హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. జూబ్లీహిల్స్ లో మొత్తం ఓటర్ల సంఖ్య- 4,01,365 ఉండగా, పురుషులు- 2,08,561, మహిళలు 1,92,779 మంది ఉన్నారన్నారు.
ఇతరులు 25 మంది మాత్రమే ఉన్నారన్నారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి వివరాలు వెల్లడించిన ఆర్వీ కర్ణన్.. ‘ ముగ్గురు అబ్జర్వర్స్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. బ్యాలెట్ యూనిట్ లో అభ్యర్థుల కలర్ ఫోటో ఉంటుంది. ఈసారి 4 బ్యాలెట్ యూనిట్లు, ఒక వీవీ ప్యాట్ ఉంటుంది.
ప్రతీ పోలింగ్ స్టేషన్ వద్ద ఓటర్ అసిస్టెంట్ బూత్ ఏర్పాటు చేస్తున్నాం. పోలింగ్ స్టేషన్ వద్ద మొబైల్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ మొబైల్ డిపాజిట్ చేసి పోలింగ్ స్టేషన్‌కి వెళ్లాలి. పోలింగ్ స్టేషన్ లోపలికి ఓటర్లకు, ఏజెంట్లకు మొబైల్ అనుమతి లేదు’ అని తెలిపారు.
2 కోట్ల 83 లక్షల రూపాయల నగదు పట్టుకున్నాం
ఇప్పటివరకు 2 కోట్ల 83 లక్షల రూపాయల నగదు పట్టుకున్నామన్నారు పోలీస్ అడిషనల్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ స్పష్టం చేశారు. ‘ టీమ్స్ నియోజకవర్గంలో తిరుగుతున్నాయి. ఇప్పటివరకు 2 కోట్ల 83 లక్షల నగదు పట్టుకున్నాం. 512 లీటర్ల మద్యం సీజ్ చేశాం.
ఎలెక్షన్ కోడ్ ఉల్లంఘించిన వారిపై 11 కేసులు నమోదు చేశాం. సోషల్ మీడియా ప్రచారం పై నిఘా పెట్టాం. ఈవీఎంలు సరిపడా ఉన్నాయి. 20 శాతం ఈవీఎంల ఎక్స్‌ట్రా ఉన్నాయి. ఓటర్ స్లిప్పులు స్థానిక బూత్ లెవెల్ ఆఫీసర్లు ఓటర్లకు పంచుతారు. పొలిటికల్ పార్టీల వారు ఓటర్ స్లిప్పులు పంచితే కేసులు నమోదు చేస్తాం. ఈనెల 27న పారా మిలిటరీ బలగాలు వస్తున్నాయి. 8 కంపెనీల పారా మిలిటరీ బలగాలు నియోజకవర్గంలో పని చేస్తాయి. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో పారా మిలిటరీ బలగాలు విధుల్లో ఉంటాయి. 65 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి’ అని తెలిపారు.


