
ప్రాజెక్టుపై ఏపీ ముందుకు వెళ్లకుండా అడ్డుకోవాలి
ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియను చేపట్టరాదు
కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
అత్యవసర సమావేశం నిర్వహించాలని పీపీఏకు మరో లేఖ
సాక్షి, హైదరాబాద్: పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) రూపకల్పన కోసం తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించడం పూర్తిగా చట్టవిరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం ఆక్షేపించింది. ఈ ప్రాజెక్టును చేపట్టకుండా ఏపీని కట్టడి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా మంగళవారం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావుకు లేఖ రాశారు.
కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) 2010, 2017లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం 75 శాతం నీటి లభ్యత ఆధారంగానే కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాల్సి ఉందని గుర్తు చేసింది. దీనికి విరుద్ధంగా వరద జలాల ఆధారంగా ప్రతిపాదించిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతుల జారీ అంశాన్ని ఏ ప్రాతిపదికన పరిశీలిస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), సీడబ్ల్యూసీ, గోదావరి యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ), కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)తో పాటు ప్రభావిత రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయని గుర్తు చేసింది.
ఏపీ సమర్పించిన పోలవరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు ప్రిఫీజిబిలిటీ నివేదిక (పీఎఫ్‌ఆర్)ను పరిశీలించరాదని కేంద్రాన్ని కోరింది. పోలవరం ప్రాజెక్టుకు తెలంగాణ సమ్మతి ఇచ్చినట్టు పరిగణించాలని పేర్కొంటూ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన సెక్షన్ 90 (3)ని ఉల్లంఘించి ఈ ప్రాజెక్టును ఏపీ ప్రతిపాదించిందని అభ్యంతరం తెలిపింది. పోలవరం ప్రాజెక్టుకు తెలంగాణ ఇచ్చిన సమ్మతి పోలవరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు వర్తించదని స్పష్టం చేసింది.
ఇదే చట్టంలోని సెక్షన్–30(2) ద్వారా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంతో పాటు ఈ ప్రాజెక్టు ఆపరేషన్ ప్రొటోకాల్‌ను సైతం కేంద్రమే ఖరారు చేసిందని గుర్తు చేసింది. వీటన్నింటినీ ఉల్లంఘిస్తూ ఏపీ ప్రతిపాదించిన పోలవరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు అనుమతుల జారీ ప్రక్రియను చేపట్టరాదని కేంద్రాన్ని కోరింది.
అత్యవసర సమావేశం నిర్వహించాలి
ఏపీ అక్రమంగా నిర్మించతలపెట్టిన పోలవరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుపై చర్చించడానికి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ని తెలంగాణ రాష్ట్రం కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) అంజాద్ హుస్సేన్ ఈ నెల 10న లేఖ రాశారు.
గోదావరి ట్రిబ్యునల్ తీర్పు, ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు ద్వారా 484.5 టీఎంసీల గోదావరి జలాల తరలింపునకు మాత్రమే అనుమతి ఉండగా, దీనికి విరుద్ధంగా ప్రతిపాదించిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పన కోసం ఏపీ టెండర్ ప్రకటన జారీ చేసిందని అభ్యంతరం తెలిపారు.
దీని వల్ల ప్రభావితం కానున్న గోదావరి పరీవాహకంలోని రాష్ట్రాలతో తక్షణమే అత్యవసర సమావేశం నిర్వహించాలని లేఖలో కోరారు. బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పన కోసం ఏపీ టెండర్లను ఆహ్వానించడం పట్ల అభ్యంతరం తెలుపుతూ ఈఎన్సీ అంజాద్‌హుసేన్ ఈ నెల 10న కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అతుల్ జైన్‌కు మరో లేఖ రాశారు.