breaking news
NATO chief
-
జాతీయ ప్రయోజనాలే ముఖ్యం
న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే, వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తే 100 శాతం టారిఫ్‌లు విధిస్తామంటూ ‘నాటో’ సెక్రెటరీ జనరల్ మార్క్ రుట్టే చేసిన హెచ్చరికలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తిప్పికొట్టారు. జాతీయ ప్రయోజనాలు, మార్క్ అవసరాల ఆధారంగానే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. తమకు దేశ ప్రయోజనాలు, అవసరాలే ముఖ్యమని తేల్చిచెప్పారు. రష్యా చమురు విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించొద్దని నాటోకు సూచించారు. రణధీర్ జైశ్వాల్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. మార్క్ రుట్టే హెచ్చరికలను నిశితంగా గమనిస్తున్నా మని చెప్పారు. భారత ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు ప్రజా ప్రయోజన కోణంలోనే ఉంటాయన్నారు. సుస్థిరమైన ఇంధన భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మార్కెట్లో తక్కువ ధరకు చమురు లభించినప్పుడు కొనడం సాధారణమేనని వివరించారు. రష్యా నుంచి యూరప్ దేశాలు చమురు కొనుగోలు చేస్తున్నారని రణధీర్ జైశ్వాల్ పరోక్షంగా ప్రస్తావించారు. రష్యా నుంచి చమురు కొనడం ఆపాలని, ఉక్రెయిన్‌పై యుద్ధం విరమించేలా రష్యాపై ఒత్తిడి పెంచాలని ఇండియా, చైనా, బ్రెజిల్‌కు మార్క్ రుట్టే సూచించిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి ఈ మూడు దేశాలే అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్నాయి. -
నాటోకు ఆ అధికారం ఎక్కడిది?
ప్రతిరోజూ మారుతున్న రాజకీయ, భౌగోళిక పరిస్థితుల్లో ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకోవడం, హెచ్చరికలు చేసుకోవడం ఇప్పుడు సర్వసాధారణమైంది. అయితే ఏకంగా ఒక దేశంపై ఎలాంటి అంతర్జాతీయ అధికారిక అర్హతలు లేని వ్యక్తి సుంకాల సుత్తితో మోదుతానని, ఆర్థిక ఆంక్షలు విధిస్తానని హెచ్చరికలు చేయడం చర్చనీయాంశమైంది. అంతర్జాతీయ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటిస్తూ అన్ని దేశాలతో మైత్రీభావంతో మెలిగే భారత్‌ను నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో) సెక్రటరీ జనరల్ హెచ్చరించడం అందరికీ విస్మయం కల్గిస్తోంది. కొన్ని దేశాలకే పరిమితమైన ఒక సైనిక కూటమికి సార్వభౌమ, గణతంత్ర దేశాన్ని హెచ్చరించే దమ్ము ఎక్కడిది? అనే ప్రశ్న ఇప్పుడు అందరి నోటా వినిపిస్తోంది. నాటో సభ్య దేశాలతో భారత దౌత్య సంబంధాలు దెబ్బతినేలా దుస్సాహసానికి తెగించిన నాటో చీఫ్ మార్క్ రుట్టేపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత వాణిజ్య విధానాలను ప్రశ్నించే అధికారం నాటోకుగానీ, నాటో చీఫ్కుగానీ అస్సలు లేదని అంతర్జాతీయ నిపుణులు సైతం బల్లగుద్ది చెబుతున్నారు. అంతర్జాతీయ వాణిజ్య సమీక్ష అధికారం నాటోకు లేదు నాటో అనేది కేవలం ఉత్తర అట్లాంటిక్ ఖండంలోని కొన్ని దేశాల సైనిక కూటమి మాత్రమే. ప్రపంచదేశాలు కుదుర్చుకుని పొరుగు, స్నేహపూర్వక దేశాలతో కుదుర్చుకునే వాణిజ్య ఒప్పందాల్లో నాటోకు ఎలాంటి ప్రమేయం, హక్కులు ఉండవు. సార్వభౌమత్వాన్ని