సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో కంటతడి పెట్టారు. ఇదే తన ఆఖరి హాజరు అంటూ ప్రకటించిన ఆమె.. సోమవారం మండలికి హాజరై పలు అంశాలపై భావోద్వేగంగా మాట్లాడారు.
ఎనిమిదేళ్లుగా ప్రజల కోసం నేను చేస్తున్న ప్రయత్నాల్ని అడ్డుకున్నారు. అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలుపెడితే అమరజ్యోతి వరకు ప్రతిదాంట్లో అవినీతి జరిగింది. ఉద్యమకారులు, సూటిగా ప్రశ్నించేవారిపట్ల వివక్ష కొనసాగింది. కేసీఆర్‌పై కక్షతో బీజేపీ నన్ను జైల్లో పెట్టింది. ఈడీ, సీబీఐలపై పోరాడినా బీఆర్ఎస్ నాకు అండగా నిలవలేదు.
పార్టీ మౌత్‌పీస్‌గా ఉన్న ఛానెళ్లు, పేపర్లు నాకు ఏనాడూ మద్దతు ఇవ్వలేదు. నేను ప్రశ్నిస్తే నాపై కక్షగట్టారు. కక్షగట్టి నన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. కేసీఆర్‌కు అవినీతి మరక అంటితే నేనే పోరాడా. అలాంటిది నా సస్పెన్షన్‌కు ముందు నా వివరణ కోరలేదు. నైతికత లేని బీఆర్ఎస్ నుంచి దూరమైనందుకు సంతోషిస్తున్నా అంటూ కంటతడి పెట్టారామె.
ఇకనైనా తన రాజీనామా ఆమోదించండి అని మండలి చైర్మన్‌కు కవిత విజ్ఞప్తి చేశారు. అయితే.. పరిణామాలను తాను అర్థం చేసుకోగలనని, భావోద్వేగాలతో రాజీనామా చేస్తే ఆమోదించరన్న చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి.. రాజీనామాపై పునరాలోచన చేయాలని కవితకు సూచించారు.


