ప్రాణ నష్టం తగ్గే అవకాశం
అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున ఎక్కువగా ప్రమాదాలు
గాఢ నిద్రలో ప్రయాణికులు..బస్సులు వదిలేసి పరారవుతున్న డ్రైవర్లు
ప్రయాణికులు మేల్కొనేలోగా చుట్టుముడుతున్న అగ్నికీలలు
తాజా కర్నూలు ప్రమాదం, 2013 పాలెం దుర్ఘటనలో సేమ్ సీన్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఘోర రోడ్డు ప్రమాదాల జాబితాలో ముందు వరుసలో ఉండేవి రెండు ఘటనలు కాగా..మొదటిది 2013 అక్టోబర్‌లో మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట సమీపంలోని పాలెం గ్రామ శివారులో జరిగింది. జబ్బార్ ట్రావెల్స్ బస్సు కల్వర్టు గోడను ఢీకొని 45 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. రెండోది శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు సమీపంలో జరిగిన దుర్ఘటన. ఇవి రెండూ ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా జరిగినవి కావడం గమనార్హం.
కాగా ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించి ప్రయాణికులను మేల్కొలిపేందుకు ప్రయతి్నస్తే ప్రాణ నష్టం తక్కువగా జరిగేందుకు అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కానీ ఎక్కువ ఘటనల్లో డ్రైవర్లు.. భయంతోనో, ఇతరత్రా కారణాలతోనో బస్సును, ప్రయాణికులను వదిలేసి పరారవుతున్నారు. ప్రమాదం ధాటికి, మంటలకు మేల్కొనే ప్రయాణికులు తేరుకుని ఏం జరిగిందో తెలుసుకునేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. గాయపడిన వారిని సకాలంలో రక్షించలేక పోవడం, మంటలు చెలరేగినప్పుడు తప్పించుకునేందుకు అవకాశం లేకపోవడం వంటివి చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు.
రెండు ఘటనల్లోనూ అంతే..
విమాన పైలెట్ల విషయంలో కీలక నిబంధన ఉంది. విమానం ఏదైనా ప్రమాదానికి గురవుతుందనుకున్నప్పుడు.. ముందుగా ప్రయాణికులను, ఆ తర్వాత విమాన సిబ్బందిని రక్షించే కీలక బాధ్యత పైలట్‌ది. వారిని రక్షించే ప్రయత్నం చేసిన తర్వాతనే తనను తాను రక్షించుకునేందుకు యత్నించాలి. ఇది అంతర్జాతీయ ఏవియేషన్ నిబంధన. పైలట్ శిక్షణలో దీనికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. బస్సు డ్రైవర్లు కూడా ఇలాంటి బాధ్యతే నిర్వర్తించాలి. నిబంధనల్లో ప్రత్యేకంగా పొందుపరచనప్పటికీ, డ్రైవింగ్ శిక్షణలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా చెప్తారు. పునఃశ్చరణ తరగతుల్లోనూ దీన్ని వివరిస్తారు.
కానీ ప్రైవేటు బస్సు డ్రైవర్లకు అసలు శిక్షణే ఉండటం లేదు. పునఃశ్చరణ అనేది వారెప్పుడూ వినని మాట అంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి నిర్లక్ష్యం, అవగాహన లోపమే ఈ రెండు భారీ ప్రమాదాల్లో ఏకంగా 65 మంది ప్రాణాన్ని బలిగొంది. బస్సులు రోడ్డు ప్రమాదానికి గురై మంటలు అంటుకోగానే డ్రైవర్లు వెంటనే బస్సు దిగి పారిపోయారు. కర్నూలు ఘటనలో మంటలకు బస్సు వైరింగ్ వ్యవస్థ దెబ్బతిని తలుపులు తెరుచుకోకపోవటంతో ప్రయాణికులు కిటికీ అద్దాలు పగులగొట్టుకుని బయటకు రావాల్సి వచి్చంది. డ్రైవర్లు పారిపోయేముందు తలుపులు తెరిచి ప్రయాణికులను పెద్దగా అరుస్తూ అప్రమత్తం చేసి ఉంటే చాలామంది ప్రాణాలు దక్కించుకునే అవకాశం ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
లారీ డ్రైవర్లకు బస్సుల అప్పగింత!
సాధారణ బస్సులతో పోలిస్తే ఓల్వో, బెంజ్, స్కానియా లాంటి కంపెనీ అధునాతన బస్సులను నడపాల్సిన తీరు వేరుగా ఉంటుంది. ప్రత్యేక శిక్షణ అవసరం. ఆర్టీసీ అలా ప్రత్యేకంగా శిక్షణ ఇచి్చన డ్రైవర్లకు మాత్రమే ఈ బస్సులు అప్పగిస్తోంది. కానీ పలు ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు ఎలాంటి శిక్షణ లేకుండా, లారీలు, ట్రాక్టర్లు నడిపిన వారికి కూడా ఈ బస్సులు ఇస్తున్నాయనే ఆరోపణలున్నాయి. దీంతో కీలక సమయంలో ఎలా వ్యవహరించాలో వీరికి తెలియటం లేదు.
తప్పించుకోనీకుండా చేస్తున్న పొగ
ప్రమాదం జరిగిన కొన్ని క్షణాలు, నిమిషాల తర్వాత మేల్కొనే ప్రయాణికులు పొగ వల్ల తప్పించుకోలేకపోతున్నారు. బస్సులోకి మంటలు వ్యాపించటం కంటే ముందుగానే దట్టంగా పొగ వ్యాపించడం జరుగుతోంది. మంటలు బస్సు దిగువ భాగం నుంచి వ్యాపిస్తాయి. ప్రయాణికులు ఉండే డెక్ కింద సామాను ఉంచే భాగం ఉంటుంది. ప్రైవేటు బస్సు నిర్వాహకులు ప్రయాణికుల టికెట్ ఆదాయం కంటే అక్రమంగా సరుకు రవాణా చేసేందుకే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇందుకోసం దిగువ భాగంలో ఎక్కువ సామాను ఉంచేలా స్థలం ఏర్పాటు చేసుకుంటున్నారు. దాన్ని రకరకాల సామగ్రితో నింపేస్తున్నారు. మంటలకు అవి కాలిపోయి దట్టమైన పొగ బస్సులోకి క్షణాల్లో వ్యాపిస్తోంది.
నిద్రలో ఉంటున్న ప్రయాణికులు ఆ పొగను పీల్చి అస్వస్థతకు గురై స్పృహ కోల్పోతున్నారు. ఎక్కువమంది మృత్యువు పాలవుతున్నారు. ఇక బస్సులో నిబంధనలకు విరుద్ధంగా బెర్తులకు భారీ కర్టెన్లు ఏర్పాటు చేస్తున్నారు. సీట్లకు రెగ్జిన్ కవర్ అమర్చుతున్నారు. ప్రయాణికులకు దిండ్లు, దుప్పట్లు, సీట్ల మీద పరుచుకునేందుకు దుప్పట్లు ఉంచుతున్నారు. ఇవన్నీ మంటల తీవ్రతను పెంచుతున్నాయి. పొగతో ఉక్కిరిబిక్కిరయ్యే ప్రయాణికులను వీటి మంటలు వేగంగా చుట్టుముడుతున్నాయి.