సంతరించుకున్న భారత్ ఏ దేశంతో వాణిజ్యంచేసినా అది పూర్తి ఏకపక్షంగా తీసుకునే నిర్ణయం. ఇందులో జోక్యంచేసుకునే కనీస హక్కు, అర్హత నాటోకు లేదు. నాటో తన పరిధి దాటి ప్రవర్తిస్తోందని అంతర్జాతీయ వాణిజ్యరంగ నిపుణులు వ్యాఖ్యానించారు. అమెరికా విదేశాంగ విధానాలకు నాటో తలొగ్గిందనేది బహిరంగ రహస్యం. మరోవైపు చైనా, భారత్ సారథ్యంలో మరింత పటిష్టమవుతున్న బ్రిక్స్ కూటమి ఇప్పుడు అంతర్జాతీయ మారకమైన డాలర్ ఆధిపత్యానికి గండికొట్టి ప్రత్యామ్నాయ కరెన్సీని ముందుకు తేవొచ్చనే భయాందోళనలు అమెరికాను వెంటాడుతున్నాయి. అందుకే నాటోతో ఇలా అమెరికా పరోక్ష హెచ్చరికలు చేయిస్తోందని భావిస్తున్నారు. అంతర్జాతీయ వాణిజ్య విభేదాలు తలెత్తితే పరిష్కరించేందుకు ప్రపంచ వాణిజ్యసంస్థ(డబ్ల్యూటీఓ) ఉండనే ఉంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ విధుల్లోకి నాటో ఎందుకు తలదూర్చుతోందన్న విమర్శలు మొదలయ్యాయి. భారత్‌కు శాంతి సందేశాలు అక్కర్లేదు వేల సంవత్సరాల చరిత్రలో ఏనాడూ తనంతట తానుగా ఏ దేశం మీదా దండయాత్రకు దిగని దేశంగా భారత్ ఘనత సాధించింది. గతేడాది ఆగస్ట్‌లో నాటి అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో మాట్లాడిన మరుసటి రోజే పుతిన్‌తో మోదీ మాట్లాడి శాంతి ఒప్పందం చేసుకోవాలని సూచించిన విషయం తెల్సిందే. శాంతికాముక దేశంగా పేరొందిన భారత్‌కు ఉక్రెయిన్–రష్యా యుద్ధం విషయంలో శాంతి ప్రబోధాలు నాటో వంటి సైనికకూటమి నుంచి వినాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ దౌత్యరంగ నిపుణులు చెప్పారు. భారత ఇంధన విధానాలు సర్వస్వతంత్రం ఏ దేశమైనా తమ ఇంధన అవసరాలకు తగ్గట్లు విదేశాంగ విధానాలను అవలంభిస్తుంది. భారత్ సైతం అదే పంథాను కొనసాగిస్తోంది. ఫలానా దేశం(రష్యా) నుంచి మీరు ముడిచమురు, సహజవాయువు కొనడానికి వీల్లేదనే హక్కు నాటోకు లేదు. అందులోనూ వలసరాజ్యంగా కాకుండా పూర్తి సార్వభౌమత్వం ఉన్న భారత్‌ను ఒక సైనికకూటమి ఎలా ఇలాంటి ఆర్థికపర సూచనలు చేస్తుందన్న ప్రశ్నకు నాటో సభ్య దేశాల నుంచి సమాధానం లేదు. పునర్వినియోగ ఇంధన వనరులతో ఇంధన రంగంలో స్వయం సమృద్ది ఆత్మనిర్భరత దిశగా వెళ్తున్న భారత్ మరోవైపు భిన్న దేశాల నుంచి ముడిచమురు, సహజవాయువులను దిగుమతిచేసుకుంటోంది. రష్యా, అమెరికా మొదలు పశి్చమాసియా, ఆఫ్రికా దాకా వేర్వేరు ఖండాల్లోని దేశాల నుంచి దిగుమతిచేసుకుంటోంది. భారత ఇంధన భద్రత విషయంలో వేలుపెట్టే అధికారం ఏ దేశానికీ లేదు. అలాంటప్పుడు కేవలం ఒక కూటమికి ఆ అధికారం ఎక్కడిది? అని పలువురు నిపుణులు సైతం విస్మయం వ్యక్తంచేశారు. భారత్ గనక నాటో హెచ్చరికలను సీరియస్‌గా తీసుకుంటే నాటోసభ్యదేశాలతో, ముఖ్యంగా అమెరికాతో దౌత్యబంధానికి స్వల్ప బీటలుపడే అవకాశం ఉంది.సైనిక కూటమికి వాణిజ్యంతో పనేంటి? ఇరుదేశాల దౌత్య సంబంధాల్లో వేలుపెట్టి, బలవంతపు ఆదేశాలు జారీ చేసే హక్కు నాటోకు లేదు. తమ దేశాల రక్షణే లక్ష్యంగా ఏర్పడిన ఒక కూటమి(నాటో) ఇప్పుడు విదేశాల పరస్పర వాణిజ్య సంబంధాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అమెరికా స్వప్రయోజనాలు కాపాడే డమ్మీ వాణిజ్య విభాగం స్థాయికి నాటో పడిపోయిందని విమర్శలు పెరిగాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రష్యాతో వ్యాపారం చేస్తే ఊరుకోం
