నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
138 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 2,432 పనులకు ఆమోదం.. కొత్త మున్సిపాలిటీలకు రూ. 15 కోట్లు..
కొత్త మున్సిపల్ కార్పొరేషన్లకు రూ.30 కోట్లు
వెంటనే టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని సీఎం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీ ల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభు త్వం భారీగా నిధులు విడుదల చేసింది. ఒకే సారి రూ. 2,780 కోట్లు విడుదల చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిధులను తెలంగాణ కోర్ అర్బన్ సిటీ మినహాయించి.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 138 మున్సిపాలిటీలు, కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్లలో ఖర్చు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కొత్త మున్సిపాలిటీలు, కొత్త గ్రామాలు విలీనమైన మున్సిపాలిటీల్లో పనులకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
మున్సిపాలిటీలకు ఒక్కోదానికి రూ.15 కోట్లు, కొత్త కార్పొరేషన్లకు రూ.30 కోట్లు, గ్రామాలను విలీనం చేసిన మున్సిపాలిటీలకు రూ.20 కోట్ల చొప్పున వెంటనే పంపిణీ చేయాలని తెలిపారు. ఈ రూ.2,780 కోట్లతో చేపట్టే మొత్తం 2,432 పనులకు సీఎం ఆమోద ముద్ర వేశారు. ఈ పనులకు వెంటనే టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టాలని, వచ్చే ఏడాది మార్చి నాటికి కచి్చతంగా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
పురపాలక శాఖ కూడా ముఖ్యమంత్రి వద్దే ఉన్న విషయం తెలిసిందే. పంచాయతీరాజ్ స్థానిక సంస్థలకు ఎన్నికలు ముగిసిన వెంటనే పురపాలక ఎన్నికలు కూడా నిర్వహించనున్న నేపథ్యంలో భారీ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిని తెలంగాణ కోర్ అర్బన్ ఏరియాగా పరిగణిస్తున్న నేపథ్యంలో.. జీహెచ్‌ఎంసీ, చుట్టుపక్కల వాటికి మినహా అన్నింటికి ఈ నిధులు వెంటనే విడుదల చేయాలని సీఎం ఆదేశించారు.
ప్రాధాన్యతా క్రమంలో పనులు..
ఇప్పటికే ఉన్న మున్సిపాలిటీల విస్తరణతోపాటు కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలన్నింటిలో అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం సూచించారు. రాష్ట్ర బడ్జెట్‌లో పొందుపరిచిన నగరాభివృద్ధి నిధులతోపాటు పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (UIDF) నుంచి ఈ నిధులను మంజూరు చేశారు. ప్రాధాన్యత క్రమంలో ఈ నిధులను ఖర్చు చేసేలా మార్గదర్శకాలు విడుదల చేయాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. మున్సిపాలిటీల్లో విలీనమైన ప్రాంతాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం, వర్షపు నీరు, మురుగు నీటికి డ్రైన్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, చెరువులు, కుంటల్లో కాలుష్య నివారణ, డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించిన ప్రాంతాల్లో ప్రాథమిక సదుపాయాల ఏర్పాటు, పార్కుల అభివృద్ధి, కల్వర్టులు, షాపింగ్ కాంప్లెక్సుల నిర్మాణ పనులకు ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.


