
చెరువులకు అడ్డగోలుగా ఎన్‌ఓసీల జారీపై కొరడా
హైదరాబాద్ నుంచి 55 మంది ఇంజనీర్లు ఓడీపై ఇతర జిల్లాలకు
జిల్లాల నుంచి హైదరాబాద్‌కు మరో 51 మంది ఓడీపై
నీటిపారుదల శాఖ సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని చెరువులు, కుంటల ఫుల్‌ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) పరిధిలోని భూముల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతిస్తూ అడ్డగోలుగా నిరభ్యంతర పత్రాలు (ఎన్‌ఓసీ) జారీ చేశారని వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. వరుసగా ఎన్‌ఓసీల కుంభకోణాలు వెలుగులోకి రావడంతో హైదరాబాద్ సర్కిల్ సీఈ కార్యాలయాన్ని ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. నీటిపారుదల శాఖ హైదరాబాద్ సర్కిల్ సీఈ పరిధిలో పనిచేస్తున్న క్షేత్రస్థాయి ఇంజనీర్లలో ఒకరు మినహా మిగిలిన వారందరినీ ఆన్‌డ్యూటీ (ఓడీ)పై జిల్లాలకు పంపింది.
అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ), డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈఈ), ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ), సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్‌ఈ), డిప్యూటీ సీఈ హోదాలో హైదరాబాద్ సీఈ పరిధిలో పనిచేస్తున్న మొత్తం 55 మంది ఇంజనీర్లను హైదరాబాద్ బయటి ప్రాంతాలకు పంపింది. వారి స్థానంలో పనిచేసేందుకు జిల్లాల్లో పనిచేస్తున్న 51 మంది ఇంజనీర్లను ఆన్‌డ్యూటీపై హైదరాబాద్ సీఈ కార్యాలయానికి పంపింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఉద్యోగుల సర్దుబాటు కొనసాగుతుందని చెప్పారు. గండిపేట సబ్ డివిజన్ డీఈఈగా, హైదరాబాద్‌లోని జలసౌధ కార్యాలయం ఎస్టేట్ అధికారిగా దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఓ మహిళా ఇంజనీర్‌కు మాత్రమే ప్రత్యేక మినహాయింపు కల్పించడం పట్ల నీటిపారుదల శాఖ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
గండిపేట పరిధిలో రూ.వేల కోట్లు విలువ చేసే నీటిపారుదల శాఖ భూములు పెద్దఎత్తున కబ్జాలకు గురయ్యాయని, వాటిని స్వాధీనం చేసుకోవాలని ఇటీవల మంత్రి ఉత్తమ్ ఆదేశించిన విషయాన్ని కొందరు ఇంజనీర్లు గుర్తు చేస్తున్నారు. నాలుగేళ్లుగా గండిపేట సబ్ డివిజన్‌లో పనిచేస్తున్న ఇంజనీర్‌ను అక్కడే కొనసాగిస్తూ క్షేత్ర స్థాయి పోస్టుల్లో పనిచేస్తున్న ఇంజనీర్లందరినీ పంపడం వెనక మతలబు ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఓడీపై ఎందుకంటే..
పైరవీలు, రాజకీయ పలుకుబడితో కార్యాలయం పరిధిలో దీర్ఘకాలంగా తిష్టవేసి అక్రమాలకు పాల్ప డుతున్నట్టు ఆరోపణలుండడంతో క్షేత్రస్థాయిలో ఇంజనీర్లందరినీ బదిలీ చేయాలని మంత్రి ఆదేశించినట్టు తెలిసింది. బదిలీలపై అమల్లో ఉన్న నిషేధాన్ని ఉల్లంఘిస్తూ బదిలీలు నిర్వహిస్తే సంబంధిత ఉద్యోగుల జీతాలను ఆర్థిక శాఖ నిలుపుదల చేసిన ఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఆన్‌డ్యూటీపై ఇతర ప్రాంతాలకు పంపి నిషేధం ఎత్తేశాక బదిలీ ఉత్తర్వులు జారీ చేయాలని ఆ శాఖ నిర్ణయం తీసుకుంది.
నేపథ్యం ఇదీ...
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంఖాల్ గ్రామంలోని కొత్తకుంట చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు ఎన్‌ఓసీ జారీ చేయడంపై ఇటీవల నీటిపారుదల శాఖ విచారణ జరిపించగా ఎన్నో సంచలన అంశాలు వెలుగు చూశాయి. కొత్తకుంట చెరువు ఎఫ్‌టీఎల్ 8.284 ఎకరాల్లో విస్తరించి ఉండగా 2.03 ఎకరాలేనంటూ ఎన్‌ఓసీ జారీ చేసినట్లు తేలింది. ఈ వ్యవహారంపై ఆరోపణలు రావడంతో ఎన్‌ఓసీ జారీకి సంబంధించిన రికార్డులను మాయం చేసేసినట్టు రుజువైంది.
ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న హైదరాబాద్ సర్కిల్ సీఈ కె.ధర్మాను గతంలోనే ప్రభుత్వం పోస్టు నుంచి తొలగించి కొత్త పోస్టింగ్ కేటాయించలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఏఈఈ వి.గంగరాజు ఏడాది కాలంగా విధులకు గైర్హాజరవుతున్నారు. డీఈఈ కె.జగదీశ్వర్, ఈఈ కె.బన్సీలాల్, ఎస్‌ఈ హైదర్ ఖాన్‌కు సైతం ఈ వ్యవహారంలో పాత్ర ఉన్నట్టు విచారణలో తేలింది. వీరిలో గంగరాజు, కె.జగదీశ్వర్‌ను ప్రభుత్వం ఓడీపై ఇతర జిల్లాలకు పంపింది.