన్ని రాష్ట్రాలకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ ఆపలేని పరిస్థితి నెలకొంటే వాటిని వాయిదా వేయించాలని కోరింది. సభలు, సమావేశాలు, ర్యాలీల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సంబంధిత సంస్థలు, వ్యక్తులకు వివరించాలంది. అలాగే సినిమాలు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ఇతరత్రా గుంపులుండే ప్రాంతాలకు వెళ్లకుంటేనే మేలని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. వివిధ సంస్థల్లో హాజరు కోసం వేలిముద్రలతో బయోమెట్రిక్ నిర్వహిస్తున్నారు. కోవిడ్ కరచాలనంతో కూడా సోకే ప్రమాదం ఉండటంతో వెంటనే బయోమెట్రిక్‌ను నిలిపివేయాలని కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. కేంద్రం ఆదేశాలను రాష్ట్రంలో అమలు చేసే దిశగా సర్కారు ఉపక్రమించింది. వీటితోపాటు అంతర్జాతీయ విమాన ప్రయాణికులను స్క్రీనింగ్ చేయాలని నిర్ణయించిన కేంద్రం అథరైజ్డ్ ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టుల వద్ద వైద్య బృందాలను ఉంచింది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా 107 చెక్‌పోస్టులుంటే, వాటిలో కేవలం 71 చోట్లే వైద్య బృందాలున్నాయి. మిగిలిన చోట్ల స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలే వాటిని ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 104కు 210 కాల్స్.. కరోనాపై వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన ‘104’హెల్ప్‌లైన్‌కు విపరీతంగా కాల్స్ వస్తున్నాయి. అది ఏర్పాటైన 24 గంటల్లోనే 210 కాల్స్ వచ్చాయి. అందులో 185 మంది కరోనాకు సంబంధించిన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. మరో 25 మంది తమకు కోవిడ్ లక్షణాలున్నాయని తెలిపారు. అయితే ఆ లక్షణాలున్నాయని చెప్పిన వారిలో క్రాస్ చెక్ చేయగా ఆ లక్షణాలు లేవని, వారికి కనీసం ట్రావెలింగ్ హిస్టరీ కూడా లేదని గుర్తించి వారికి ఎటువంటి పరీక్షలు నిర్వహించలేదు. హైదరాబాద్‌లో 40 కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ ఐసోలేషన్ వార్డులు ఏర్పాటవుతున్నాయి. ఆ ఆస్పత్రులన్నీ విధిగా తమ వివరాలను శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖకు తెలిపాయి. కాగా కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కేంద్రం ఆరా తీసింది. శుక్రవారం ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావుతో కేంద్ర బృందం సభ్యులు భేటీ అయ్యారు. కరోనా ఐసోలేషన్ వార్డుల వివరాలను సేకరించారు. అలాగే తీసుకుంటున్న చర్యలను ఆ బృందం తెలుసుకుంది. మరింత మెరుగవుతోంది.. కోవిడ్ బాధితుడు ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చేరిన మొదట్లో అతను చాలా కుంగిపోయి కనిపించాడు. మొదట్లో అతని ఊపరితిత్తుల్లో మూడో వంతు వరకు న్యుమోనియా ఆవరించి ఉంది. ఇప్పుడు అతని ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగవుతోంది. కొందరు వైద్యాధికారులు, కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతున్నాడు. అతను ఒక కుటుంబ సభ్యునితో ఫోన్లో మాట్లాడుతుండగా ‘సాక్షి’అతని మాటలను ఆలకించింది. అతనేమన్నాడంటే, ‘నా ఆరోగ్యం చాలా వరకు మెరుగ్గా ఉంది. అమ్మా నాన్నల ఆరోగ్యం కూడా బాగుంది. ఇంటి నుంచే భోజనం వస్తుంది. ఆసుపత్రిలో