
నగరంలోని రెండు ప్రైవేట్ ఆస్పత్రుల ఆపరేషనల్ ఫ్రేమ్‌వర్క్‌ను అధ్యయనం చేసిన ఆరోగ్యశాఖ
బెడ్ కెపాసిటీ, పేషెంట్ లోడ్ నుంచి స్టాఫింగ్, ఐటీ సేవల వరకు పరిశీలన
ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్‌కు వైద్యవృత్తితో సంబంధం లేకుండా ప్రత్యేక విభాగ ఏర్పాటుకు నిర్ణయం
సనత్‌నగర్ టిమ్స్ గుండె సంబంధమైన వ్యాధులతోపాటు అవయవ మార్పిడికి ప్రత్యేక ఆస్పత్రిగా కొనసాగనుంది.
అల్వాల్‌లోని టిమ్స్ న్యూరో (నరాల) సంబంధమైన వ్యాధులకు, ఎల్‌బీనగర్ టిమ్స్ గ్యాస్ట్రో సంబంధమైనవ్యాధులకు స్పెషాలిటీ ఆస్పత్రులుగా కొనసాగనున్నాయి.
ఉస్మానియా, గాంధీ, ఎంజీఎంలకు భిన్నంగా ఆస్పత్రుల నిర్వహణ నుంచి వైద్యులు, సిబ్బంది నియామకం వరకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగనున్నారు.
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) ఆస్పత్రుల్లో వైద్య సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. వీటిని కార్పొరేట్ ఆస్పత్రుల తరహాలో తీర్చిదిద్దు తున్నారు. నిమ్స్ కన్నా మెరుగ్గా వైద్య సేవలతో పాటు నిర్వహణ వ్యవస్థను కూడా ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సనత్‌నగర్, ఎల్‌బీనగర్, అల్వాల్‌లో నిర్మిస్తున్న ‘టిమ్స్’పనులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తి కానున్నాయి. ఈ మూడు ఆస్పత్రులను నగర శివార్లలో ఏర్పాటైన కుత్బుల్లాపూర్, మహేశ్వరం మెడికల్ కళాశాలలకు అనుబంధంగా ఓవైపు జనరల్ ఆస్పత్రులుగా నడిపిస్తూనే, స్పెషలైజేషన్ వైద్యానికి కేరాఫ్‌గా ‘డ్యూయల్ రోల్’లో కొనసాగించనున్నారు.
‘ఆపరేషనల్ ఫ్రేమ్‌వర్క్’పై...
టిమ్స్‌లో కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉన్న ‘ఆపరేషనల్ ఫ్రేమ్‌వర్క్’ను సాధ్యమైనంత మేర అమలు చేసే అంశాన్ని ఆరోగ్యశాఖ సునిశితంగా పరిశీలిస్తోంది. ఇందుకోసం గచ్చిబౌలి, హైటెక్ సిటీల్లో ఉన్న రెండు మల్టీ స్పెషాలిటీ కార్పొరేట్ ఆస్పత్రుల ఫ్రేమ్ వర్క్‌పై ఆరోగ్యశాఖ అధికారులు అధ్యయనం చేశారు. ఆ రెండు 1,000 పడకల సామర్థ్యం కలవి కావడంతో అక్కడి ఓవర్‌వ్యూతోపాటు స్టాఫింగ్ ప్యాటర్న్, నాన్ మెడికల్ సర్వీసెస్, ఇతర ముఖ్యమైన అంశాలపై నివేదికలు తెప్పించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేశారు.
బెడ్ కెపాసిటీ, ఓపీ, ఐపీ తీరు, స్టాఫింగ్, ఐటీ, మౌలిక వసతుల వరకు అన్ని అంశాలను పరిశీలించారు. ఆస్పత్రుల నిర్వహణ వ్యవస్థ నుంచి డాక్టర్లను పక్కన బెట్టి, వైద్యులు, ప్రొఫెసర్లుగా ఉన్న నిపుణులు పూర్తిస్థాయిలో వైద్యంపైనే దృష్టి పెట్టేలా ప్రణాళిక రూపొందించారు. ఆస్పత్రి నిర్వహణ బాధ్యతలను ఎండీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులు పూర్తి చేసిన వారిని నియమించడంతోపాటు ఆస్పత్రులకు అవసరమైన స్పెషలైజ్ డాక్టర్లను ప్రత్యేకంగా నియమించుకోవాలని నిర్ణయించారు. ఆస్పత్రి నిర్వహణకు అవసరమైన వేలాది మంది సిబ్బందిని ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో తీసుకోనున్నారు.
నిమ్స్ తరహాలో ఫీజుల వసూలు
టిమ్స్‌లో చికిత్స పొందే రోగుల నుంచి స్వల్పంగా ఫీజులను వసూలు చేయాలని నిర్ణయించారు. ప్రత్యేక ప్రతిపత్తితో కొన సాగుతున్న నిమ్స్ తరహాలోనే ఓపీ నుంచి ఇన్‌పేషెంట్ల వరకు ఈ ఆస్పత్రులకు వచ్చే రోగులకు ఫీజులు నిర్ణయించనున్నారు. అయితే నిమ్స్ స్థాయిలో కాకుండా సామా న్యులు కూడా భరించేలా తక్కువ మొత్తంలో రోగుల నుంచి ఫీజులు వసూలు చేయ డం ద్వారా వారిలో జవాబుదారీతనాన్ని పెంపొందించనున్నట్టు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
1,000 పడకలు గల ఒక్కో ఆస్పత్రిలోని 350 పడకలను రెండు మెడికల్ కళాశాలలకు అనుబంధంగా కేటాయించి, మిగతా 650 పడకలకు సంబంధించి ఫీజులు వసూలు చేయను న్నారు. అవి కూడా స్పెషలైజ్ వ్యాధులకు సంబంధించి మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్ సేవలకు సంబంధించి నిమ్స్‌లో అమలవుతున్న విధానాన్నే ఈ టిమ్స్‌ల్లో కూడా పాటించనున్నారు.