రష్యాతో వ్యాపారం చేస్తే  ఊరుకోం  | NATO Chief Warns India, China And Brazil Over Russia Trade GLBS, More Details Inside | Sakshi
Sakshi News home page

రష్యాతో వ్యాపారం చేస్తే  ఊరుకోం 

Jul 16 2025 7:35 AM | Updated on Jul 17 2025 5:05 AM

Nato Chief Warns India Over Russia Trade Glbs

భారత్‌పై 100 శాతం టారిఫ్‌లు విధిస్తాం 

నాటో సెక్రటరీ జనరల్‌ హెచ్చరిక 

బ్రెజిల్, చైనాలనూ హెచ్చరించిన మార్క్‌ రుట్టే 

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌పై ఆక్రమణ జెండా ఎగరేసిన రష్యాను నిలువరించేందుకు దాని ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు నాటో కూటమి పరోక్ష చర్యలకు దిగింది. రష్యా నుంచి చమురు కొనుగోలుసహా పలురకాల వాణిజ్య కార్యకలాపాల కొనసాగిస్తున్న భారత్, చైనా, బ్రెజిల్‌లపై నాటో సెక్రటరీ జనరల్‌ మార్క్‌ రుట్టే హెచ్చరికలు చేశారు. రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను ఎదుర్కోవలసి ఉంటుందని రుట్టే బ్రెజిల్, చైనా, భారత్‌లను హెచ్చరించారు.

 బుధవారం అమెరికా సెనేటర్లతో వాషింగ్టన్‌లో సమావేశమైన అనంతరం మీడియాతో రుట్టే మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను శాంతి చర్చలకు ఒప్పించేలా పుతిన్‌పై భారత్, చైనా, బ్రెజిల్‌లు ఒత్తిడితేవాలని రుట్టే వ్యాఖ్యానించారు. ‘భారత ప్రధాన మంత్రి, చైనా అధ్యక్షుడు, బ్రెజిల్‌ అధ్యక్షుడు... మీరు ఎవరైనా కావొచ్చుగానీ రష్యాతో మీరు ముడిచమురు, సహజ వాయువు కొనుగోలుసహా వాణిజ్య వ్యాపారాలను వెంటనే ఆపేయండి. 

మీరో విషయం గుర్తుంచుకోవాలి. రష్యాలోని ఆ పెద్దమనిషి(పుతిన్‌) గనక ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందానికి ముందుకు రాకపోతే నేను టారిఫ్‌ల కొరడాతో రంగంలోకి దిగుతా. భారత్, బ్రెజిల్, చైనాలపై 100 శాతం టారిఫ్‌లు విధిస్తా. ఆర్థిక ఆంక్షలు సైతం విధిస్తా. నా ఈ హెచ్చరికలను మీరు చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిందే. లేదంటే దీని విపరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వాటిని మీరు ఎదుర్కోక తప్పదు. 

కొత్తగా ఈ 100 శాతం టారిఫ్‌ల బాధ తప్పాలంటే మీరు వెంటనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఒత్తిడి బాగా పెంచాలి. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు పుతిన్‌ను ఒప్పించాలి. పుతిన్‌ ఆ శాంతి చర్చలకు కట్టుబడి ఉండాలి. పుతిన్‌కు వెంటనే ఫోన్‌ చేసి, శాంతి చర్చలపై మరింత సీరియస్‌గా ఆలోచించాలని సూచనలు చేయండి. మీరు చర్చలపై ముందడుగువేయకుంటే నాటో మాపై 100 శాతం టారిఫ్‌లు విధిస్తుందట అని పుతిన్‌కు చెప్పండి.

 శాంతి ఒప్పందంగనక సాధ్యంకాకపోతే మీ మూడు దేశాలపై టారిఫ్‌లు విధించడం ఖాయం. ఈ గుదిబండను మీరు మోయకతప్పదు’’’ అని రుట్టే హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు సైనిక మద్దతు మరింత పెంచుతామని, రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలపై టారిఫ్‌లను విపరీతంగా పెంచుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన మరుసటి రోజు రుట్టే ఇలా భారత్‌ను హెచ్చరిస్తూ వ్యాఖ్యలుచేయడం గమనార్హం.   

రష్యా, దాని భాగస్వాములపై 100 శాతం సుంకాలు విధిస్తాం: అమెరికా 
రష్యా ఎగుమతులపై 100 శాతం సుంకాలను విధిస్తామని ట్రంప్‌ హెచ్చరించారు. 50 రోజుల్లోపు ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకోకపోతే రష్యా నుంచి ముడిచమురును కొనుగోలుచేసే దేశాలపై మరోదఫా ఆంక్షలు విధిస్తామని ట్రంప్‌ హెచ్చరించారు. ‘50 రోజుల్లోపు శాంతి ఒప్పందం కుదరాల్సిందే. అది జరక్కపోతే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. టారిఫ్‌ల మోత మోగిస్తా. ఇతర ఆర్థిక ఆంక్షలు మోపుతా’’ అని ట్రంప్‌ ప్రకటించారు. అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం అవసరం లేకుండానే మరోదఫా టారిఫ్‌లను అమలు  చేయవచ్చన్నారు. 

అత్యధిక కొనుగోలుదారుల్లో భారత్‌ 
తాజా అంతర్జాతీయ వాణిజ్య నివేదికల ప్రకారం రష్యా నుంచి ముడి చమురును అధికంగా దిగుమతి చేసుకుంటున్న, కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్, చైనా, తుర్కియే తొలి వరసలో ఉన్నాయి. ట్రంప్‌ నిజంగానే ఆర్థిక ఆంక్షలు విధిస్తే భారత్‌ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. 

ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్న ఈ తరుణంలో ట్రంప్‌ కొత్తగా టారిఫ్‌ల కొరడా ఝులిపిస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలకు అంతరాయం కలిగే వీలుంది. ట్రంప్‌ బెదిరింపులపై రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్‌కోవ్‌ దీటుగా స్పందించారు. ‘ ట్రంప్‌తో చర్చలు జరపడానికి రష్యా సిద్ధంగా ఉంది. కానీ రష్యానే బెదిరించాలని చూడటం తగదు. అలి్టమేటం జారీ చేయడం అస్సలు ఆమోదయోగ్యం కాదు. ఇలాంటి చర్యలు సానుకూల ఫలితాలను ఇవ్వవని గుర్తుంచుకుంటే మంచిది’ అని సెర్గీ వ్యాఖ్యానించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement