
‘గాందీ’లో విజయవంతంగా చికిత్స
హైదరాబాద్: సికింద్రాబాద్ గాందీఆస్పత్రి వైద్యులు అరుదైన వైద్యసేవలను అందించి ఏడుబ్లేడ్‌లు మింగిన వ్యక్తికి పునర్జన్మను ప్రసాదించారు. డిప్యూటీ సూపరింటెండెంట్, జనరల్ సర్జరీ ప్రొఫెసర్ సునీల్‌కుమార్ తెలిపిన మేరకు.. మౌలాలికి చెందిన రియాజుదీ్థన్ పాషా (36) ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 16న ఏడు బ్లేడ్‌లను మింగాడు.
తీవ్రమైన కడుపునొప్పితో అదే రోజు గాంధీ అత్యవసర విభాగంలో అడ్మిట్ అయ్యాడు. పలు రకాల వైద్యపరీక్షలు నిర్వహించి, ఎక్స్‌రే తీయగా కడుపులో ఏడు బ్లేడ్‌లు కనిపించాయి. సర్జరీ చేసి బ్లేడ్‌లు బయటకు తీయడం ప్రాణాపాయమని భావించిన వైద్యులు గ్య్రాస్టోఎంట్రాలజీ ఎండోస్కోపీ ద్వారా ప్రయత్నించాలని నిర్ణయించారు. బ్లేడ్‌లు జీర్ణాశయంలో ఉండడంతో బయటకు తీసే క్రమంలో అన్నవాహిక ఇతర సున్నితమైన భాగాలకు గాయాలు అయ్యే అవకాశం ఉండడంతో ఎండోస్కోపీ పద్ధతిని విరమించుకున్నారు. లిక్విడ్ డైట్, ఐవీప్లూయిడ్స్, కడుపులోని ఆమ్లాలను తగ్గించే మందులు ఇచ్చి నిరంతరం అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఈరకమైన వైద్యవిధానం సత్ఫలితాలు ఇచ్చింది.
జీర్ణాశయంలో ఉన్న ఏడు బ్లేడ్‌లు మెల్లగా చిన్న ప్రేగుకు, అక్కడి నుంచి పెద్దపేగుకు చేరుకుని రెండు రోజుల తర్వాత మలద్వారం నుంచి వచ్చేలా చేశారు. పదునైన వస్తువులు మింగిన క్రమంలో జీర్ణాశయంతోపాటు ఇతర అవయవాలకు తగిలి అంతర్గతగాయాలు, రక్తస్రావం జరిగి ప్రాణాలకు ముప్పు ఉంటుందని, ఈ కేసులో ఎటువంటి ప్రమాదం జరగలేదని ప్రొఫెసర్ సునీల్‌కుమార్ వివరించారు. అరుదైన కేసులో అత్యంత ప్రతిభావంతమైన వైద్యసేవలు అందించి బాధితునికి పునర్జన్మ ప్రసాదించిన గాంధీ వైద్యులను సూపరింటెండెంట్ ప్రొఫెసర్ సీహెచ్‌ఎన్ రాజకుమారి అభినందించారు.