పొల్యూషన్ కంట్రోల్ తప్పుతోంది
నగరంలో మూడేళ్ల గరిష్టానికి వాయు కాలుష్యం
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వాయు కాలుష్యం ప్రమాదఘంటికలు మోగిస్తోంది. వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) గత మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా దిగజారుతోంది. ఈ ఏడాది 12 శాతం వాయు కాలుష్యం పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. పీఎం 10, పీఎం 2.5 ధూళి కణాల సంఖ్య నగరంలోని ఏ ప్రాంతంలో చూసినా కనీసం 150 నుంచి 265 మధ్య కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ గాలి పీల్చడం వల్ల రోజుకు 4.4 సిగరెట్లు కాల్చినంత ప్రమాదకరమని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు సంతాన సమస్యలకు కారణమవుతోందని పేర్కొంటున్నారు.
విమర్శల పాలవుతున్న పీసీబీ..
నగరంలో వాయు కాలుష్య నివారణకు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్‌సీఏపీ)లో భాగంగా 2019 జనవరిలో రూ.614 కోట్లు మంజూరయ్యాయి. 2017తో పోల్చితే 2026 నాటికి గాలిలో పీఎం 10 ధూళి కణాలు కనీసం 40 శాతం తగ్గించాలన్నది ఈ పథకం లక్ష్యం. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) రూ.561 కోట్ల నిధులు ఖర్చు చేసినా సాధించిన పురోగతి మాత్రం శూన్యంగా కనిపిస్తోంది. 2020లో నగర వాయు నాణ్యత సూచీ 100 (ఏక్యూఐ) ఉండగా 2025లో ఏక్యూఐ 100గానే నమోదు కావడం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది డిసెంబర్ నెల ఏక్యూఐ 178గా నమోదైంది. గతంలో 2021 డిసెంబరులో 155గా నమోదు కావడమే గరిష్టంగా ఉండేది. ఆ రికార్డులను చెరిపేస్తూ వాయు వేగంతో గాలి కాలుష్యం దూసుకెళుతోంది. దీంతో రూ.వందల కోట్ల నిధులు వృథాగా గాలిలో కలిపేసినట్లైందన్న విమర్శలను పీసీబీ మూటగట్టుకుంటోంది.
● కాలుష్య నియంత్రణ మండలి గాలి నాణ్యత లెక్కలకు రహదారిపై వెళ్లే మోటారు సైకిల్, ఆటో, బస్సు ప్రయాణికులు, నడిచి వెళ్లే వ్యక్తులు పీల్చిన గాలిలో ఉన్న ధూళి కణాల (పీఎం 2.5, పీఎం10) లెక్కలకు పొంతన లేకుండా పోతోంది. అధికారులు రహదారికి కొంత దూరంలో యంత్ర పరికరాలు అమర్చుతున్నారు. దీంతో రహదారిపై ప్రయాణించే సగటు ప్రయాణికుడు పీల్చే గాలి నాణ్యతకు కొలమానం లేకుండా పోయింది. రహదారిపై వాహనాలు రాకపోకలు సాగించే క్రమంలో గాలిలో ఎగిరిన ధూళి కణాలు పీసీబీ అమర్చిన సీఏఏక్యూఎంఎస్ వరకు వెళ్లేసరికి వాటి సాంద్రత గణనీయంగా తగ్గిపోతోంది. రహదారి పక్కనే వాయు నాణ్యత కొలిచే పరికరాలు అమర్చినట్లైతే భయంకరమైన గణాంకాలు వెలుగు చూస్తాయని పర్యావరణ ప్రేమికులు పేర్కొంటున్నారు. పీసీబీ అధికారులు మాత్రం పరిసర ప్రాంతాల వాయు నాణ్యతను కొలవడానికి ఇలా ప్రశాంతమైన ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్నామని సమర్థిచుకుంటున్నారు. అయితే.. కొన్ని కేంద్రాల్లో పీఎం 10, మరికొన్ని కేంద్రాల్లో పీఎం 2.5 గణాంకాలు నమోదు కావడం లేదు.
కొన్ని ప్రాంతాలకే పరిమితం..
నగరంలో పీసీబీకి 14 ప్రాంతాల్లోనే వాయు నాణ్యత కొలిచే వ్యవస్థ ఉంది. మిగతా చోట్ల పరిస్థితి ఎలా ఉన్నా అది లెక్కలోకి రావడంలేదు. పెరుగుతున్న జనాభాతో పాటు వాహనాల సంఖ్య, నిర్మాణ రంగం గణనీయంగా వృద్ధి చెందుతోంది. సికింద్రాబాద్– మెహిదీపట్నం ఇన్నర్ రింగ్ రోడ్డు, ఎల్‌బీ నగర్ –విజయవాడ, ఉప్పల్– వరంగల్, హైదరాబాద్– బీజాపూర్, ఇతర జాతీయ రహదారులపై గాలి నాణ్యత కొలిచే పరిస్థితి కనిపించడం లేదు. మణికొండ, బండ్లగూడ జాగీర్, మాదాపూర్, గచ్చిబౌలి, ఎల్‌బీనగర్, ఉప్పల్, కూకట్‌పల్లి, మియాపూర్ ఇతర ప్రాంతాల్లో నిర్మాణ రంగం జోరుగా ఉన్న ప్రాంతాల్లో వాయు కాలుష్యం అధికంగా ఉంటోంది. ఆయా ప్రాంతాల్లో గాలి నాణ్యత కొలిచే పరిస్థితి కనిపించడం లేదు.
రూ.వందల కోట్లు కరుగుతున్నా ఫలితం శూన్యం
ప్రమాదకర స్థితిలో గాలి నాణ్యత సూచీ
ఈ ఏడాది 12 శాతం పెరుగుదల నమోదు
రూ.561 కోట్లు ఖర్చు చేసినా లక్ష్యసాధనలో వెనకబాటే..
సంవత్సరాల వారీగా వాయు నాణ్యత సూచీ ఇలా..
సంవత్సరం ఏక్యూఐ
2020 100
2021 105
2022 104
2023 95
2024 89
2025 100
నగరంలో ప్రాంతాలవారీగా ఇటీవల నమోదైన కాలుష్య వివరాలు
ప్రాంతం పీఎం 2.5 పీఎం 10
మలక్‌పేట్ 264 135
బొల్లారం 190 154
పటాన్‌చెరు 187 155
సనత్‌నగర్ 185 –––
నాచారం 185 –––
సోమాజిగూడ 170 150
జూపార్క్ 157 153


