హెచ్‌ఎండీఏ డీలా..
జీహెచ్‌ఎంసీ విస్తరణతో ప్రతిష్టంభన
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ విస్తరణతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటి వరకు ఐదంతస్తుల కంటే ఎక్కువ ఎత్తు నిర్మించే భవనాలు, హైరైజ్ బిల్డింగ్‌లు, అపార్ట్‌మెంట్‌లు, భారీ వెంచర్‌లు తదితర నిర్మాణరంగ అనుమతులన్నీ హెచ్‌ఎండీఏ నుంచే అందజేస్తున్నారు. త్వరలో ఈ అధికారాలన్నీ జీహెచ్‌ఎంసీకి బదిలీ కానున్నాయి. దీంతో హెచ్‌ఎండీఏ ఆదాయం భారీగా పడిపోనుంది. అధికారులు, ఉద్యోగులకు చెల్లించే జీతభత్యాలు సహా హెచ్‌ఎండీఏ చేపట్టే వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు నిర్మాణ రంగానికి ఇచ్చే అనుమతులపైనే హెచ్‌ఎండీఏకు ప్రతి ఏటా దాదాపు రూ.1200 కోట్లకు పైగా ఆదాయం లభిస్తోంది. కొన్ని సందర్భాల్లో రూ.1500 కోట్లకు పైగా కూడా లభించింది. ఇలా ఫీజుల రూపంలో వచ్చే ఆదాయంతోనే ఉద్యోగుల జీతభత్యాలతో పాటు పార్కులు, రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఫ్లైఓవర్‌ల నిర్మాణం వంటి కార్యక్రమాలను చేపట్టారు. ప్రస్తుతం ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి రీజినల్‌రింగ్ రోడ్డు వరకు చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్లతో పాటు, ప్యారడైజ్ నుంచి డెయిరీఫామ్ వరకు, సికింద్రాబాద్ నుంచి శామీర్‌పేట్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్‌లను సైతం హెచ్‌ఎండీఏ సొంతంగానే చేపట్టింది. ఈ ప్రాజెక్టులకన్నింటికీ నిధుల కొరత తలెత్తే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
రియల్ భూమ్ అంతా అక్కడే..
విస్తరణ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధి 650 చ.కి.మీ. నుంచి సుమారు 2000 చ.కి.మీ.లకు పైగా పెరగనుంది. దీంతో ఇప్పటి వరకు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న శంకర్‌పల్లి, శంషాబాద్, మేడ్చల్, ఘట్కేసర్ తదితర జోన్‌లలోని కీలకమైన ప్రాంతాలన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వెళ్తాయి. రియల్ ఎస్టేట్ వర్గాలు, నిర్మాణరంగ సంస్థలు మొదలుకొని సామాన్య, మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజలు జీహెచ్‌ఎంసీ నుంచే అన్ని రకాల అనుమతులు పొందవచ్చు, మరోవైపు ఉప్పల్ భగాయత్, మేడిపల్లి, బాచుపల్లి, హయత్‌నగర్, తొర్రూరు తదితర ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ సొంత భూముల్లో వేసిన లేఅవుట్‌లకు సైతం భారీ స్పందన లభించింది. ఇలా అన్ని విధాలుగా వచ్చిన ఆదాయ మార్గాలన్నీ హెచ్‌ఎండీఏ నుంచి జీహెచ్‌ఎంసీకి మారనున్నాయి.
జీత భత్యాలు కష్టమే..
‘హెచ్‌ఎండీఏలోని వివిధ విభాగాల్లో పని చేసే అధికారులు, ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ప్రతి నెలా సుమారు రూ.70 కోట్లకు పైగా జీతభత్యాలు, ఇతర ఖర్చుల చెల్లింపులకే వెచ్చించాల్సి ఉంటుంది. ఇప్పుడు 90 శాతానికి పైగా జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వెళ్లడంతో జీతభత్యాల చెల్లింపు ఒక సవాల్‌గా మారనుంది’అని ఒక అధికారి విస్మయం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధికి వెలుపల అంటే సుమారు 2000 చ.కి.మీ దాటిన తర్వాత చేపట్టే నిర్మాణాలు మాత్రమే హెచ్‌ఎండీఏ పరిధిలోకి వస్తాయి. ఆ దిశగా నిర్మాణరంగం విస్తరించేందుకు మరో 5 నుంచి 10 ఏళ్లు పట్టవచ్చు’ అని ఆయన వివరించారు.
హెచ్‌ఎండీఏ వద్దనే డెలిగేషన్ పవర్స్..
జీహెచ్‌ఎంసీ విస్తరణ, డివిజన్‌ల ఏర్పాటు వంటి కార్యక్రమాలు ఒక వైపు వేగంగా కొనసాగుతున్నాయి. కానీ నిర్మాణ అనుమతులు, అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించిన డెలిగేషన్ పవర్స్ మాత్రం ఇంకా హెచ్‌ఎండీఏ నుంచి జీహెచ్‌ఎంసీకి బదిలీ కాలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన హెచ్‌ఎండీఏ కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగిన తర్వాతనే అధికారాల బదిలీ జరగనుందని అధికారులు తెలిపారు.
వార్డుల సంఖ్య పెరగడంతో భారీగా పడిపోనున్న ఆదాయం
నిర్మాణ అనుమతులపై ఏటా రూ.1200 కోట్లు
ఈ రాబడికి సైతం గండిపడే అవకాశం
ఉద్యోగుల జీతభత్యాలకూ గడ్డు కాలమే