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై ఆక్రమణ జెండా ఎగరేసిన రష్యాను నిలువరించేందుకు దాని ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు నాటో కూటమి పరోక్ష చర్యలకు దిగింది. రష్యా నుంచి చమురు కొనుగోలుసహా పలురకాల వాణిజ్య కార్యకలాపాల కొనసాగిస్తున్న భారత్, చైనా, బ్రెజిల్‌లపై నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే హెచ్చరికలు చేశారు. రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను ఎదుర్కోవలసి ఉంటుందని రుట్టే బ్రెజిల్, చైనా, భారత్‌లను హెచ్చరించారు. బుధవారం అమెరికా సెనేటర్లతో వాషింగ్టన్లో సమావేశమైన అనంతరం మీడియాతో రుట్టే మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను శాంతి చర్చలకు ఒప్పించేలా పుతిన్‌పై భారత్, చైనా, బ్రెజిల్‌లు ఒత్తిడితేవాలని రుట్టే వ్యాఖ్యానించారు. ‘భారత ప్రధాన మంత్రి, చైనా అధ్యక్షుడు, బ్రెజిల్ అధ్యక్షుడు... మీరు ఎవరైనా కావొచ్చుగానీ రష్యాతో మీరు ముడిచమురు, సహజ వాయువు కొనుగోలుసహా వాణిజ్య వ్యాపారాలను వెంటనే ఆపేయండి. మీరో విషయం గుర్తుంచుకోవాలి. రష్యాలోని ఆ పెద్దమనిషి(పుతిన్) గనక ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందానికి ముందుకు రాకపోతే నేను టారిఫ్‌ల కొరడాతో రంగంలోకి దిగుతా. భారత్, బ్రెజిల్, చైనాలపై 100 శాతం టారిఫ్‌లు విధిస్తా. ఆర్థిక ఆంక్షలు సైతం విధిస్తా. నా ఈ హెచ్చరికలను మీరు చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిందే. లేదంటే దీని విపరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వాటిని మీరు ఎదుర్కోక తప్పదు. కొత్తగా ఈ 100 శాతం టారిఫ్‌ల బాధ తప్పాలంటే మీరు వెంటనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఒత్తిడి బాగా పెంచాలి. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు పుతిన్‌ను ఒప్పించాలి. పుతిన్ ఆ శాంతి చర్చలకు కట్టుబడి ఉండాలి. పుతిన్‌కు వెంటనే ఫోన్ చేసి, శాంతి చర్చలపై మరింత సీరియస్‌గా ఆలోచించాలని సూచనలు చేయండి. మీరు చర్చలపై ముందడుగువేయకుంటే నాటో మాపై 100 శాతం టారిఫ్‌లు విధిస్తుందట అని పుతిన్‌కు చెప్పండి. శాంతి ఒప్పందంగనక సాధ్యంకాకపోతే మీ మూడు దేశాలపై టారిఫ్‌లు విధించడం ఖాయం. ఈ గుదిబండను మీరు మోయకతప్పదు’’’ అని రుట్టే హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు సైనిక మద్దతు మరింత పెంచుతామని, రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలపై టారిఫ్‌లను విపరీతంగా పెంచుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజు రుట్టే ఇలా భారత్‌ను హెచ్చరిస్తూ వ్యాఖ్యలుచేయడం గమనార్హం. రష్యా, దాని భాగస్వాములపై 100 శాతం సుంకాలు విధిస్తాం: అమెరికా రష్యా ఎగుమతులపై 100 శాతం సుంకాలను విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. 