నాటోకు ఆ అధికారం ఎక్కడిది?  | NATO is not at the level of issuing warnings | Sakshi
Sakshi News home page

నాటోకు ఆ అధికారం ఎక్కడిది? 

Jul 17 2025 5:17 AM | Updated on Jul 17 2025 5:17 AM

NATO is not at the level of issuing warnings

సార్వభౌమ దేశానికి హెచ్చరికలు చేసే స్థాయి దానికి లేదు

ట్రంప్‌ అండతో నాటో చీఫ్‌ రుట్టే దుస్సాహసంపై సర్వత్రా విమర్శలు 

ప్రతిరోజూ మారుతున్న రాజకీయ, భౌగోళిక పరిస్థితుల్లో ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకోవడం, హెచ్చరికలు చేసుకోవడం ఇప్పుడు సర్వసాధారణమైంది. అయితే ఏకంగా ఒక దేశంపై ఎలాంటి అంతర్జాతీయ అధికారిక అర్హతలు లేని వ్యక్తి సుంకాల సుత్తితో మోదుతానని, ఆర్థిక ఆంక్షలు విధిస్తానని హెచ్చరికలు చేయడం చర్చనీయాంశమైంది. 

అంతర్జాతీయ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటిస్తూ అన్ని దేశాలతో మైత్రీభావంతో మెలిగే భారత్‌ను నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌(నాటో) సెక్రటరీ జనరల్‌  హెచ్చరించడం అందరికీ విస్మయం కల్గిస్తోంది. కొన్ని దేశాలకే పరిమితమైన ఒక సైనిక కూటమికి సార్వభౌమ, గణతంత్ర దేశాన్ని హెచ్చరించే దమ్ము ఎక్కడిది? అనే ప్రశ్న ఇప్పుడు అందరి నోటా వినిపిస్తోంది. నాటో సభ్య దేశాలతో భారత దౌత్య సంబంధాలు దెబ్బతినేలా దుస్సాహసానికి తెగించిన నాటో చీఫ్‌ మార్క్‌ రుట్టేపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత వాణిజ్య విధానాలను ప్రశ్నించే అధికారం నాటోకుగానీ, నాటో చీఫ్‌కుగానీ అస్సలు లేదని అంతర్జాతీయ నిపుణులు సైతం బల్లగుద్ది చెబుతున్నారు.  

అంతర్జాతీయ వాణిజ్య సమీక్ష అధికారం నాటోకు లేదు 
నాటో అనేది కేవలం ఉత్తర అట్లాంటిక్‌ ఖండంలోని కొన్ని దేశాల సైనిక కూటమి మాత్రమే. ప్రపంచదేశాలు కుదుర్చుకుని పొరుగు, స్నేహపూర్వక దేశాలతో కుదుర్చుకునే వాణిజ్య ఒప్పందాల్లో నాటోకు ఎలాంటి ప్రమేయం, హక్కులు ఉండవు. సార్వభౌమత్వాన్ని సంతరించుకున్న భారత్‌ ఏ దేశంతో వాణిజ్యంచేసినా అది పూర్తి ఏకపక్షంగా తీసుకునే నిర్ణయం. ఇందులో జోక్యంచేసుకునే కనీస హక్కు, అర్హత నాటోకు లేదు. నాటో తన పరిధి దాటి ప్రవర్తిస్తోందని అంతర్జాతీయ వాణిజ్యరంగ నిపుణులు వ్యాఖ్యానించారు. అమెరికా విదేశాంగ విధానాలకు నాటో తలొగ్గిందనేది బహిరంగ రహస్యం.

 మరోవైపు చైనా, భారత్‌ సారథ్యంలో మరింత పటిష్టమవుతున్న బ్రిక్స్‌ కూటమి ఇప్పుడు అంతర్జాతీయ మారకమైన డాలర్‌ ఆధిపత్యానికి గండికొట్టి ప్రత్యామ్నాయ కరెన్సీని ముందుకు తేవొచ్చనే భయాందోళనలు అమెరికాను వెంటాడుతున్నాయి. అందుకే నాటోతో ఇలా అమెరికా పరోక్ష హెచ్చరికలు చేయిస్తోందని భావిస్తున్నారు. అంతర్జాతీయ వాణిజ్య విభేదాలు తలెత్తితే పరిష్కరించేందుకు ప్రపంచ వాణిజ్యసంస్థ(డబ్ల్యూటీఓ) ఉండనే ఉంది. వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ విధుల్లోకి నాటో ఎందుకు తలదూర్చుతోందన్న విమర్శలు మొదలయ్యాయి. 

