
రష్యా చమురు విషయంలో ద్వంద్వ ప్రమాణాలు వద్దు
విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే, వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తే 100 శాతం టారిఫ్‌లు విధిస్తామంటూ ‘నాటో’ సెక్రెటరీ జనరల్ మార్క్ రుట్టే చేసిన హెచ్చరికలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తిప్పికొట్టారు. జాతీయ ప్రయోజనాలు, మార్క్ అవసరాల ఆధారంగానే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. తమకు దేశ ప్రయోజనాలు, అవసరాలే ముఖ్యమని తేల్చిచెప్పారు. రష్యా చమురు విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించొద్దని నాటోకు సూచించారు. రణధీర్ జైశ్వాల్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
మార్క్ రుట్టే హెచ్చరికలను నిశితంగా గమనిస్తున్నా మని చెప్పారు. భారత ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు ప్రజా ప్రయోజన కోణంలోనే ఉంటాయన్నారు. సుస్థిరమైన ఇంధన భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మార్కెట్‌లో తక్కువ ధరకు చమురు లభించినప్పుడు కొనడం సాధారణమేనని వివరించారు. రష్యా నుంచి యూరప్ దేశాలు చమురు కొనుగోలు చేస్తున్నారని రణధీర్ జైశ్వాల్ పరోక్షంగా ప్రస్తావించారు. రష్యా నుంచి చమురు కొనడం ఆపాలని, ఉక్రెయిన్‌పై యుద్ధం విరమించేలా రష్యాపై ఒత్తిడి పెంచాలని ఇండియా, చైనా, బ్రెజిల్‌కు మార్క్ రుట్టే సూచించిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి ఈ మూడు దేశాలే అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్నాయి.