50 రోజుల్లోపు ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకోకపోతే రష్యా నుంచి ముడిచమురును కొనుగోలుచేసే దేశాలపై మరోదఫా ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ‘50 రోజుల్లోపు శాంతి ఒప్పందం కుదరాల్సిందే. అది జరక్కపోతే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. టారిఫ్‌ల మోత మోగిస్తా. ఇతర ఆర్థిక ఆంక్షలు మోపుతా’’ అని ట్రంప్ ప్రకటించారు. అమెరికా కాంగ్రెస్ ఆమోదం అవసరం లేకుండానే మరోదఫా టారిఫ్‌లను అమలు చేయవచ్చన్నారు. అత్యధిక కొనుగోలుదారుల్లో భారత్ తాజా అంతర్జాతీయ వాణిజ్య నివేదికల ప్రకారం రష్యా నుంచి ముడి చమురును అధికంగా దిగుమతి చేసుకుంటున్న, కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్, చైనా, తుర్కియే తొలి వరసలో ఉన్నాయి. ట్రంప్ నిజంగానే ఆర్థిక ఆంక్షలు విధిస్తే భారత్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్న ఈ తరుణంలో ట్రంప్ కొత్తగా టారిఫ్‌ల కొరడా ఝులిపిస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలకు అంతరాయం కలిగే వీలుంది. ట్రంప్ బెదిరింపులపై రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ దీటుగా స్పందించారు. ‘ ట్రంప్‌తో చర్చలు జరపడానికి రష్యా సిద్ధంగా ఉంది. కానీ రష్యానే బెదిరించాలని చూడటం తగదు. అలి్టమేటం జారీ చేయడం అస్సలు ఆమోదయోగ్యం కాదు. ఇలాంటి చర్యలు సానుకూల ఫలితాలను ఇవ్వవని గుర్తుంచుకుంటే మంచిది’ అని సెర్గీ వ్యాఖ్యానించారు. -
NATO Summit 2025: డాడీ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కొత్తగా ఒక నిక్‌నేమ్ వచ్చి చేరింది. అదేమిటో తెలుసా?.. డాడీ. అంటే నాన్న అని తెలిసిందేగా. నాటో సదస్సు సందర్భంగా ట్రంప్‌ను డాడీ అని పిలుస్తున్న వీడియోను వైట్‌హౌస్ తాజాగా విడుదల చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై మీడియాతో మాట్లాడుతున్న ట్రంప్‌ను పక్కనే ఉన్న నాటో చీఫ్ మార్క్ రుట్టే సరదాగా డాడీ అని సంబోధించారు. ఒక నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోను ‘డాడీస్ హోమ్. హే, హే, హే, డాడీ’ అని శీర్షికతో శ్వేతసౌధం షేర్ చేసింది. ఇది జనాన్ని బాగా ఆకట్టుకుంటోంది. వారు తమకు తోచిన రీతిలో ప్రతిస్పందిస్తున్నారు. నెదర్లాండ్స్‌లోని హేగ్ నగరంలో నాటో సదస్సుకు ట్రంప్ హాజరయ్యారు. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం ముగిసిపోయేలా తానే చొరవ తీసుకున్నానని ఆయన చెప్పారు. ఇంతలో నాటో చీఫ్ మార్క్ రుట్టే మాట్లాడుతూ.. డాడీ (ట్రంప్) ఇరు దేశాలకు బలమైన భాషలో చెప్పారని వ్యాఖ్యానించారు. తర్వాత డాడీ అన్ని సంబోధనపై ట్రంప్ స్పందించారు. అది చాలా ఆప్యాయత, అనురాగంతో కూడిన సంబోధన అని ఆనందం వ్యక్తం చేశారు. -
Russia-Ukraine War: కొనసాగుతున్న దాడులు
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడుల పరంపర కొనసాగుతోంది. నేరుగా జనావాసాలను లక్ష్యంగా చేసుకొని రష్యా మిలటరీ దాడులు చేస్తోంది. అవిడ్వికా, నిక్పోల్, జపోరిజియా నగరాలపై ఎస్–300 క్షిపణులతో దాడి చేస్తోంది. అవిడ్వికా మార్కెట్‌పై జరిగిన క్షిపణి దాడిలో ఏడుగురు మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కాగా, యుద్ధం ఎన్నాళ్లు కొనసాగినా ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని నాటో స్పష్టం చేసింది. బ్రస్సెల్స్‌లో జరిగిన నాటో 50 దేశాల సమావేశాం అనంతరం కూటమి చీఫ్ జెన్స్ స్టోలెన్‌బర్గ్ మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్‌కు గగనతల రక్షణ వ్యవస్థను అందించడానికి తాము అధిక ప్రాధాన్యం ఇస్తామని స్టోలెన్‌బర్గ్ స్పష్టంచేశారు. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా అణు దాడికి దిగుతుందని తాను భావించడం లేదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అభిప్రాయపడ్డారు. అయితే అణు దాడికైనా వెనుకాడమని రష్యా అధినేత హెచ్చరించడం ఆయన బాధ్యతరాహిత్యాన్ని బయటపెడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉక్రెయిన్ మిలటరీ సామర్థ్యాన్ని, పశ్చిమ దేశాల అండను పుతిన్ తక్కువగా అంచనా వేశారని వ్యాఖ్యానించారు. మరోవైపు కెర్చ్ వంతెన పేలుడుకు సంబంధించి ఐదుగురు రష్యన్లు, ముగ్గురు ఉక్రెనియన్లను రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ అరెస్ట్ చేసింది. -
Russia-Ukraine war: ఏళ్ల తరబడి ఉక్రెయిన్ యుద్ధం!
కీవ్: ఉక్రెయిన్–రష్యా యుద్ధం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో ఎవరికీ తెలియదని నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ చెప్పారు. జర్మనీ వార పత్రికకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇరు దేశాల నడుమ యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగే అవకాశం ఉందని, దానికి అందరూ సిద్ధపడాలని చెప్పారు. ప్రపంచదేశాలు ఉక్రెయిన్‌కు వివిధ రూపాల్లో ఇస్తున్న మద్దతును ఇలాగే కొనసాగించాలని సూచించారు. మద్దతును బలహీనపర్చరాదని అన్నారు. జవాన్లను కలుసుకున్న జెలెన్స్కీ చాలారోజులుగా రాజధాని కీవ్కే పరిమితం అవుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా మైకోలైవ్, ఒడెసాలో జవాన్లను, ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందిని కలుసుకున్నారు. స్వయంగా మాట్లాడి, వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. తాజా పరిణామాలపై ఆరా తీశారు. విశేషమైన సేవలందిస్తున్న పలువురికి బహుమతులు ప్రదానం చేశారు. వారి సేవలకు గాను కృతజ్ఞతలు తెలిపారు. మైకోలైవ్‌లో జెలెన్స్కీ పర్యటన ముగిసిన కొద్దిసేపటి తర్వాత రష్యా సేనలు విరుచుకుపడ్డాయి. ప్రావ్డైని, పొసద్–పొక్రోవ్స్క్, బ్లహోదట్నే ఉక్రెయిన్ సైనిక స్థావరాలపై ఫిరంగులతో దాడి చేశాయి. గలిస్టీన్ కమ్యూనిటీలో రష్యా దాడుల్లో ఇద్దరు మరణించారు. జవాన్లలో అడుగంటుతున్న నైతిక స్థైర్యం! ఉక్రెయిన్– రష్యా మధ్య నాలుగు నెలలుగా యుద్ధం కొనసాగుతోంది. ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. నెలల తరబడి తమ కుటుంబాలకు దూరంగా ఉంటున్న సైనికుల్లో నైతిక స్థైర్యం సన్నగిల్లుతోంది. తరచూ సహనం కోల్పోతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. ఇరు దేశాల సైన్యంలో ఇదే పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని బ్రిటన్ రక్షణ శాఖ వెల్లడించింది. డోన్బాస్లో ఇరు పక్షాల నడుమ భీకర పోరాటం సాగుతోందని, ఆదే సమయంలో జవాన్లు నిరాశలో మునిగిపోతున్నారని పేర్కొంది. -