భారత్‌కు శాంతి సందేశాలు అక్కర్లేదు 
వేల సంవత్సరాల చరిత్రలో ఏనాడూ తనంతట తానుగా ఏ దేశం మీదా దండయాత్రకు దిగని దేశంగా భారత్‌ ఘనత సాధించింది. గతేడాది ఆగస్ట్‌లో నాటి అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో మాట్లాడిన మరుసటి రోజే పుతిన్‌తో మోదీ మాట్లాడి శాంతి ఒప్పందం చేసుకోవాలని సూచించిన విషయం తెల్సిందే. శాంతికాముక దేశంగా పేరొందిన భారత్‌కు ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం విషయంలో శాంతి ప్రబోధాలు నాటో వంటి సైనికకూటమి నుంచి వినాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ దౌత్యరంగ నిపుణులు చెప్పారు.  

భారత ఇంధన విధానాలు సర్వస్వతంత్రం 
ఏ దేశమైనా తమ ఇంధన అవసరాలకు తగ్గట్లు విదేశాంగ విధానాలను అవలంభిస్తుంది. భారత్‌ సైతం అదే పంథాను కొనసాగిస్తోంది. ఫలానా దేశం(రష్యా) నుంచి మీరు ముడిచమురు, సహజవాయువు కొనడానికి వీల్లేదనే హక్కు నాటోకు లేదు. అందులోనూ వలసరాజ్యంగా కాకుండా పూర్తి సార్వభౌమత్వం ఉన్న భారత్‌ను ఒక సైనికకూటమి ఎలా ఇలాంటి ఆర్థికపర సూచనలు చేస్తుందన్న ప్రశ్నకు నాటో సభ్య దేశాల నుంచి సమాధానం లేదు. 

పునర్‌వినియోగ ఇంధన వనరులతో ఇంధన రంగంలో స్వయం సమృద్ది ఆత్మనిర్భరత దిశగా వెళ్తున్న భారత్‌ మరోవైపు భిన్న దేశాల నుంచి ముడిచమురు, సహజవాయువులను దిగుమతిచేసుకుంటోంది. రష్యా, అమెరికా మొదలు పశి్చమాసియా, ఆఫ్రికా దాకా వేర్వేరు ఖండాల్లోని దేశాల నుంచి దిగుమతిచేసుకుంటోంది. భారత ఇంధన భద్రత విషయంలో వేలుపెట్టే అధికారం ఏ దేశానికీ లేదు. అలాంటప్పుడు కేవలం ఒక కూటమికి ఆ అధికారం ఎక్కడిది? అని పలువురు నిపుణులు సైతం విస్మయం వ్యక్తంచేశారు. భారత్‌ గనక నాటో హెచ్చరికలను సీరియస్‌గా తీసుకుంటే నాటోసభ్యదేశాలతో, ముఖ్యంగా అమెరికాతో దౌత్యబంధానికి స్వల్ప బీటలుపడే అవకాశం ఉంది.

సైనిక కూటమికి వాణిజ్యంతో పనేంటి? 
ఇరుదేశాల దౌత్య సంబంధాల్లో వేలుపెట్టి, బలవంతపు ఆదేశాలు జారీ చేసే హక్కు నాటోకు లేదు. తమ దేశాల రక్షణే లక్ష్యంగా ఏర్పడిన ఒక కూటమి(నాటో) ఇప్పుడు విదేశాల పరస్పర వాణిజ్య సంబంధాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అమెరికా స్వప్రయోజనాలు కాపాడే డమ్మీ వాణిజ్య విభాగం స్థాయికి నాటో పడిపోయిందని విమర్శలు పెరిగాయి.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement