‘కర్నూలు’తరహా వాహన అగ్నిప్రమాదాల్లో ఇవే ఆధారం
సీటు నంబర్ నుంచి సూపర్ ఇంపొసిషన్ వరకు ఎన్నో ప్రక్రియలు
పలు కేసుల్లో డీఎన్‌ఏ పరీక్షలే అత్యంత కీలకం
సాక్షి, హైదరాబాద్: మొన్న మహబూబ్‌నగర్ సమీపంలోని పాలెం... నిన్న కర్ణాటకలోని కలబురిగి ప్రాంతం... తాజాగా కర్నూలు సమీపంలోని చిన్న టేకూరు... ఇలా అనేక సందర్భాల్లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సులు అగ్నిప్రమాదాలకు లోనవుతున్నాయి. ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదాల్లో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మాడిమసైపోతున్నాయి. ఆయా సందర్భాల్లో మృతులను గుర్తించడానికి పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు ప్రధానంగా ఆరు రకాల పద్ధతుల్ని అనుసరిస్తుంటారు.
1. సీటు నంబర్
ఇది ప్రాథమిక అంశం. మృతదేహం పడి ఉన్న సీటు నంబర్‌ను బస్సు బయలుదేరే ముందు రూపొందించిన ప్రయాణికుల జాబితాతో సరిచూస్తారు. దీనిద్వారా ఆ సీటులో ఎవరు కూర్చున్నారో తెలుస్తుంది. అయితే మార్గమధ్యలో సీట్లు మారే అవకాశం ఉండటంతోపాటు ప్రమాద ప్రభావం వల్ల మృతులు సీట్లలో ఉండకపోవచ్చు. దీంతో ఈ విధానాన్ని పూర్తి ప్రామాణికంగా తీసుకోరు.
2. ఆభరణాలు
మృతదేహాలను స్వా«దీనం చేసుకొనే సందర్భంలో పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహిస్తారు. అందులో మృతదేహాన్ని ఏ సీటు నుంచి స్వా«దీనం చేశారనే అంశంతోపాటు మృతదేహంపై ఒకవేళ నగలు, ఆభరణాలు ఉంటే ఆ వివరాలను పొందుపరుస్తారు. భద్రపరిచిన ఆభరణాలను సంబం«దీకులకు చూపి గుర్తుపట్టేందుకు ప్రయత్నిస్తారు.
3. దుస్తులు, వస్తువులు
ప్రయాణం ప్రారంభించే ముందు ఆయా ప్రయాణికులు ధరించిన దుస్తులు, వెంట తీసుకువెళ్తున్న వస్తువులు సైతం ఈ తరహా ప్రమాదాల్లో కీలక ఆధారాలుగా నిలుస్తాయి. మృతదేహంపై లభించే దుస్తులకు సంబంధించిన ఆనవాళ్ల కోసం ప్రయతి్నస్తారు. ఒకవేళ ఫలితం లేకుంటే కాలిపోగా మిగిలిన సూట్‌కేసులు, బ్యాగులు, సెల్‌ఫోన్లు, లైటర్ల వంటివి సేకరిస్తారు. వాటిని కూడా పంచనామాలో పొందుపరిచి వాటి ఆధారంగానూ మృతుల్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తారు.
4. శరీరం, గాయాలు
ఎత్తు, ఒడ్డు, పొడుగు వంటి శరీరాకృతులను, ఎముకల ద్వారా తెలుసుకోవడంతోపాటు గాయాలు, అంగవైకల్యాలు తదితరాలు సైతం మృతదేహాల గుర్తింపునకు ఉపకరిస్తాయి. కుటుంబీకుల నుంచి చనిపోయిన వ్యక్తి వైద్య చరిత్రతోపాటు దంతాల వివరాలను సేకరించి వాటిని మృతదేహాలతో పోలి్చచూస్తారు. గతంలో ఆపరేషన్లు జరిగినా, కాళ్లు–చేతులు తదితరాలు విరిగాయా? తదితర వివరాలన్నింటితోనూ మృతుల్ని గుర్తించే ప్రయత్నం జరుగుతుంది.
5. బ్లడ్, డీఎన్‌ఏ
మృతదేహం పూర్తిగా కాలిపోయినా అంతర్గత అవయవాల్లో కొంతవరకు రక్త నమూనాలు ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ అదీ సాధ్యం కానప్పుడు బోన్‌మ్యారోను సేకరించడం ద్వారా బ్లడ్‌గ్రూప్‌ను విశ్లేషిస్తారు. దీన్ని రక్త సంబం«దీకులతో సరిపోల్చి మృతుల్ని గుర్తిస్తారు. బ్లడ్ గ్రూపింగ్‌తోపాటు ఇతర విధానాలకు అవకాశం లేని సందర్భాల్లో డీఎన్ పరీక్షలే శరణ్యమవుతాయి. అత్యధిక కేసుల్లో వాటి ద్వారానే గుర్తింపు ప్రక్రియ పూర్తవుతుంది. మృతదేహంలోని అతిచిన్న ఆధారం నుంచైనా డీఎన్‌ఏ సేకరించే అవకాశం ఉండటం కలిసొచ్చే అంశం.
6. సూపర్ ఇంపొసిషన్
గుర్తించాల్సిన మృతదేహం ఫలానా వారిదనే అనుమానం ఉండి డీఎన్‌ఏ–బ్లడ్ శాంపిల్స్ సేకరించే అవకాశం లేనప్పుడే ఈ విధానాన్ని అనుసరిస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా ఘటనాస్థలిలో లభించిన పుర్రెను అత్యా«ధునిక పరికరాలతో విశ్లేషించి కంప్యూటర్ సాయంతో దానికి ముఖాకృతిని ఇస్తారు. దీన్ని అనుమానితుల ఫొటోలతో సరిపోల్చడం ద్వారా మృతులను గుర్తిస్తారు. ఇది అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది.