చిన్న చిన్న సమస్యలున్నా ఇబ్బంది పడే పరిస్థితి లేదు. డాక్టర్లు మంచిగా చికిత్స చేస్తున్నారు. ఇప్పుడు నాకు తగ్గుతుందన్న విశ్వాసముంది’అని బాధితుడు వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే తన ఫొటోలను కొందరు తీయడానికి ప్రయత్నిస్తున్నారని అతను ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మరింత విశ్వసనీయత పెంచాలి గాంధీఆస్పత్రి: కోవిడ్‌పై భయాందోళనలు తొలగించి అందిస్తున్న వైద్య సేవలపై ప్రజల్లో మరింత విశ్వసనీయత పెంచేందుకు కృషి చేయాలని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గాంధీ ఆస్పత్రిని శుక్రవారం రాత్రి వైద్య ఉన్నతాధికారులతో కలసి మంత్రి సందర్శించారు. కోవిడ్ ఐసోలేషన్, వీఐపీ వార్డులను, అత్యవసర విభాగంలోని ఎక్యూట్ ఐసీయూను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కోవిడ్ పాజిటివ్ వ్యక్తికి అందిస్తున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. పర్సనల్ ఎక్విప్మెంట్ ప్రొటెక్షన్ దుస్తులు ధరించి ఐసీయూలోకి వెళ్లారు. అద్దంలోంచి కోవిడ్ పాజిటివ్ వ్యక్తిని చూసుకుంటూ ఐదు నిమిషాల పాటు ఫోన్ ద్వారా సంభాషించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ పాజిటివ్ వ్యక్తి కోలుకుంటున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ రమేష్‌రెడ్డి, డీహెచ్ శ్రీనివాసరావు, గాంధీ ఇంచార్జీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు, ఫల్మనాలజీ వైద్యులు కృష్ణమూర్తి, ప్రమోద్, ఆర్‌ఎంఓలు శేషాద్రి, నరోత్తం, గోపాల్లతోపాటు పలువురు వైద్యులు, వైద్యవిద్యార్థులు పాల్గొన్నారు. -
వలసల్ని దాచేస్తాం!
ట్రంప్ ముప్పు నుంచి అక్రమ వలసదారులకు అమెరికన్ల అభయం ► దేశవ్యాప్తంగా ప్రతిఘటన.. ‘ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్’ ఆవిర్భావం ► వివిధ మత సంస్థలు, స్వచ్ఛంద కార్యకర్తలతో కొత్త ‘నెట్వర్క్’ అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌కు అమెరికన్లనుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఆయన విధానాలను వ్యతిరేకిస్తూ ఉధృతంగా సాగుతున్న ఈ ప్రతిఘటన (రెసిస్టెన్స్ ) ఉద్యమం ఇప్పుడు.. తమ దేశంలో సరైన పత్రాలు లేకుండా వలసదారులుగా ఉంటున్నవారికి అండగా నిలుస్తోంది. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న విదేశీయులను బలవంతంగా వారి దేశాలకు పంపించాలనుకుంటున్న ట్రంప్ సర్కారు చర్యలను ‘ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్’ వ్యూహాత్మకంగా అడ్డుకుంటోంది. వివిధ మత సంస్థలు, స్వచ్ఛంద కార్యకర్తలతో ఏర్పాౖటెన ఈ టీమ్‌లో మూవ్ఆన్ .ఆర్గ్, ద ఇన్ జిబుల్ గైడ్, రెసిస్టెన్స్ క్యాలెండర్ వంటి చాలా సంస్థలు భాగమయ్యాయి. అమెరికా వ్యాప్తంగా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్మెంట్ (ఐసీఈ) దాడులు మొదలయ్యాయి. అమెరికాకు చాలా ఏళ్లక్రితం వలసవచ్చి అక్కడే జీవితం గడుపుతున్న వారిలో సరైన పత్రాలు లేని వారిని గుర్తించి.. బలవంతంగా వారి దేశాలకు తిప్పిపంపటం ఈ దాడుల లక్ష్యం. ఈ క్రమంలో చాలా మంది తమ కుటుంబాలకు, తమ పిల్లలకు దూరమవ్వాల్సిన దుస్థితి తలెత్తుతోంది. భార్యాభర్తలు విడిపోవాల్సిన పరిస్థితులూ దాపురిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇమిగ్రేషన్ అధికారుల కంటపడకుండా వలసదారులను రక్షించే మార్గాలను ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ రచిస్తోంది. ప్రైవేటు ఇళ్లలో ఆశ్రయం సొంత దేశాల్లో హింసను తప్పించుకోవడానికి అమెరికాకు వచ్చిన వారికి (1980ల్లో) చాలా మత సంస్థలు ఆశ్రయం కల్పించాయి. ఆ తర్వాత మార్చిన చట్టాల ప్రకారం చర్చిలు, ఇతర మతస్థుల ప్రార్థనా మందిరాల్లోనూ పోలీసులు సోదాలు చేయొచ్చు. కానీ 2011లో హోంశాఖ పాఠశాలలు, మత సంస్థలకు సోదాలనుంచి మినహాయింపునిచ్చింది. కానీ ఇప్పుడు ట్రంప్ ఈ ఆదేశాలకు కట్టుబడి ఉండకపోవచ్చనే అనుమానాలు పెరుగుతున్నాయి. దీంతో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ సరికొత్త ఆలోచనలపై దృష్టిపెట్టింది. ప్రైవేటు ఇళ్లలో ఈ వలసదారులకు ఆశ్రయం కల్పించేందుకు నడుంబిగించింది. వలసదారులు దాక్కునేందుకు వీలుగా కొత్త ఇళ్లు కొనడం, తమ సొంత ఇళ్ల మీద అంతస్తులు నిర్మించడం ఈ ప్రణాళికలో భాగం. ఎందుకంటే.. ప్రయివేటు ఇళ్లలోకి ప్రవేశించాలన్నా, సోదాలు చేయాలన్నా ఐసీఈ లేదా పోలీసులకు వారెంట్లు అవసరం. ఆ వారెంట్లు తెచ్చుకునేలోగా ఇంట్లో తలదాచుకున్న వారిని వేరో చోటుకు తరలించొచ్చు. కానీ, వలసలకు ఆశ్రయం ఇచ్చినట్లు అధికారులు గుర్తిస్తే.. ఇంటి యజమానులు న్యాయపరంగా భారీ జరిమానా, కఠినమైన జైలుశిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే వీటికి భయపడేది లేదని లాస్ ఏంజిలస్కు చెందిన పాస్టర్ ఆదా వాలియెంటి పేర్కొన్నారు. బలవంతంగా తిప్పిపంపించడం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితిలో ఉన్న వారికి ఆశ్రయం ఇవ్వటం వీరి ప్రాధాన్యత. సరైన పత్రాలు లేని వలసలదారులకు ఆశ్రయం కల్పించటంతోపాటు.. వీరిని అధికారులు బలవంతంగా తిప్పిపంపే ప్రయత్నం చేస్తే.. ఉచితంగా న్యాయ సలహాలివ్వటం, ఇంటర్వూ్యలకు తోడుగా వెళ్లటం ‘ర్యాపిడ్ రెస్పాన్స్ టీం’ పని. ఒక వలస తల్లి కథ! జీనెట్ విజ్గ్వెరా సరైన ధృవీకరణ పత్రాలు లేని వలసదారు. కొలరాడో రాష్ట్రంలోని డెన్వర్‌లో నివసిస్తున్నారు. 1997లో మెక్సికో నుంచి భర్త, పెద్దకూతురు తానియాతో కలిసి వలసవచ్చారు. అనంతరం వీరికి ముగ్గురు పిల్లలు పుట్టారు. పిల్లలు ముగ్గురూ అమెరికాలోనే పుట్టడంతో వారికి జన్మతః అమెరికా పౌరసత్వం ఉంది. వలసదారుల పిల్లలపై అమెరికా చట్టాల ప్రకారం పెద్ద కూతురుకు వచ్చిన సమస్యేమీ లేదు. వచ్చిన ఇబ్బందల్లా జీనెట్కే. 12 ఏళ్లవరకు ఇబ్బందులు లేకుండా హోటళ్లలో, స్థానిక ఇళ్లలో చిన్నా చితకా పనులు చేస్తూ జీవించిన జీనెట్.. అక్రమ వలసదారు అన్న విషయం 2009లో అధికార యంత్రాంగానికి తెలిసింది. దీంతో ఆమెను పంపించేందుకు అధికారులు ప్రయత్నించగా.. కొలరాడో వలసదారుల సంఘం ఒత్తిడి, రాజకీయ లాబీయింగ్ కారణంగా ఈమెను మెక్సికోకు పంపటంపై స్టే లభించింది. అయితే ఈ స్టే (నిలుపుదల ఉత్తర్వుల)కు ఫిబ్రవరి రెండో వారంతో గడువు తీరిపోయింది. దీంతో ఆమె అమెరికాలో ఉండేందుకు దారులన్నీ మూసుకుపోయాయి. అంతకుముందు వారంలో మరొక తల్లి గ్వాడాలూప్ గార్సియాను కూడా ఇలాగే నిర్బంధించి బలవంతంగా ఆమె స్వదేశానికి తిప్పిపంపించేశారు. దీంతో జీనెట్, ఆమె పిల్లలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఆమె కొలరాడో చర్చిలో ఆశ్రయం పొందుతున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్