దృశ్యం ఫ్రాంచైజీలో తెరకెక్కుతున్న మూడో భాగం "దృశ్యం 3". మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తవగా త్వరలోనే హిందీలో షూటింగ్ మొదలుకానుంది. అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా తప్పుకున్నట్లు రూమర్స్ వచ్చాయి.
సడన్‌గా విగ్ కావాలట!
పారితోషికం పెంపుతోపాటు, విగ్ కావాలని కోరాడని.. ఈ విషయంలో నిర్మాతతో భేదాభిప్రాయాలు రావడంతో ఆయన సినిమా నుంచి వైదొలగాడని వార్తలు వచ్చాయి. తాజాగా ఇవే నిజమంటున్నాడు నిర్మాత కుమార్ మంగట్ పాఠక్. ఆయన మాట్లాడుతూ.. దృశ్యం 3 కోసం అక్షయ్ ఖన్నా అగ్రిమెంట్‌పై సంతకం పెట్టాడు. ఆయన అడిగినంత డబ్బు ఇస్తామన్నాం. కానీ ఆయన విగ్ కావాలని డిమాండ్ చేశాడు.
పక్కనున్న చెంచాల వల్లే..
దృశ్యం 2లో అక్షయ్ విగ్ లేకుండా బట్టతలతోనే కనిపించాడు. అలాంటిదిప్పుడు విగ్ పెడితే బాగోదని దర్శకుడు అభిషేక్ పాఠక్ నచ్చజెప్పాడు. దాంతో ఆయన సరేనన్నాడు. అయితే ఆయన పక్కనున్న చెంచాలు విగ్ పెట్టుకుంటే స్మార్ట్‌గా కనిపిస్తావని లేనిపోనివి ఎక్కించారు. దాంతో ఆయన మళ్లీ విగ్ కావాలని అడిగాడు. దర్శకుడు ఆయన్ను సముదాయించాలని చూశాడు.
అప్పుడేమో ఎగిరి గంతేసి..
కానీ ఈసారి అతడు ఏకంగా సినిమా నుంచే తప్పుకున్నాడు. దృశ్యం 3 కథ చెప్పినప్పుడు.. ఇది రూ.500 కోట్ల సినిమా.. జీవితంలో ఇలాంటి కథ వినలేదంటూ టీమ్‌ను హత్తుకున్నాడు. రెమ్యునరేషన్ ఫైనల్ అయ్యాక అడ్వాన్స్ కూడా ఇచ్చాం. పదిరోజుల్లో షూట్ ఉందనగా సినిమా నుంచి తప్పుకున్నాడు. ఈ విషయంలో తనకు నోటీసులు పంపించాం.
గుర్తింపు లేని సమయంలో ఛాన్స్
అక్షయ్‌కు పేరు, గుర్తింపు లేని సమయంలో తనతో సెక్షన్ 375 మూవీ చేశాను. ఆయన గురించి చాలామంది ఎన్నో చెప్పారు. సెట్‌లో కూడా ఓవర్‌గా ప్రవర్తించేవాడు. సెక్షన్ 375 వల్ల అతడికి మంచి పేరు వచ్చింది. అలా అతడిని దృశ్యం 2కి తీసుకున్నాను. ఈ మూవీ తర్వాతే అతడికి పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇప్పుడేమో గర్వం తలకెక్కింది.
అక్షయ్ కంటే మంచి నటుడు
దృశ్యం.. అజయ్ దేవ్‌గణ్ మూవీ, ఛావా.. విక్కీ కౌశల్ మూవీ, అలాగే ధుంధర్ రణ్‌వీర్ సింగ్ సినిమా! ఒకవేళ అక్షయ్ ఖన్నా సోలోగా సినిమా చేస్తే దానికి రూ.50 కోట్లు కూడా రావు. తనవల్లే ధురంధర్ బాగా ఆడుతోందని మాతో అన్నాడు. ధురంధర్ విజయానికి అనేక కారణాలున్నాయి. దృశ్యం 3లో అక్షయ్ స్థానంలో జైదీప్ అహ్లావత్‌ను తీసుకున్నాం. అక్షయ్ కంటే ఇతడు మంచి నటుడు అని చెప్పుకొచ్చాడు.