Russia-Ukraine war: తూర్పున దాడి ఉధృతం
ఇర్పిన్: ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై రష్యా దాడులను తీవ్రం చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ముట్టడి విఫలమైన తర్వాత రష్యా తన దృష్టిని తూర్పు ఉక్రెయిన్‌వైపు మరలించింది. ఈ ప్రాంతంలో ఉక్రెయిన్‌కు కీలకమైన పరిశ్రమలున్నాయి. దీన్ని స్వాధీనం చేసుకుంటే ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయవచ్చని రష్యా భావిస్తోంది. డోన్బాస్ ప్రాంతంలో రష్యా కాల్పులు అధికమయ్యాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. మారియుపోల్‌లో ఇప్పటికీ ఉంటున్న పౌరులు మరిన్ని ఇక్కట్లు పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఆ నగరంలోని స్టీల్‌ప్లాంట్‌పై రష్యా దాడి ముమ్మరమైనట్లు శాటిలైట్ చిత్రాలు చూపుతున్నాయి. మరోవైపు ఉక్రెయిన్‌లో ఐరాస చీఫ్ గుటెరస్ పర్యటన కొనసాగుతోంది. యుద్ధంలో అధిక మూల్యం చెల్లించేది చివరకు సామాన్య ప్రజలేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధనేరాల గురించి మాట్లాడాల్సివస్తే, అసలు యుద్ధమే నేరమని చెప్పాలన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌కు సహాయం కొనసాగిస్తామని బల్గేరియా కొత్త ప్రధాని భరోసా ఇచ్చారు. రష్యా పౌర నివాసాలపై దాడులకు దిగుతోందని ఉక్రెయిన్ అధికారులు ఆరోపించారు. తమ అధీనంలో ఉన్న ఖెర్సాన్ నగరంలో పేలుళ్లు జరిగాయని రష్యా తెలిపింది. పోరు కొనసాగించేందుకు తమకు మరిన్ని ఆయుధాలందించాలని ఉక్రెయిన్ మిత్ర దేశాలను కోరింది. నాటో సాయం 800 కోట్ల డాలర్లు ఇప్పటివరకు ఉక్రెయిన్‌కు నాటో దేశాలు దాదాపు 800 కోట్ల డాలర్ల సాయం అందించాయని నాటో చీఫ్ స్టోల్టెన్‌బర్గ్ చెప్పారు. ఉక్రెయిన్‌కు మరింత సాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. నాటోలో చేరాలనుకుంటే ఫిన్లాండ్, స్వీడన్‌ను సాదరంగా స్వాగతిస్తామని చెప్పారు. రష్యాతో యుద్ధం సంవత్సరాలు కొనసాగినా, తాము ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తామన్నారు. కొత్త శతాబ్దిలో యుద్ధాలు ఆమోదయోగ్యం కావని ఐరాస చీఫ్ గుటెరస్ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ యుద్ధంలో నేరాలపై ఐసీసీతో విచారణకు తాను మద్దతిస్తానన్నారు. ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలను ఆయన సందర్శించారు. -
టర్కీ పర్యటనకు నాటో చీఫ్
అంకారా: నాటో సెక్రటరీ జనరల్ ఆండర్స్ ఫోగ్ రొస్ముసెన్ టర్కీ పర్యటనకు వెళ్లనున్నారు. టర్కీ దేశస్తులను ఇరాక్‌లో బంధీలుగా ఉంచిన సంఘనటపై చర్చించనున్నారు. ఇలాంటి చర్యల వలన న్యాయం జరగదని, బంధీలను వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. టర్కీ పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు అబ్దుల్లా గుల్, ప్రధాని రెసెప్ టయ్యిప్లతో నాటో చీఫ్ బేటీ కానున్నారు. ఇరాక్‌కు చెందిన తీవ్రవాదులు బుధవారం టర్కీ కాన్సులేట్‌పై దాడి చేసి 49 మందిని కిడ్నాప్ చేశారు. వీరిలో దౌత్యాధికారులు, సైనికులు, విద్యార్థులు ఉన్నారు. వీరితో పాటు ఓ పవర్ ప్లాంట్ నుంచి మరో 31 మంది టర్కీ దేశస్తులను కిడ్నాప్ చేశారు.