
18 కేంద్రాలు మంజూరై ఏళ్లు గడుస్తున్నా ఏర్పాటు కాని వైనం
వీటి ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలు డీఐఎంఎస్‌కు అప్పగింత
భవనాల లభ్యత లేదనే సాకుతో ముందుకు కదలని యంత్రాంగం
వైద్యులు, సిబ్బంది నియామకంలోనూ ఉదాసీనత
ఫలితంగా చందాదారులకు అందని ఈఎస్‌ఐ వైద్య సేవలు
సాక్షి, హైదరాబాద్: కార్మికుల సంఖ్యకు అనుగుణంగా మరిన్ని డిస్పెన్సరీల ఏర్పాటుకు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) అన్ని రకాల అనుమతులు జారీ చేసినప్పటికీ.. రాష్ట్ర యంత్రాంగం ఉదాసీనతతో వాటి ఏర్పాటుకు గ్రహణం పట్టుకుంది. కోవిడ్–19 సమయంలో కొత్తగా 18 డిస్పెన్సరీలను మంచిర్యాల, ఖమ్మం, ఆదిలాబాద్, హనుమకొండ, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, సూర్యాపేట జిల్లాల్లో ఏర్పాటు చేసుకోవచ్చని ఈఎస్‌ఐసీ స్పష్టం చేసింది.
వీటి ఏర్పాటు, నిర్వహణకు సంబంధించిన ఆర్థిక పరమైన సహకారాన్ని అందించేందుకు ఈఎస్‌ఐసీ అంగీకరించింది. ఈ డిస్పెన్సరీలను ఏర్పాటు చేయడంతో పాటు నిర్వహణకు సంబంధించిన బాధ్యతలను రాష్ట్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ ఆఫ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (డీఐఎంఎస్)కు ఈఎస్‌ఐసీ అప్పగించింది. అయితే ఇది జరిగి దాదాపు ఐదేళ్లు కావస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం వీటి ఏర్పాటు విషయంలో ఎలాంటి పురోగతి లేదు.
నిరుపయోగంగా నిధులు..
కొత్తగా డిస్పెన్సరీ ఏర్పాటు చేయాలంటే అందుకు సంబంధించి అనువైన భవనం అవసరం. ఆ తర్వాత డాక్టర్‌తో పాటు సిబ్బందిని నియమించుకోవాల్సి ఉంటుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం పరిధిలోనీ ఈఐఎస్‌ఐసీ కేవలం ఆర్థిక సహకారం అందిస్తుండగా.. అందుకు సంబంధించిన కార్యాచరణను అమలు చేయాల్సిన బాధ్యత మాత్రం డీఐఎంఎస్‌దే. కానీ కొత్త డిస్పెన్సరీల ఏర్పాటుకు డీఐఎంఎస్ ఎలాంటి కార్యాచరణను ఇప్పటివరకు అమలు చేయలేదు. కొత్త భవనాల ఏర్పాటును గాలికి వదిలేసిందని విమర్శలు వస్తున్నాయి.
దాదాపు ఐదేళ్ల నుంచి ఈఎస్‌ఐసీ ప్రతి సంవత్సరం బడ్జెట్ రివిజన్‌లో భాగంగా నిధులు కేటాయిస్తున్నప్పటికీ డిస్పెన్సరీలు ఏర్పాటు చేయకపోవడంతో ఆ నిధులు వినియోగంలోకి రావడం లేదు. కొత్త డిస్పెన్సరీల ఏర్పాటుకు భవనాల లభ్యత లేదని డీఐఎంఎస్ చెబుతోంది. మరోవైపు డిస్పెన్సరీల్లో పనిచేసేందుకు తాత్కాలిక పద్ధతిలో డాక్టర్లు, ఫార్మసిస్టులతో పాటు ఇతర సిబ్బందిని నియమించుకోవాల్సి ఉండగా... ఇప్పటివరకు నియామకాలకు సంబంధించి కనీసం ప్రకటన కూడా జారీ చేయలేదు. భవనాల లభ్యత లేదనే కారణంతో కొత్తగా 18 డిస్పెన్సరీల ఏర్పాటును డీఐఎంఎస్ అటకెక్కించింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 71 డిస్పెన్సరీలున్నాయి. వీటి ద్వారా 21 లక్షల మంది కార్మికుల కుటుంబాలకు వైద్య సేవలందుతున్నాయి. డిమాండ్‌కు తగినట్లు డిస్పెన్సరీల ఏర్పాటులో భాగంగా వాటి సంఖ్యను ఈఎస్‌ఐసీ క్రమంగా పెంచుతోంది. కాగా, రాష్ట్రానికి మంజూరైన 18 సెంటర్లను అనేక ఏళ్లుగా ఏర్పాటు చేయకపోవడంతో మరిన్ని కేంద్రాల మంజూరుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో చందాదారులకు వేగవంతంగా వైద్య సేవలు అందడం కష్టతరంగా మారింది.