
కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడికి వేర్వేరు చోట్ల ఓట్లు ఉన్నట్లు చూపుతున్న కేటీఆర్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి
ఓట్‌చోరీపై రాహుల్ గాంధీ స్పందించాలి
కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడికే మూడు ఓట్లు ఉన్నాయి
ఉప ఎన్నికలో ఏకంగా 23 వేల ఓట్లు ఎలా పెరిగాయని నిలదీత
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో నమోదైన నకిలీ ఓటర్లను వెంటనే తొలగించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. డూప్లికేట్ ఓటర్ల నమోదు ద్వారా అక్రమాలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఓటరు జాబితా విశ్వసనీయత ప్రశ్నార్థకమైన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించాలన్నారు. తాము లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు.
ఓట్ చోరీకి సంబంధించిన రుజువులను తమ పార్టీ కార్యకర్తల సహకారంతో రెండు రోజుల వ్యవధిలోనే ప్రజల ముందు పెట్టామన్నారు. అయినా ఎన్నికల కమిషన్ ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఓటరు జాబితాలో చోటుచేసుకున్న అక్రమాలపై మంగళవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తాము రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసి 24 గంటలు దాటినా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బుధవారం హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు.
అసాధారణంగా ఓట్లు పెరిగాయ్..
‘తెలంగాణ ఓట్ చోరీ అంశంపై రాహుల్ గాంధీ స్పందించాలి. బిహార్‌లో ఓటు చోరీ జరిగితే తెలంగాణలో ఓట్ల చోరీ ద్వారా ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ చూస్తోంది. రాహుల్ గాంధీ రాజ్యాంగం ప్రతులను చేతిలో పట్టుకొని అన్ని రాష్ట్రాల్లో నీతి సూక్తులు వల్లె వేస్తున్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలవాలని యత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కింది అధికారులతో కుమ్మక్కైన అంశాన్ని రాహుల్ గాంధీ పరిగణనలోకి తీసుకొని ఇక్కడ జరిగిన దొంగ ఓట్ల అంశంపై స్పందించాలి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా 23వేల ఓట్లు పెరిగాయని ఎన్నికల సంఘం చెబుతోంది. మరో 12వేల ఓట్లు తొలగించామని చెబుతున్నా అసాధారణంగా ఓట్లు పెరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన వ్యక్తి అక్రమంగా ఓటరు ఐడీ కార్డులను పంపిణీ చేయడంపై ఎన్నికల సంఘం కేసు కూడా నమోదు చేసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ సొంత తమ్ముడు వెంకట్ ప్రవీణ్ యాదవ్‌కు మూడు ఓట్లు ఉన్నాయి.
ఈ వ్యవహారంలో ఎన్నికల అక్రమాల కోసం కిందిస్థాయి అధికారులను కాంగ్రెస్ ఉపయోగించుకుందనే అనుమానం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడికి మూడు ఓట్లు ఉన్న తర్వాత స్వేచ్ఛగా ఎన్నిక జరుగుతుందని ఎలా అనుకోవాలి. ఎన్ని రకాల కుట్రలు, కుతంత్రాలు చేసినా బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారు’అని కేటీఆర్ పేర్కొన్నారు.