ఏఐ, డేటా సైన్స్‌లో అరకొర బోధన
ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్న బోధన సిబ్బంది
ఇక్కడ సరైన వేతనాలు లేకపోవడమే కారణం
జిల్లాలు, హైదరాబాద్ శివారు ఇంజనీరింగ్ కాలేజీల్లో సమస్య
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలను అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. నైపుణ్యం గల ఫ్యాకల్టీ ఈ ఏడాది పెద్ద ఎత్తున విరమించుకున్నట్టు కాలేజీల యాజ మాన్యాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఏఐ, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి ఎమర్జింగ్ కోర్సుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని చెబుతున్నారు. టాప్ కాలేజీలకు చెందిన కొంతమంది అధ్యాపకులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు.
మధ్యస్తంగా ఉండే కాలేజీల్లో పనిచేసే ఫ్యాకల్టీని టాప్ కాలేజీలు తీసుకున్నాయి. దీంతో టాప్ 20 తర్వాత ఉండే కాలేజీల్లో సీఎస్‌సీ, ఎలక్ట్రానిక్స్, ఆఖరుకు సివిల్, మెకానికల్ ఫ్యాకల్టీతో ఎమర్జింగ్ కోర్సులను నెట్టుకొస్తున్నారు. జిల్లాల్లో, హైదరాబాద్ పరిసరాల్లోని సాధారణ ఇంజనీరింగ్ కాలేజీల్లో అరకొరగానే ఫ్యాకల్టీ ఉంది. కనీస నైపుణ్యం కూడా లేని వారితో క్లాసులు నిర్వహిస్తున్నట్టు జేఎన్‌టీయూహెచ్‌కు చెందిన ఓ సీనియర్ ప్రొఫెసర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వందకు పైగా కాలేజీల్లో బోధన సిబ్బంది సమస్య ఉన్నట్టు యాజమాన్యాలు చెబుతున్నాయి.
ఎందుకీ పరిస్థితి?
టాప్ టెన్ కాలేజీలు మినహా అన్ని కాలేజీలూ రెండేళ్ళుగా అధ్యాపకుల వేతనాలు పెంచలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రావడం లేదని, ఫీజులు పెంచేందుకు ప్రభు త్వం ఒప్పుకోవ డం లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈసారి యాజమాన్య కోటా సీట్ల భర్తీ కూడా టాప్ 15 కాలేజీల్లోనే ఎక్కువగా జరిగింది. అదే సాధా రణ కాలేజీల్లో సీఎస్‌ఈ సీట్లు కూడా మిగిలిపోయాయి. మరో వైపు నిర్వహణ వ్యయం భారీగా పెరిగింది. సీఎస్‌ఈ, ఎమర్జింగ్ కోర్సులకు మౌలిక వసతుల కల్పన వ్యయం ఎక్కువైందని యాజమాన్యాలు అంటున్నాయి.
ఇంకోవైపు ఇతర రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈసారి పెద్ద ఎత్తున కంప్యూటర్, ఎమర్జింగ్ కోర్సుల సీట్లను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి మంజూరు చేసింది. ఫలితంగా ఆయా కాలేజీల్లో ఫ్యాకల్టీ అవసరం ఏర్పడింది. మన రాష్ట్రం నుంచి దాదాపు వందకు పైగా డేటాసైన్స్ అధ్యాపకులు కర్ణాటక, తమిళనాడు కాలేజీలకు వెళ్ళినట్టు చెబుతున్నారు. రాష్ట్రంలో డేటాసైన్స్ ఫ్యాకలీ్టకి నెలకు రూ.75 వేల నుంచి రూ. 1.5 లక్షల వరకూ వేతనాలు ఇస్తున్నారు. అదే ఇతర రాష్ట్రాల్లో రూ.లక్ష నుంచి రూ. 2 లక్షల వరకూ ఆఫర్లు వచి్చనట్టు అధ్యాపకులు చెబుతున్నారు.
కోడింగ్ కష్టాలు
ఇంజనీరింగ్ విద్యార్థులకు కోడింగ్ అత్యంత ప్రాధానమైంది. కమాండ్లు, సూచనలు రాయడం ఈ దశలోనే చేయాలి. సీ, సీ ప్లస్, జావా, పైతాన్, జావా స్క్రిప్‌్ట, మెటాలాబ్, ఆర్, హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్ వంటి ప్రోగ్రామ్‌లపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. నిపుణులైన అధ్యాపకులు వీటిని ప్రాక్టికల్‌గా నేర్పుతారు. అయితే కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో మంచి ఫ్యాకల్టీ లేకపోవడంతో విద్యార్థులు కోడింగ్‌పై దృష్టి పెట్టలేకపోతున్నారు.
మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ ఆన్‌లైన్‌లో నేర్చుకుని వచ్చి చెప్పాల్సి వస్తోందని, ఈ నేపథ్యంలో తమ సందేహాలు వారు నివృత్తి చేయలేకపోతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్, డేటా స్ట్రక్చర్స్..ఆల్గరిథమ్స్, డేటాబేస్ మేనేజ్‌మెంట్, విజన్ కంట్రోల్, బేసిక్ వెబ్ డిజైనింగ్, పైతాన్, మెటాలాబ్ ఫర్ డేటా సిమ్యులేషన్, ప్రోగ్రామ్ సాల్వింగ్ స్కిల్స్‌లో కనీస ప్రమాణాలు కూడా ఫ్యాకల్టీ నుంచి ఉండటం లేదని విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు అంటున్నారు.


