అందిస్తున్నసర్విసులపై విస్తృత ప్రచారం
వైద్య సేవలే కాకుండా వైద్య విద్య ప్రవేశాలు, చందాదారుల కుటుంబాలకు ఆసరా
సాక్షి, హైదరాబాద్: కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) చందాదారులకు అమలు చేస్తున్న సేవలపై విస్తృత ప్రచారం చేస్తోంది. ఈఎస్‌ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీలతోపాటు చందాదారులు పనిచేస్తున్న సంస్థల్లోనూ ఈఎస్‌ఐసీ ద్వారా అమలయ్యే కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ వాల్‌పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేస్తోంది. నిర్మాణ ప్రాంతాల్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీల ఏర్పాటుకు ఉపక్రమించింది. రూ.21 వేల వేతనంలోపు కార్మికులు ఈఎస్‌ఐ పథకం కింద అర్హత పొందుతారు. ఉద్యోగం పొందిన కార్మికుడు తన వివరాలతోపాటు కుటుంబ సభ్యుల వివరాలను కూడా నమోదు చేయించడంతోపాటు అందరి ఆధార్ కార్డు వివరాలను యాజమాన్యం ద్వారా వెబ్‌సైట్‌లో ఎంట్రీ చేయించాలి.
సాధారణంగా ఈఎస్‌ఐ ద్వారా కేవలం వైద్య సదుపాయాలు మాత్రమే అందుతాయనేది కార్మిక వర్గాల్లో ఉన్న ప్రచారం. కానీ అంతకు మించిన మరెన్నో ప్రయోజనాలను ఈఎస్‌ఐ ద్వారా పొందొచ్చని ఇప్పుడు కార్పొరేషన్ విస్తృత అవగాహన కల్పిస్తోంది.
⇒ దేశవ్యాప్తంగా 8 మెడికల్ కాలేజీలు, రెండు డెంటల్ కాలేజీలు, మరో రెండు నర్సింగ్ కాలేజీలున్నాయి. ఈ కాలేజీల్లో ప్రవేశాల విషయంలో 15 శాతం సీట్లు ఆలిండియా కోటాకు కేటాయించగా, 50 శాతం సీట్లు స్థానిక అభ్యర్థులకు, 35 శాతం సీట్లు మాత్రం ఈఎస్‌ఐ చందాదారుల పిల్లలకు కేటాయించారు. ర్యాంకు ఆధారంగా ఈఎస్‌ఐ చందాదారు కోటాలో ప్రవేశాలు పొందొచ్చు.
⇒ మహిళా చందాదారులు ప్రసూతి సెలవులు తీసుకోవొచ్చు. ఇద్దరు పిల్లల వరకు 26 వారాల పాటు నూరుశాతం వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇస్తారు. దత్తత తీసుకుంటే 12 వారాల పాటు సెలవులు పొందొచ్చు. ఈ సేవలు పొందేందుకు ముందుగా ఈఎస్‌ఐ ఆస్పత్రిలో వైద్యులతో చికిత్స చేయించి ధ్రువీకరించుకున్న తర్వాత యాజమాన్యం సహాయంతో పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
⇒ చందాదారులు విధుల్లో మరణిస్తే వేతనంలో 90 శాతాన్ని పింఛన్ రూపంలో పొందొచ్చు. భార్యకు జీవితాంతం, కుమారుడికి 25 సంవత్సరాలు వచ్చే వరకు, కూతురుకు వివాహం అయ్యే వరకు పింఛన్ నిబంధనల మేరకు ఈఎస్‌ఐ చెల్లిస్తుంది. దివ్యాంగులైన కుమారుడు లేదా కుమార్తె ఉంటే వారికి బెనిఫిట్స్ ఇస్తారు. ఇందుకు సంబంధించి ఫారం–15, బ్యాంకు ఖాతా, కుటుంబ వివరాలను సమీప ఈఎస్‌ఐ కార్యాలయంలో సమరి్పంచాలి.
⇒ కార్మికులు జబ్బు పడితే వారికి వేతనంలో 75 శాతాన్ని కార్పొరేషన్ సాయం చేస్తుంది. ఏడాదిలో గరిష్టంగా మూడు నెలల (91 రోజుల) పాటు చెల్లిస్తారు.
⇒ టుబెక్టమీ చేయించుకుంటే 14 రోజులు, వ్యాసెక్టమీ చేయించుకుంటే 7 రోజుల పూర్తి వేతనం ఈఎస్‌ఐ కార్పొరేషన్ అందిస్తుంది. పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి అర్హత లభిస్తుంది.


