
కొత్తపేటలో ఆసుపత్రి నిర్మాణాన్ని పరిశీలిస్తున్న హరీశ్‌రావు, వివేకానంద, కాలేరు వెంకటేశ్, సబిత, సుధీర్‌రెడ్డి తదితరులు
మాజీ మంత్రి హరీశ్‌రావు
ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని పట్టించుకోవడంలేదు
పార్టీ నేతలతో కలసి కొత్తపేట టిమ్స్ నిర్మాణం పరిశీలించిన హరీశ్
చైతన్యపురి (హైదరాబాద్): కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం తిరోగమనంలో ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో తాము ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలను 30 నుంచి 70 శాతానికి పెంచితే నేటి రేవంత్ సర్కార్‌లో అది 55 శాతానికి పడిపోయిందని విమర్శించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, వివేకానందగౌడ్, చింత ప్రభాకర్‌లతో కలిసి శనివారం ఆయన ఎల్‌బీనగర్ నియోజకవర్గంలోని కొత్తపేటలో టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పుడు చర్యల వల్ల రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు.
కోవిడ్ సమయంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బీఆర్‌ఎస్ ప్రభుత్వం వరంగల్‌లో హెల్త్‌సిటీ, హైదరాబాద్‌లో నాలుగు వైపులా నాలుగు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాన్ని ప్రారంభించిందన్నారు. కొత్తపేటలో వెయ్యి పడకల ఆసుపత్రి కోసం సెల్లార్ ప్లస్ అరు అంతస్తులు నిర్మాణం చేశామని గుర్తు చేశారు. అయితే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ రెండేళ్లలో పనులు నత్తనడకన నడుస్తున్నాయని, కేవలం ఐదు అంతస్తులు మాత్రమే నిర్మాణం చేశారని విమర్శించారు. అంతేకాక తమ ప్రభుత్వం ఈ ఆసుపత్రికి 24 అంతస్తులకు అనుమతి ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 14 అంతస్తులకు కుదించిందని మండిపడ్డారు.
కేసీఆర్ ప్రభుత్వం ఉంటే ఇప్పటికే పనులు పూర్తయి, పేద ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి వచ్చేవన్నారు. రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం, కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతో ఆసుపత్రుల నిర్మాణాన్ని గాలికి వదిలేసిందని హరీశ్‌రావు విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసుపత్రుల నిర్మాణాలను ఆరునెలల్లో పూర్తి చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తిట్లమీద ఉన్న శ్రద్ధ ఆరోగ్య కిట్లమీద లేదని విమర్శించారు. పేద ప్రజలకు ఉపయోగ పడే టిమ్స్ నిర్మాణాలను రాజకీయాల కోసం ఆపవద్దని హితవు చెప్పారు.